పిడుగు నుంచి కాపాడుకునే విధానం చెబుతుండగానే.. పాఠశాల భవనంపై పిడుగు పడింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కృష్ణశాస్త్రులపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 25 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రధానోపాధ్యాయిని హైమావతి పిడుగుబారి నుంచి తప్పించుకునే విధానంపై అవగాహన కల్పిస్తూ ప్రాక్టికల్ చేయిస్తున్నారు. ఇదే సమయంలో పెద్ద శబ్దంతో పాఠశాల భవనంపై పిడుగుపడింది. దీంతో కొద్దిసేపు ఆందోళనకు గురైన పిల్లలు, పాఠశాల సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. పిడుగు పాటుకు భవనం శ్లాబ్ ఓ వైపు రెండు అడుగులమేర ఊడిపోయింది. శ్లాబ్ నుంచి పెచ్చులు రాలి విద్యుత్‌మీటర్‌పై పడడంతో అది పేలిపోగా, విద్యుత్‌తీగలు, ఫ్యాన్లు కాలిపోయాయి. పాఠశాల భవనంపై పిడుగుపడినట్టు తెలుసుకున్న గ్రామస్తులంతా సంఘటనా స్థలానికి చేరుకొని తమ పిల్లల యోగక్షేమాలపై ఆరా తీశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలాన్ని మండల విద్యాశాఖాధికారి యాగాటి దుర్గారావు, తహసీల్దార్ బి.సత్యనారాయణలు సందర్శించారు.