నరకయాతన | Narakayatana | Sakshi
Sakshi News home page

నరకయాతన

Published Thu, Oct 30 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:34 PM

నరకయాతన

నరకయాతన

పై ఫోటోలో కటకటాల్లో ఉన్నట్లు కనిపిస్తున్న వారు సుబ్బరామిరెడ్డి, హైమావతి. రైల్వేకోడూరు మండలం మాధవరంపోడుకు చెందిన దంపతులు. కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలనేది వారి లక్ష్యం. నాలుగు రూకలు వెనుకోసుకుందామని జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లారు. భార్యాభర్తలు అక్కడే అద్దెకు గది తీసుకుని  జీవనాన్ని సాగించేవారు.  

అదే గృహ సముదాయంలో హైదరాబాద్‌కు చెందిన ఒకరు నివాసం ఉండేవారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతూ అక్కడి పోలీసులు గుర్తించేలోపు పరారీ అయ్యాడు. ఆ వ్యక్తి సుబ్బరామిరెడ్డికి సంబంధించిన వాడని.. ఆకేసును ఈ దంపతులపై పెట్టారు.

అక్కడి కోర్టు 25 ఏళ్ల  శిక్ష విధించింది. ఏడాదిన్నరగా ఆ దంపతులు జైల్లో మగ్గుతున్నారు. ప్రస్తుతం సుబ్బరామిరెడ్డి రెండు కిడ్నీలు చెడిపోయాయి. అన్యాయంగా ఆ కుటుంబాన్ని జైలు పాలు చేశారంటూ అక్కడి తెలుగువారు వాపోతున్నా పట్టించుకునే నాధుడే లేరు. అండగా నిలవాల్సిన భారత ఎంబసీ అధికారుల్లో ఆశించిన స్పందన లేదు. ఇలా సుబ్బరామిరెడ్డి దంపతులే కాదు. సుమారు 4వేల మంది కువైట్ జైల్లో మగ్గుతున్నట్లు తెలుస్తోంది.

 
 సాక్షి ప్రతినిధి, కడప:

 కువైట్..సౌదీ.. బతుకు దెరువు కోసం లక్షల మంది తెలుగువాళ్లు ఈ దేశాలకు వెళ్లారు. వెళ్లిన వారు ఒక్కో దేశంలో ఒక్కో సమస్యను ఎదుర్కొంటున్నారు. సౌదీలోని కొత్త చట్టాలతో అక్కడి తెలుగువాళ్లు జైళ్లకు వెళ్లే పరిస్థితి తలెత్తుతుండగా... కువైట్‌లో సంబంధంలేని కేసుల పేరుతో జైలుకు పంపుతున్నారు. తమను ఆదుకోవాలని బాధితులు భారత రాయబార కార్యాలయానికి వెళుతుంటే ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే జైలుకు వెళ్లడమో, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడమో తప్పదంటున్నారు.

 తప్పు చేయకపోయినా తప్పని శిక్ష....
 జిల్లా నుంచి దాదాపు రెండు లక్షల మంది  గల్ఫ్‌లోని యునెటైడ్ అర బ్ ఎమిరెట్స్(యూఏఈ), సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, దోహఖతర్, ఓమన్ తదితర దేశాలకు వలసవెళ్లారు. ఇందులో అనేక కారణాలతో వేలాదిమంది ఖల్లివెల్లి(అక్రమ నివాసులు) కార్మికులుగా మారారు. అలాంటి వారి బాధలు వర్ణణాతీతం. ఇళ్లల్లో పనులకు వెళ్లిన వారి పరిస్థితి మరీ ఘోరంగా ఉందని వాపోతున్నారు. సేఠ్‌ల ఇళ్లలోని వారి మధ్య తేడాలొచ్చినా తెలుగువారినే కారకులుగా చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. తప్పు  చేయకపోయినా బాధ్యులను చేస్తూ జైల్లో నిర్బంధిస్తున్నారని వాపోతున్నారు.

 పరిస్థితి దారుణంగా ఉంది: సుబ్బరాయుడు, రాజంపేట.
 ‘కువైట్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. చేయని తప్పుకు  శిక్షలు వేస్తున్నారు.  మాతోపాటు  నివాసం ఉండే సుబ్బరామిరెడ్డి దంపతులపై  అకారణంగా కేసు పెట్టి జైలుకు పంపారు. ఎంతటి కఠినతరమైన పరిస్థితి ఉన్నా భరించాలేకానీ, ప్రశ్నించే పరిస్థితిలేదు.  ఇక్కడి పరిస్థితి చూసి ఇంటికి వద్దామనుకున్నా  రాలేక పోతున్నాము.. బిక్కుబిక్కు మంటూ జీవనం గడుపుతున్నాం.

 ఎంబసీ తీరు దారుణం: శ్రీను నెర్సుపల్లె, చ క్రాయపేట.  
 తెలుగువాళ్లకు అన్యాయం జరిగితే స్పందించాల్సిన ఎంబసీ అన్యాయంగా వ్యవహరిస్తోంది. సుబ్బరామిరెడ్డి దంపతుల కోసం అధికారులందరినీ ప్రాధేయపడ్డాం. వారి నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. మాతోపాటుగా జీవనోపాధికోసం వచ్చిన శ్రీలంక, ఫిలిప్పిన్స్ తదితర దేశాల ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా వారి ఎంబసీ అధికారులు తక్షణమే స్పందిస్తున్నారు. రంజాన్ మాసంలో నీళ్లు తాగారని తుపాకితో కాల్చి చంపారు. మహిళలకు వేధింపులు అధికంగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement