నన్నూ చంపేశారు | Yamini, srilekhala family interview with the mother haimavati | Sakshi
Sakshi News home page

నన్నూ చంపేశారు

Published Sun, Aug 2 2015 11:30 PM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM

నన్నూ చంపేశారు

నన్నూ చంపేశారు

ఇద్దరు ఆడపిల్లల్ని రెండు కళ్ళలా చూసుకుంది.
కనుచూపు మేర కనబడిందల్లా సాధించేలా పెంచింది.
ఆడపిల్లలైతేనేం... కొడుకుల కంటే బలవంతులని నమ్మింది.
తన ప్రేమే ఆ ఇద్దరు పిల్లల్ని కాపాడుతుందని భావించింది.

 
కానీ ప్రేమను ఉన్మాదం చంపేస్తుందని ఊహించలేదు! సమాజం మొద్దుబారిపోయింది. నా పిల్లల్నే కాదు, నన్నూ చంపేశారు అంటోంది. దీంట్లో నా పిల్లల తప్పేంటి? నా తప్పేంటి?! అని అడుగుతోంది. ‘వాడి’ తల్లిదండ్రుల పెంపకం బాగుంటే నా పిల్లలు బతికుండేవారని వాపోతోంది. ఏడ్చి ఏడ్చి కన్నీరు ఇంకిపోయింది. కుమిలి కుమిలి ప్రాణం పెగిలిపోయింది. తనలాగ ఇంకొక తల్లికి
 జరక్కూడదు. తన పిల్లల్లా ఏ ఆడపిల్లకీ జరక్కూడదు అని ఆశిస్తోంది.  
 ... ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయిన
 యామిని, శ్రీలేఖల తల్లి హైమావతితో ఫ్యామిలీ ఇంటర్వ్యూ
 
‘‘ఏ అర్ధరాత్రో కలత నిద్రలోకి జారుకుంటాను...‘మమ్మీ!’ అని పిలుపు... ఆశగా వెంటనే బయటకు వచ్చి చూస్తాను. యామిని లేదు. శ్రీలేఖా లేదు. కళ్ల ముందు అంతా చీకటి. శూన్యం. నా జీవితంలో ఇక మిగిలింది అదే!’’ ఏడ్చి ఏడ్చి గుండె తడి ఆరిపోయిన హైమావతి చెప్పిన మాటలివి. కిందటినెల 14వ తారీఖున హైదరాబాద్ కొత్తపేటలో ఓ దారుణం జరిగింది. యామినీసరస్వతి, శ్రీలేఖ అనే ఇద్దరు అక్కచెల్లెళ్లను అమిత్‌సింగ్ అనే ఓ ఉన్మాది ప్రేమ పేరుతో దారుణంగా హత్య చేశాడు. కూతుళ్లే లోకంగా, వారి భవిష్యత్తే తన కలగా బతుకుతున్న ఆ తల్లికి తీరని కడుపు శోకాన్ని మిగిల్చాడు. తనకు జరిగిన ఈ అన్యాయం బిడ్డలున్న ఏ తల్లీతండ్రికి జరగకూడదని చెబుతున్న హైమావతి వ్యధ ఇది...  

‘‘మొన్న జూన్‌లో నా పుట్టిన రోజు వస్తే, ఎన్నడూ లేనిదీ ఇద్దరికిద్దరు తెగ హడావిడి చేశారు. అప్పుడప్పుడు నేను పాకెట్‌మనీగా ఇచ్చిన డబ్బులను దాచుకొని, అర్ధరాత్రి కేక్ కట్ చేయించి సర్‌ప్రైజ్ చేశారు. ‘ఇవన్నీ ఎందుకర్రా’ అంటే ‘మా కోసం ఎంతో కష్టపడుతున్నావు అమ్మా! నీకోసం ఈ మాత్రం చేయలేమా!’ అన్నారు. ‘ఇంకో మూడు నెలల్లో అక్క పెళ్లయిపోతుంది. మరో ఏడాదిలో నేను ఫారిన్ వెళ్లి, జాబ్ చేసి, నీకు బోలెడు డబ్బులు పంపిస్తా. అప్పుడు నువ్విలా రోజూ బస్సులో అంతేసి దూరం వెళ్లే బాధ తప్పుతుంది’ అంది శ్రీలేఖ. ‘పెళ్లయినా నేను మమ్మీదగ్గరే ఉంటాను..’ గారాలు పోయింది యామినీ. నా బిడ్డలకు నేనంటే ఎంత ప్రేమ అని కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇద్దరికీ రెండేళ్లే తేడా. ఎంత బాగుంటారో స్నేహితుల్లా అనేవారు చూసినవారంతా! ఇద్దరి మధ్య అంత ఆప్యాయత ఉండేది. అక్కచెల్లెళ్లు అంటే చిన్న చిన్న గొడవలైనా ఉండటం సహజం అనుకుంటారంతా! కానీ వీరిద్దరూ దేనికీ గొడవపడేవారే కాదు. పరిస్థితులను అర్థం చేసుకొని, మసలుకునేవారు. శ్రీలేఖ పుట్టినప్పుడు ఒక్కక్షణం - కొడుకైతే బాగుండు, ఒక అమ్మాయి- ఒక అబ్బాయి ఉంటారు కదా అనుకున్నాను. కానీ, శ్రీలేఖ పుట్టాక ఇద్దరికీ ఒకరికొకరు తోడు అనుకున్నాను. అలాగే పెరిగారు. మా వారు (కృష్ణారెడ్డి. కండక్టర్) ఉద్యోగరీత్యా పిల్లలు నిద్రలేవకముందే డ్యూటీకెళ్లిపోయేవారు. వాళ్లు పడుకున్నాక ఇంటికి వచ్చేవారు. ఆ విధంగా వారికి నాతోనే అటాచ్‌మెంట్ ఎక్కువ. కిందటేడాది వరకు మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లోనే ఉన్నాం. అక్కడే సర్వశిక్ష అభియాన్‌లో ఉద్యోగం చేస్తున్నాను. పిల్లలను కనిపెట్టుకొని ఉండటానికి మా అమ్మ నాతోనే ఉండేది.

 ఏడాది క్రితం...
 యామినీ ఇంజనీరింగ్ చదువైపోయింది. శ్రీలేఖ చదువు ఇంకో ఏడాదిలో పూర్తవుతుంది. యామిని పోటీ పరీక్షలకు ప్రిపేరవుతూ, కోచింగ్ తీసుకుంటోంది. శ్రీలేఖ పై చదువుల కోసం ప్లాన్.. ఇవన్నీ హైదరాబాద్‌లో ఉంటే సరిగ్గా అవుతాయనే ఉద్దేశంతో షాద్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాం. సాగర్‌రింగ్‌రోడ్‌లోనే మా తమ్ముడి కుటుంబం ఉంటుంది. అన్నింటికీ అందుబాటులో ఉంటుందనే కొత్తపేటలో ఇల్లు తీసుకున్నాం. అమ్మ ఎలాగూ నాతోనే ఉంటుంది. ఇవన్నీ చూసుకునే నేను ఉద్యోగానికి భరోసాగా వెళ్లేదాన్ని. ఈ రోజుల్లో ఆడపిల్లలకు బయట ఎలాంటి రక్షణ ఉందో చూస్తూనే ఉన్నాం. అందులోనూ నేను పొద్దున్నే డ్యూటీకి వెళితే, తిరిగి రాత్రికి గాను రాను. అందుకే చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి, బయల్దేరేదాన్ని.

 మూడు నెలల క్రితం...
 యామినికీ ఓ సాఫ్ట్‌వేర్ సంబంధం వచ్చింది. అన్నివిధాల నచ్చిన సంబంధం. మే 31న ఎంగే జ్‌మెంట్ చేశాం. అక్టోబర్‌లో పెళ్లి అనుకున్నాం. అక్క ఎంగేజ్‌మెంట్‌లో శ్రీలేఖదే హడావిడి అంతా! శ్రీలేఖ కలలు ఒకలా ఉన్నా, ఇంకో రెండేళ్లలో తన పెళ్లి కూడా చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది అనుకున్నాను.

 ఆర్నెల్ల క్రితం...
 శ్రీలేఖ ఒకసారి చెప్పింది తనతో పాటు చదివిన ఒకబ్బాయి వేధిస్తున్నాడని... నా గుండెలో రాయి పడినంత భయమేసింది. ఆ అబ్బాయిని మా తమ్ముడు వెళ్లి మందలించాడు. అతని తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడాను. ‘ఇలా అయితే, పోలీసు కేసు పెడతాను’ అని హెచ్చరించాను. ఆ తర్వాత శ్రీలేఖను అడిగాను... ‘ఇప్పుడు ఏ సమస్యా లేదు’ అని చెప్పింది. నేను కాస్త తెరిపిన పడ్డాను.

 ఆ రోజు...
 యామినికి ముందు రోజు నుంచి కాస్త జ్వరం. క్లాస్‌కు వెళ్లలేదు. మా బంధువు ఒకరు చనిపోతే, అమ్మ అక్కడికి వెళ్లింది. సాయంత్రానికి వచ్చేస్తానంది. అక్క కోసం శ్రీలేఖ కాలేజీకి వెళ్లలేదు. ఇద్దరు ఉన్నారు కదా ఒకరికొకరు తోడుగా అని, పాలు కలిపి, ఇద్దరికీ ఇచ్చి.. వంట చేసిపెట్టి రోజులాగే 7 గంటలకల్లా ఆఫీసుకు బయల్దేరాను. వెళుతున్న నాకు ‘జాగ్రత్తమ్మా!’ అని చెప్పారు. అంతే...! అదే నా బిడ్డల చివరి మాట. అదే నాకు చివరి చూపు. నేను బస్సు దిగేవరకు మధ్యలో ఒక్కసారైనా ఫోన్ చేసేవారు. ఇంకా చేయలేదేంటి అనుకుంటూనే... షాద్‌నగర్‌లో బస్సు దిగాను. నేను ఫోన్ చేయబోతుండగానే, అప్పుడే నా ఫోన్ మోగింది. మా పై ఇంటిలో ఉండేవారు... ‘యామిని, శ్రీలేఖలను ఎవరో వచ్చి పొడిచేశారు... అని చెబుతున్నారు. గుండె ఆగిపోయినట్టుగా అనిపించింది. తిరిగి కొత్తపేటకు ఎలా చేరుకున్నానో... ఇప్పటికీ గుర్తులేదు. హాస్పిటల్‌లో ఇద్దరు బిడ్డలు రక్తపు మడుగులో.. ఏం చెప్పను!! విగతజీవులైన బిడ్డలను చూసి కుప్పకూలిపోయాను.

ఇప్పటికీ వాళ్లు లేరంటే నమ్మకం కలగడం లేదు. ఏ వైపు చూసినా వారి రూపాలే! ఏ మాట విన్నా వారి గొంతే! ... పండగ వచ్చిందంటే ఆ కళ అంతా వారిలోనే చూసుకొని పొంగిపోయేదాన్ని. ఇప్పుడు... వారిద్దరినీ కోల్పోయి గుండె తడి ఆరిపోయి కట్టెలా మిగిలాను. ఒకరికోసం ఒకరు తోడున్నారులే అని భరోసా ఉండేది. ఒకరికొకరు తోడుగా వెళ్లిపోయారు నన్ను ఒంటరిదాన్ని చేసి.

 శిక్ష తప్పదు...
 పోలీసుల ద్వారా విషయాలు తెలిసి నివ్వెరపోయాను. ఆ ఉన్మాది (అమిత్‌సింగ్) మేం ఉన్న ఏరియాలోనే తన స్నేహితుల గదిలో ఉన్నాడని, నా ఇంటి మీద నిఘా ఉంచాడని, పెద్దలెవరూ లేని సమయం చూసుకొని నా ఇంటి దీపాలను ఆర్పేశాడని. నా బిడ్డల చావుకు కారణమైనవాడిని బతకనివ్వకూడదు. వెంటనే చంపేయాలి. అతడిని చంపితే నా బిడ్డలు తిరిగొస్తారని కాదు. కానీ, ఇలాంటి శిక్ష ఏ తల్లీకి పడకూడదన్నదే నా బాధ. మగపిల్లలున్న తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాంటి శిక్షపడుతుందో వారికి తెలిసిరావాలి.

ఆడపిల్ల బయట తిరిగితే రక్షణ లేదనుకుంటాం. కానీ, ఇంట్లో ఉన్నా రక్షణ లేదంటే...!  మేం హెచ్చరించినప్పుడే తమ కొడుకు విషయంలో ఆ తల్లీతండ్రీ జాగ్రత్తపడి ఉంటే.. మూడు నెలల్లో పెళ్లి పీటలెక్కాల్సిన నా కూతురు మట్టయ్యేదా? ‘మీ కేమండీ! ఇద్దరు ఆడపిల్లలు ముత్యాల్లా ఉన్నారు. చక్కగా చదువుకున్నారు! అనేవారంతా.. !’ అలాంటి నా బంగారు తల్లులను పొట్టనపెట్టుకున్నాడు ఆ దుర్మార్గుడు. నా బిడ్డలు చేసిన పాపమేంటి? అబ్బాయి ప్రేమను కాదంటే ఆడపిల్ల చావల్సిందేనా! ప్రేమ పేరుతో మన ఇళ్ల మధ్యే ఉన్మాదులు తిరుగుతుంటే వారిని గుర్తించేదెలా? కూతుళ్లను కాపాడుకునేదెలా?!’’ అంటూ కూతుళ్ల భవిష్యత్తే లోకంగా బతికిన ఆ తల్లి వేసిన ప్రశ్నలకు ఈ సమాజం ఏం బదులిస్తుంది?                                                                                
 - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
 చెబితేనే సేవ్ అవుతారు
 వేధింపులు ముందే తెలుసు కాబట్టి పోలీసు కేసుపెట్టి ఉంటే ఇలాంటి సంఘటన జరిగి ఉండేది కాదు. చాలామంది అమ్మాయిలు... అబ్బాయిల వేధింపులకు బయట సమాజం ఏమనుకుంటుందో అని భయపడి  ఏమీ చెప్పరు. అదే అడ్వాంటేజీగా అబ్బాయిలు తీసుకుంటున్నారు. ఎవరైనా వేధిస్తుంటే తల్లిదండ్రులకు, లెక్చరర్లకు, పోలీసులకు తప్పక తెలియజేయాలి. అలాగే చుట్టుపక్కల వారినీ అలెర్ట్ చేయాలి.
 
 అలాగే...

సైబర్ కంట్రోల్ 100 కి డయల్ చేసి, షీ టీమ్ హెల్ప్ కావాలి అని అడిగితే వెంటనే సాయం అందుతుంది.
సైబరాబాద్ షీ టీమ్ పేరున ఫేస్‌బుక్ పేజీ కూడా ఉంది. వాట్సప్ నెంబర్ 9490617444 కు ఫిర్యాదుచేయవచ్చు.
బండిమీద వెళ్లేటప్పుడైనా, ఎక్కడైనా వేధిస్తున్నట్టు తెలిస్తే వెంటనే తమ వద్ద ఉన్న ఫోన్ ద్వారా ఫోటోలు తీసి పంపవచ్చు.
 - రమా రాజేశ్వరి, ఐపిఎస్, డిసిపి, మల్కాజిగిరి, షీ టీమ్స్ హెడ్, హైదరాబాద్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement