తొమ్మిదేళ్ల బాల వధువు భయంతో ఒళ్ళు ముడుచుకుని ఆ తొలిరాత్రి పానుపు మీద ఓ మూల నక్కి ఉంటే, నలభై అయిదేళ్ల డిప్యూటీ మేజిస్ట్రేట్ వరుడిగా, మూడవ వివాహం చేసుకున్న భర్తగా అదే పాన్పుపై ఆమెకు ఎదురు గానే అంగడి బొమ్మతో కులుకుతున్నాడు. అది 1875. ఆ బాల వధువు తర్వాతి కాలంలో హైమావతీ సేన్ (1866–1930)గా పేరుగాంచిన తొలి తరం వైద్యురాలు. అంతేకాక సుమారు ఐదు వందల మంది అనాథ బాలికలు, పెళ్ళి కాని తల్లులకు జీవనదీపం వెలిగించిన కారుణ్యమూర్తి. ఈ రెండు దశల మధ్య హైమావతి పోరాడి సాగిన దారి... పురుష ప్రపంచానికి ఘోరమైన తల వంపు, భారతీయ మహిళా చరిత్రలో ఓ చీకటి మలుపు.
ఇప్పుడు బంగ్లాదేశ్‌లో అంతర్భాగమైన, ఆనాటి బెంగాల్ రెసిడెన్సీలో ఖుల్నా జిల్లా గ్రామీణ ప్రాంతంలో 1866లో హైమా వతి జన్మించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎంతో ఇష్టపడే కుమార్తెను తండ్రి హైమావతిని ఇద్దరు పిల్లల తండ్రికి మూడో భార్యగా కట్టబెట్టాల్సి వచ్చింది. పదేళ్లు వస్తే కానీ వధువును కాపురానికి పంపకూడదని 1860లో చట్టం చేసినా ఈ తాగు బోతు పెళ్ళికొడుకు డిప్యూటీ మ్యాజిస్ట్రేట్ కనుక అక్కడ ఆ చట్టం పనిచేయాల్సిన అవసరం లేకపోయింది.
భార్యకు శృంగారంలో శిక్షణ ఇవ్వాలని మరో స్త్రీని తెచ్చుకుని ఆమె కళ్ళెదుటే ఘన కార్యాలు చేసేవాడు. కొన్ని నెలలకే ఈ పెద్దమనిషి అనారోగ్యం పాలై, న్యుమోనియాతో కన్నుమూశాడు. పదేళ్లకే హైమావతి వితంతువైపోయింది. అత్తగారి తరఫున ఆదుకునేవారు లేక పోవడం, తల్లితండ్రులు కూడా కొద్ది రోజులకే మరణించడంతో ఆమె దిక్కులేనిదయ్యింది.
అటు తిరిగి, ఇటు తిరిగి కాశీలోని హిందూ వితంతు శరణాలయంలో తేలారు. కొందరు బ్రహ్మ సమాజపు వ్యక్తులు పరిచయం కావడంతో, హైమావతి జీవితం కొంత మలుపు తిరిగింది. వారి సాయంతో కొంత చదువు నేర్చుకుని, ఓ సంఘ సంస్కర్త నడిపే పాఠశాలలో పనిచేయడం ప్రారంభించింది.
కొంత కాలానికి కలకత్తా తిరిగివచ్చింది. కొందరి మిత్రుల ప్రోద్బలంతో హైమావతి 25వ ఏట అంటే 1890లో కుంజబిహారి సేన్‌తో వివాహం జరిగింది. అతను పైకి బ్రహ్మసమాజపు వ్యక్తి లాగా, ఆధ్యాత్మిక చింతనా పరుడిగా కనబడినా, పెళ్లయిన తర్వాత అతని బాధ్యతా రాహిత్యం, ఆవేశం, అసమర్థత, అవకాశవాదం విశృంఖలంగా బయల్ప డ్డాయి. కళ్ళు తెరిచే లోపు ఇద్దరు పిల్లలకు తల్లయింది హైమావతి. అప్పట్లో వైద్యానికి సంబంధించి మహిళలకు ఉపాధి అవకాశాలు కనబడటంతోపాటు 1885లో డఫ్రిన్ ఫండ్ రావడంతో డాక్టర్స్, నర్సులు, మిడ్ వైవ్స్‌గా శిక్షణ పొందడానికి కొంత ఆర్థికపరమైన చేయూత అందుబాటులో ఉంది.
దాంతో 1891లో హైమావతి ఇప్పుడు ‘నీల్ రతన్ సర్కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్’గా పేరుగాంచిన అప్పటి కలకత్తా కామ్బెల్ మెడికల్ స్కూల్లో ‘వెర్నాక్యులర్ లైసెన్షియేట్ ఇన్ మెడిసిన్ అండ్ సర్జరీ’ (పీఎల్‌ఎంఎస్) చదవాలని నిర్ణయించు కుంది. హైమావతికి బంగారు పతకం రావడం పట్ల వ్యతిరేకత మొదలై; క్లాసులు బహిష్కరించడం, కళాశాల చుట్టూ గుమి గూడటం, ఆడపిల్లలు ప్రయాణం చేసే బగ్గీల మీద రాళ్లు విస రడం వంటి పనులతో పాటు పురుష విద్యార్థులు ఇన్సె్పక్టర్ జనరల్‌కు, లెఫ్టినెంట్ గవర్నర్‌కు అభియోగాలు చేశారు. చివరకు బంగారు పతకాన్ని తిరస్కరింప చేసి, రజతాన్ని అంగీకరింప చేశారు.
1893లో పీఎల్‌ఎంఎస్ కోర్సు పూర్తయినా, ఎక్కడ నివాసం ఉండాలన్న విషయానికి సంబంధించి ఉద్యోగానికే భర్త అవరోధం కలిగించాడు. ఈ పరిస్థితుల్లో హుగ్లీ లేడీ డఫ్రిన్ హాస్పి టల్‌లో ఉద్యోగం లభించింది. ఆసుపత్రిలో ఆమెపై పురుష అధికారి శిక్షణ పేరుతో పీడిస్తూ, లైంగిక పరంగా వేధిస్తూ ఉండే వాడు. భర్త పీడింపులు, సాధింపులు ఉండనే ఉన్నాయి. ఈ రెండో మొగుడితో కాపురం 13 ఏళ్లకే ముగిసింది. అతడు చక్కెర వ్యాధితో మరణించాడు. అతడి ద్వారా హైమావతికి మొత్తం ఐదు మంది మగపిల్లలు కలిగారు.
హైమావతి జీవితం నిత్యసంకటంగా మారినా, ఆమె మొత్తం జీవిత కాలంలో అన్ని మతాలకూ చెందిన ఒకరోజు మాత్రమే వయసున్న పిల్లలతో సహా 485 మందిని చేరదీయడం ఎంతో విస్మయాన్ని కలిగిస్తుంది. తొలి దశలో చేరదీసినా తన కుమారులకు వయసు పెరిగే కొద్దీ ఈడొస్తున్న ఆడపిల్లలను ఇంకో చోటకు పంపేవారు. 1920 నుంచి 1933 ఆగస్టు 5న కన్నుమూసే దాకా తన జీవితానుభవాలను ఒక గీతలు వేసిన నోట్ బుక్ లో రాసి పెట్టారు. అది దాదాపు 8 దశాబ్దాల తర్వాత బయటపడి ప్రచురణకు నోచుకుని సంచలనం కలిగించడమే గాక, తొలి రోజుల భారతీయ వైద్యరంగ పరిస్థితికి దర్పణమయ్యింది.
డా‘‘ నాగసూరి వేణుగోపాల్
వ్యాసకర్త ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి
మొబైల్: 94407 32392
బతుకే ఓ పోరాటమైన కారుణ్య మూర్తి!
Published Sun, Sep 15 2024 12:52 AM | Last Updated on Sun, Sep 15 2024 12:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment