ఆర్థిక ఇబ్బందులు ఆ తల్లిని ఆత్మహత్యకు పురిగొల్పాయి. ఇద్దరు కుమార్తెలను బావిలోకి తోసేసి, తనూ దూకింది.
వరంగల్: ఆర్థిక ఇబ్బందులు ఆ తల్లిని ఆత్మహత్యకు పురిగొల్పాయి. ఇద్దరు కుమార్తెలను బావిలోకి తోసేసి, తనూ దూకింది. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన గుండెబోయిన రాజు, హైమావతి(32) దంపతులకు ఇద్దరు కుమార్తెలు శివాని(10), శ్రావణి(8) ఉన్నారు. కొంతకాలంగా ఈ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. రాజు మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. దీంతో హైమావతి కూలీనాలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.
ఇటీవల ఆర్థిక ఇబ్బందులు తీవ్రతరం కావటంతో ఆత్మహత్యనే శరణ్యమని భావించింది. కూతుళ్లను వెంటబెట్టుకుని సోమవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటికి వెళ్లింది. ఆత్మకూరు నుంచి పత్తిపాకకు వెళ్లే మార్గంలో వ్యవసాయబావిలో పిల్లలను తోసి తాను దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా మంగళవారం ఆ బావిలో శ్రావణి మృతదేహం తేలటంతో ఘోరం వెలుగులోకి వచ్చింది. మృతిచెందిన ఇద్దరు చిన్నారులు చదువుల్లో ప్రతిభ కనబరిచే వారని ఉపాధ్యాయులు తెలిపారు.