డీఎంకేలో జరుగుతున్న సంస్థాగత ఎన్నికలు అంతర్గత పోరుకు దారితీశాయి. వర్గపోరుతో ఇరుపక్షాలు పరస్పర దాడులకు పాల్పడగా ఎన్నికల
చెన్నై, సాక్షి ప్రతినిధి: డీఎంకేలో జరుగుతున్న సంస్థాగత ఎన్నికలు అంతర్గత పోరుకు దారితీశాయి. వర్గపోరుతో ఇరుపక్షాలు పరస్పర దాడులకు పాల్పడగా ఎన్నికల కేంద్రాలు ఆగ్రహావేశాలతో అట్టుడికిపోయాయి. పెట్రోబాంబులు, వేటకొడవళ్లు రంగ ప్రవేశం చేయడంతో రణరంగంగా మారిపోయాయి. ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే మట్టికరిచిపోగా పార్టీ అయోమయంలో పడిపోయింది. పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసిన వారిని డీఎంకే అధినేత కరుణానిధి పార్టీ నుంచి గెంటేశారు. మరికొందరిని కీలక బాధ్యతల నుంచి తప్పించారు. పార్లమెంటు ఫలితాలు పునరావృతం కాకుండా అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసేందుకు కరుణ, స్టాలిన్‌లు నడుంబిగించారు. స్టాలిన్ రాష్ట్రమంతా పర్యటిస్తూ పార్టీ శ్రేణులను పునరుత్తేజ పరిచే పనిలో పడ్డారు.
వేట కొడవళ్లు, పెట్రోబాంబులు
చెన్నై నగరంలోని వార్డుల్లో జరుగుతున్న పార్టీ ఎన్నికలు శనివారం గొడవలకు దారితీశాయి. కోయంబేడు లోని ఒక కల్యాణ మండపంలో 127 వార్డు ఎన్నికలకు రెండు వర్గాలు పోటీపడ్డాయి. 200 మంది మహిళలు, 600 మంది పురుషులు హాజరయ్యూరు. ఎన్నికల నిర్వహణ సమయంలో రెండు పక్షాల మధ్యన మాటామాటా పెరగడంతో కుర్చీలను విసురుకున్నారు. ఇదే సమయంలో కొందరు వ్యక్తులు రహస్యంగా దాచుకున్న వేటకొడవళ్లను బైటకు తీసి 76వ వార్డుకు చెందిన పన్నీర్ అనే కార్యకర్తని గాయపరిచారు. ఇరుపక్షాలు గొడవపడుతున్న సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మండ పం వెలుపల నుంచి లోనికి రెండు పెట్రోబాంబులను విసిరారు. అయితే అదృష్టవశాత్తు అవి పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బాంబులు విసిరిన వారు పరారు కావడంతో పోలీసులు గాలిస్తున్నారు. 14వ వార్డులో ఎమ్మెల్యే అన్బగళన్, మాజీ మేయర్ సుబ్రమణ్యం మధ్య వర్గపోరు తీవ్రస్థాయికి చేరడంతో ఎన్నికలను వాయిదా వేశారు. పార్టీ నేతల మధ్య రాజీపరిచి ఎన్నికలను ఏకగ్రీవం చేయాలన్న ప్రయత్నాలు ఫలించలేదు. అన్నాడీఎంకే నుంచి డీఎంకేలో చేరిన నేతకు పెద్దపీట వేయడం ఘర్షణకు దారితీయడంతో 12 వ వార్డులో ఎన్నికలు వాయిదాపడ్డాయి.