
చెన్నై: బీజేపీ దివంగత నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే నాయకుడు, పార్టీ చీఫ్ స్టాలిన్ కుమారుడు ఉదయనిధిపై చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని బీజేపీ కోరింది. ప్రధాని మోదీ ఒత్తిడి తట్టుకోలేక పోవడంతో సుష్మా, జైట్లీ చనిపోయారని ఎన్నికల సభలో ఉదయనిధి అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉదయనిధిని అనర్హుడిగా ప్రకటించాలని, డీఎంకే స్టార్ ప్రచార కర్తల జాబితా నుంచి ఆయన పేరును తొలగించాలంది.
చెపాక్ – ట్రిప్లికేన్ స్థానం నుంచి ఉదయనిధి బరిలో ఉన్నారు. ‘ప్రధాని అవుతారనుకున్న అద్వానీని మోదీ పక్కనపెట్టారు. మోదీ టార్చర్ భరించలేక యశ్వంత్‌సిన్హా పార్టీ వీడారు. మోదీ ఒత్తిడి తట్టుకోలేక సుష్మ, జైట్లీ మరణించారు. సీనియర్ నేత వెంకయ్య నాయుడును మోదీ పక్కనపెట్టారు’ అని ఉదయనిధి అన్నారు. ఈ వ్యాఖ్యలపై సుష్మ కూతురు బాన్సురీ,జైట్లీ కూతురు సొనాలీ స్పందించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం తమ తల్లి పేరును వాడుకోవద్దని బాన్సురీ సూచించారు. ‘మా అమ్మ అంటే మోదీకి అమిత గౌరవమ’ని పేర్కొన్నారు. అలాగే, ప్రధాని మోదీతో అరుణ్‌జైట్లీకి ప్రత్యేక అనుబంధం ఉండేదని సొనాలీ జైట్లీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment