సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే అగ్రనేత దివంగత కరుణానిధి కుటుంబంలో మూడో వారసత్వం ఉదయించింది. కరుణానిధి మనవడు, స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. కూటమి చర్చలు, నియోజకవర్గాల కేటాయింపు ముగియడంతో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ 173 మందితో కూడిన పార్టీ అభ్యర్థుల జాబితాను శుక్రవారం ప్రకటించారు. మూడొంతుల మెజార్టీకి తగిన సంఖ్యలో సొంత అభ్యర్థులను పోటీకి దించారు.
తొలిసారిగా ఉదయనిధి స్టాలిన్..
కరుణానిధి వంశంలో మూడో తరం తొలిసారిగా ఎన్నికల రంగంలోకి దిగింది. కరుణానిధి మనుమడు, స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ చెన్నై ట్రిప్లికేన్ నుంచి పోటీ చేస్తున్నారు. తమిళ సినీ రంగంలో తనదైన స్థానం సంపాదించుకున్న ఉదయనిధికి రెండేళ్ల క్రితమే డీఎంకే యువజన విభాగం కార్యదర్శి బాధ్యతలను స్టాలిన్ అప్పగించారు. తన తాత కరుణానిధికి కంచుకోటైన ట్రిప్లికేన్ నుంచి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగనున్నారు. యథాప్రకారం కొళత్తూరు నుంచి మూడోసారి స్టాలిన్ పోటీకి దిగుతున్నారు. ఇక పార్టీలోని ప్రముఖులందరికీ సీట్లు దక్కాయి. కూటమిలోని కొన్నిపార్టీలు డీఎంకే ఉదయసూర్యుని చిహ్నంపై పోటీ చేస్తున్నాయి. దీంతో ప్రత్యక్ష, పరోక్ష అభ్యర్థులను కలుపుకుంటే డీఎంకే 187 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లయింది.
178 చోట్ల అన్నాడీఎంకే..
అధికార అన్నాడీఎంకే 178 స్థానాల్లో సొంత పార్టీ అభ్యర్థులను బరిలోకి దించగా రెండాకుల చిహ్నంపై పోటీచేసే అభ్యర్థులను కలుపుకుంటే మొత్తం 191 స్థానాల్లో అన్నాడీఎంకే తలపడుతోంది.
2 జాతీయ పార్టీలతో కమల్ ఢీ
మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్ కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన రెండు జాతీయ పార్టీల అభ్యర్థులను ఢీకొట్టబోతున్నారు. కోయంబత్తూరు సౌత్ స్థానాన్ని పొత్తులో భాగంగా అధికార ఏఐఏడీఎంకే తన మిత్రంపక్షం బీజేపీకి, ప్రతిపక్ష డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్‌కు కేటాయించాయి. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment