ఉదయనిధి స్టాలిన్
సాక్షి, చెన్నై: రానున్న ఎన్నికల్లో 200 సీట్లల్లో డీఎంకే అభ్యర్థులు పోటీ చేయాల్సిన అవశ్యం ఉందని, ఇందుకు అధ్యక్షుడి మీద ఒత్తిడి తెద్దామన్న యువజన సమావేశ నినాదం ఆ పార్టీ మిత్ర పక్షాల్లో కలవరాన్ని రేపింది. పార్టీ కోశాధికారి టీఆర్ బాలు, యువజన నేత ఉదయనిధి స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయడాన్ని మిత్రపక్షాలు తీవ్రంగానే పరిగణించాయి. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, మనిదనేయమక్కల్ కట్చి అంటూ చిన్నా, చితకా పార్టీలో డీఎంకే మెగా కూటమి కొనసాగుతున్న విషయం తెలిసిందే.
అయితే, రానున్న ఎన్నికల ద్వారా అధికారం కైవసం లక్ష్యంగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టారు. ఇప్పటికే 2021 ఎన్నికల్లో డీఎంకే అధికారం చేజిక్కించుకోవాలంటే, అధిక స్థానాల్లో పోటీ అనివార్యం అని సర్వేల్లో తేలింది. ఈ పరిస్థితుల్లో డీఎంకే మిత్ర పక్షాల్లో కలవరాన్ని రేపుతూ, స్టాలిన్ వారసుడు, యువజన నేత ఉదయనిధి, పార్టీ కోశాధికారి టీఆర్ బాలు వ్యాఖ్యలు చేయడం గమనించాల్సిన విషయమే.
200 సీట్లలో పోటీ తప్పనిసరి..
డీఎంకే యువజన సమావేశం బుధవారం చెన్నైలో జరగ్గా, టీఆర్ బాలు, ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, 2021 ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో అధికార పగ్గాలు చేపట్టాలంటే, డీఎంకే అభ్యర్థులు 200 స్థానాల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. మిత్ర పక్షాలకు కావాల్సినన్ని సీట్లు లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన దృష్ట్యా, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు ప్రాధాన్యత పెంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో 200 స్థానాల్లో డీఎంకే అభ్యర్థులే పోటీ చేయాల్సిన అవశ్యం ఉందని, ఇందుకోసం అధ్యక్షుడిపై ఒత్తిడి తెద్దామని ఆ సమావేశం వేదికగా టీఆర్‌తో పాటు యువజన నేతలు నినదించడం గమనార్హం. ఇది కాస్త డీఎంకే మిత్రుల్లో కలవరాన్ని రేపుతోంది. ప్రధానంగా అధిక సీట్లను ఆశిస్తున్న కాంగ్రెస్‌కు బెంగతప్పడం లేదు. 200 స్థానాల్లో డీఎంకే పోటీ చేయాల్సి వస్తే, ఆపార్టీకి ఈ సారి మరీ తక్కువగా, మిగిలిన మిత్ర పక్షాలకు సింగిల్ డిజిట్ సీట్లకు పరిమితం చేయక తప్పదేమో అన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
45 రోజులు 25 లక్షలు..
బలోపేతం లక్ష్యంగా 45రోజుల్లో 25 లక్షల మంది కొత్త సభ్యుల్ని చేర్చడం లక్ష్యంగా అందరూ మనతో కార్యక్రమానికి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ సాగనుంది. ఈ కార్యక్రమానికి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆన్‌లైన్ ద్వారా శ్రీకారం చుట్టారు.
Comments
Please login to add a commentAdd a comment