డీఎంకే సేనల్లో ఆనందం
Published Thu, Apr 13 2017 9:45 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM
సాక్షి, చెన్నై: వయోభారం,అనారోగ్యంతో గోపాలపురం ఇంటికి పరిమితమై ఉన్న డీఎంకే అధినేత కరుణానిధి లేటెస్టు ఫొటోను ట్విట్టర్‌లో ఆయన గారాల పట్టి, ఎంపీ కనిమొళి బుధవారం పెట్టారు. లేటెస్ట్ ఫొటోతో కరుణానిధి కనిపించడం డీఎంకే వర్గాల్లో ఆనందాన్ని నింపింది.
డీఎంకే అధినేత ఎంకరుణానిధి వయోభారం, ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో పార్టీ నిర్వహణ బాధ్యతల్ని కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ తన భుజాన వేసుకుని ఉన్నారు. కరుణానిధి గోపాలపురం ఇంటికే పరిమితమై ఉన్నారు. స్టాలిన్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన సమయంలో కరుణానిధి ఫొటోను డీఎంకే కార్యాలయం విడుదల చేసింది. తదుపరి రెండు నెలల అనంతరం కరుణానిధి లేటెస్టు ఫొటో ట్విట్టర్‌లో చేరింది. ఈ ఫొటోను ఆయన గారాల పట్టి, డీఎంకే ఎంపీ కనిమొళి తన ట్విట్టర్‌లో పెట్టారు. హిందూ ఆంగ్ల పత్రిక కార్మిక సంఘం అధ్యక్షురాలుగా కనిమొళి ఎంపిక అయ్యారు.
ఈసందర్భాన్ని పురస్కరించుకుని కరుణానిధి ఆశీస్సుల్ని కనిమొళి అందుకుని, ఆ ఫొటోను బుధవారం ట్విట్టర్‌లో ఉంచారు. అలాగే, పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్, నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ల ఆశీస్సుల్ని అందుకున్నట్టుగా కనిమొళి ఫొటోను ట్విట్టర్‌లో పెట్టారు. అయితే, కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై రకరకాలుగా ప్రచారాలు సాగుతున్న నేపథ్యంలో లేటెస్టు ఫొటో ప్రత్యక్షం కావడం డీఎంకే వర్గాల్లో ఆనందాన్ని నింపినట్టు అయింది.
Advertisement
Advertisement