లైన్ క్లియర్!
సాక్షి, చెన్నై :డీఎంకేలో అళగిరి, స్టాలిన్‌ల మధ్య సాగుతున్న సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పార్టీలో నెలకొన్న పరిస్థితులతో అళగిరిని మళ్లీ ఆహ్వానించే రీతిలో కసరత్తులు ఆరంభమయ్యాయి. అధినేత కరుణానిధితో అళగిరి మద్దతుదారుడు కేపీ రామలింగం భేటీ సామరస్యానికి దారి తీసింది. దీంతో మళ్లీ అళగిరి డీఎంకేలో చేరనున్నారన్న ప్రచారం వేగం పుంజుకుంది. అదే సమయంలో అళగిరి మళ్లీ పార్టీలోకి వస్తే స్టాలిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ప్రచారం సాగింది. అయితే, అళగిరి మళ్లీ పార్టీలోకి రావడంపై స్టాలిన్‌కు ఎలాంటి ఆక్షేపణ లేనట్టు సంకేతాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆచితూచి స్టాలిన్ అడుగులు వేస్తుంటారు. ఆ దిశగానే అళగిరి విషయంలోను తన పంథాను మార్చినట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.
సంకేతాలు: అళగిరి మద్దతు దారుడు కేపీ రామలింగం సీఐటీ నగర్‌లోని కరుణానిధి ఇంటిమెట్లు ఎక్కనున్నారన్న విషయం ముందుగానే స్టాలిన్‌కు తెలుసన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు కారణం గత వారం తన పెళ్లి రోజున తండ్రి కరుణానిధి ఆశీస్సులు అందుకున్న సమయంలోనే అళగిరి ప్రవేశానికి స్టాలిన్ లైన్ క్లియర్ చేసినట్టు సమాచారం. అళగిరిని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించే విషయంగా కరుణానిధి సంధించిన ప్రశ్నకు తనకు ఎలాంటి ఆక్షేపణ లేదంటూ స్టాలిన్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. తరువాత కరుణానిధి తదుపరి అడుగు లు వేసినట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టడం లక్ష్యంగా కరుణానిధి రచిస్తున్న వ్యూహం తోనే అళగిరి విషయంలో స్టాలిన్ ఓ అడుగు వెనక్కు వేసినట్టు ప్రచారం సాగుతోంది. తమ్ముడు స్టాలిన్ రూట్ క్లియర్ చేయడంతో అన్నయ్య అళగిరికి గోపాలపురం మెట్లు ఎక్కేందుకు ఆహ్వానం వస్తుందన్న సంకేతాలు వస్తున్నాయి. వినాయక చవితి అనంతరం సెప్టెంబర్ మొదటి వారంలో కరుణానిధిని అళగిరి కలుసుకునేందుకు నిర్ణయించినట్టు, ఇందుకు పెద్దాయన సైతం అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ సంప్రదింపుల అనంతరం అధికారికంగా అళగిరికి మళ్లీ పార్టీలోకి ఆహ్వానం రాబోతున్నది. తదనంతరం అన్నదమ్ముళ్లు ఇద్దరు మళ్లీ చేతులు కలపడం ఖాయం అని డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.