సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)లో అంతర్గత పోరు రగులుతోంది. గ్రూపు రాజకీయాలకు చిరునామాగా పేర్కొన్న కాంగ్రెస్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉద్యమ పార్టీలో కూడా నేతల మధ్య విభేదాలు కొనసాగుతుండటం ఎన్నికల వేళ చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని ముఖ్య నాయకులు రెండు, మూడు గ్రూపులుగా విడిపోయారు. కొందరు ముఖ్య నాయకులు పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు కేటీఆర్ వర్గీయులుగా పేరుండగా, మరికొందరు హరీష్‌రావు సన్నిహితులుగా ముద్రపడింది. నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న శ్రీహరిరావు కేటీఆర్ కు సన్నిహితులు.
ఆదిలాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్న, పశ్చిమ జిల్లా అధ్యక్షులు లోక భూమారెడ్డి తదితరులకు హరీష్‌రావుతో మంచి సంబంధాలున్నాయి. ఇటీవల నిర్మల్‌కు చెందిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని టీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు జోగు రామన్న, లోక భూమారెడ్డి తదితరులు ప్రత్యేక చొరవ చూపినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఈ మేరకు వీరు అధినేత కేసీఆర్‌ను కలిసి ఐకే రెడ్డిని పార్టీలో చేర్చుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీహరిరావుకు ఏమాత్రం మింగుడు పడలేదు. నిర్మల్‌లో తనకు చెక్‌పెట్టే విధంగా ఈ నాయకులు వ్యవహరించడంతో ఆయన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయన కేటీఆర్‌ను ఆశ్రయించి నిర్మల్ టిక్కెట్ విషయంలో స్పష్టమైన హామీ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ముథోల్ సిట్టింగ్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారిది మరో దారి. మిగతా నేతలతో ఈయనకు సంబంధాలు అంతంత మాత్రమే. టీడీపీ జిల్లా అధ్యక్షునిగా ఉన్న గోడం నగేష్‌ను ఇటీవల పార్టీలోకి చేర్చుకోవడం వేణుగోపాలాచారికి ఏ మాత్రం ఇష్టం లేదని ఆ పార్టీ నాయకులు ప్రైవేట్ సంభాషణల్లో పేర్కొం టున్నారు. నగేష్, చారీలు టీడీపీ లో ఉన్నప్పుడు ఎవరికివారే అన్న చందంగా వ్యవహరించినట్లు అప్పట్లో
వార్తలు వచ్చాయి. బోథ్ నియోజకవర్గానికి రాములునాయక్ చాలా రోజులుగా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు నగేష్ రాకతో రాములుకు చెక్ పడినట్లయింది. నగేష్ ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.
దీంతో బోథ్ నుం చి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారనే ప్రచారం ఉంది. కాగా ఇటీవల జెడ్పీటీసీ, ఎంపీటీసీ టిక్కెట్ల విషయంలో రాములునాయక్ వర్గీయులకు మొండిచేయి మిగి లింది. నగేష్ వెంట టీడీపీ నుంచి కొత్తగా వచ్చిన ఆయన అనుచరులకే దాదాపు టిక్కెట్లన్నీ దక్కడంతో రాములునాయక్ వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఖానాపూర్‌లో నియోజకవర్గ నేతల్లోని విభేదాలైతే ఏకంగా రచ్చకెక్కా యి. పార్టీలో కొత్తగా చేరిన రేఖాశ్యాంనాయక్ అసలు ఎస్టీనే కాదనే వాదన తెరపైకి రాగా, పైగా స్థానికేతరులకు టీఆర్‌ఎస్ టిక్కెట్ ఇస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు.
తూర్పు జిల్లాలోనూ..
తూర్పు జిల్లా టీఆర్‌ఎస్‌లోనూ లుకలుకలున్నాయి. సిర్పూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, మహిళ నాయకురాలు పాల్వాయి రాజ్యలక్ష్మిలు ఎవరికివారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా రెండు వర్గాలు వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చెన్నూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, పార్టీ తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్ మధ్య అంతర్గత విభేధాలు కొనసాగుతున్నాయి. కొత్తగా పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ గడ్డం వివేక్ పార్టీలోకి రావడంతో ఇక్కడ పార్టీ శ్రేణులు మూడు వరా్గాలుగా విడిపోయాయి. మంచిర్యాలలో టీఆర్‌ఎస్ టిక్కెట్ బీసీలకే కేటాయించాలని పార్టీ స్థానిక నాయకులు నడిపెల్లి దివాకర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ను ముట్టడించిన విషయం విధితమే. అంతర్గత పోరు ఈ ఎన్నికల్లో ఎటుదారి తీస్తుందోనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
టీఆర్‌ఎస్‌లో అంతర్గత పోరు
Published Thu, Mar 27 2014 2:28 AM | Last Updated on Sat, Aug 11 2018 4:48 PM
Advertisement
Advertisement