తేలని.. పంచాయితీ!
నల్లగొండ టౌన్ : ఒక్క గది కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగుల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. ఇటీవల ఆధునిక హంగులతో మరమ్మతులు చేపట్టిన క్యాజువాలిటీ విభాగమే ఈ అంతర్గత పోరుకు ఆజ్యం పోసింది. ఈసీజీ విభాగం ఉద్యోగులకు, నర్సింగ్ ఉద్యోగులకు మధ్య పచ్చగడ్డి వేస్తే మండేంత స్థాయిలో పోరు సాగుతోంది. వీరి పంచాయితీని పరిష్కరించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతోనే క్యాజువాలిటీ విభాగం ప్రారంభానికి నోచుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీని కారణంగా రోగులతోపాటు ఆస్పత్రి సిబ్బంది కూడా తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారు. క్యాజువాలిటీ విభాగంలో మూడు గదులను ఏర్పాటు చేశారు. అందులో రెండు నర్సులకు, ఒకటి ఈసీజీ విభాగానికి కేటాయించాలని అధికారులు నిర్ణయించారు.
దీనిని నర్సులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. క్యాజువాలిటీలో విధులు నిర్వర్తించే తమకు సౌకర్యంగా ఉండడానికి మూడు గదులను కేటాయించాలని మహిళా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నర్సులతోపాటు మహిళా స్వీపర్లు కూడా ఇక్కడ విధులలో ఉంటారని, అందరూ డ్యూటీ ముగిసిన తరువాత డ్రెస్‌లు మార్చుకోవడానికి అనుకూలంగా ఉండడంతోపాటు రాత్రి విధులలో ఉండేవారికి సౌకర్యంగా ఉంటుందని వాదిస్తున్నారు. అసలు ఈసీజీ విభాగం ఉద్యోగులు అత్యవసరమైనప్పుడు పిలిపిస్తే వచ్చి ఈసీజీ తీస్తారని, వారికి గది అవసరం లేదని నర్సులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే నర్సులకు రెండు గదులు సరిపోతాయని, తమకు గది కేటాయించకపోతే ఆరుబయట ఈసీజీని తీయాలా అని ప్రశ్నిస్తున్నారు. గదిలో ఈసీజీ తీయడానికి బెడ్‌తోపాటు రోగి కొంతసేపు విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. గది లేకపోతే మహిళా రోగులకు బయట ఈసీజీని తీయగలమా అని ప్రశ్నిస్తున్నారు.
తమకు ఎట్టిపరిస్థితులలో గదిని కేటాయించాల్సిందేనంటూ అధికారుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇరువర్గాలకు చెందిన యూనియన్ లీడర్లు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని గది కోసం పట్టుబడుతున్నారు. దీనిపై ఏమి నిర్ణయం తీసుకోలేని అధికారులు క్యాజువాలిటీ ప్రారంభించానికి జంకుతున్నట్లు సమాచారం. ఇరు విభాగాల సిబ్బంది అంతర్గత పోరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లడంతో ఆస్పత్రి అధికారులకు తలనొప్పిగా మారింది. ఉద్యోగులపై అధికారుల అజమాయిషీ లేకపోవడం వల్లే గది కోసం అంతర్గత పోరు సాగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా దీనిపై ఒక నిర్ణయం తీసుకుని క్యాజువాలిటీని వెంటనే ప్రారంభించి రోగులకు సరైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.