hospital employees
-
మీరు కన్యనో కాదో చెప్పండి!
పట్నా: ఏదైనా ఉద్యోగంలో చేరేముందు అభ్యర్థి వివాహ స్థితి గురించిన సమాచారాన్ని సంస్థ అడగడం మామూలే. బిహార్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం ఉద్యోగంలో చేరేవారు కన్యనా కాదా అనే సమాచారాన్ని అడగడం పలువురి ఆగ్రహానికి కారణమవుతోంది. పట్నాలోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఉద్యోగంలో చేరేవారు నింపాల్సిన దరఖాస్తులోని వివాహ స్థితి పత్రంలోని ఓ సెక్షన్లో ‘నేను బ్రహ్మచారి/వితంతువు/కన్య’ అని ఉంది. అలాగే ‘నాకు ప్రస్తుతం జీవించి ఉన్న ఒకే భార్య ఉంది’, ‘నాకు పెళ్లైంది, ఒకరి కన్నా ఎక్కువ మంది భార్యలు ఉన్నారు’, ‘నేను పెళ్లి చేసుకున్న అతనికి జీవించి ఉన్న మరో భార్య లేదు’, ‘నేను పెళ్లి చేసుకున్న అతనికి జీవించి ఉన్న మరో భార్య కూడా ఉంది’ లాంటి వింత ఆప్షన్లు కూడా ఆ పత్రంలో ఉన్నాయి. అభ్యర్థి వీటిలో తనకు ఏది సరిపోలుతుందో దానిని టిక్ చేయాలి. వీటిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ, ఉద్యోగులపై అత్యాచారాలు జరిగినప్పుడు కన్యనా, కాదా అనే సమాచారం ఉపయోగపడొచ్చని చెప్పడం మరింత వివాదానికి దారి తీసింది. -
సిబ్బంది నిర్లక్ష్యం... రోగిని కొరుక్కుతిన్న ఎలుకలు
-ప్రాణాపాయస్థితిలో రోడ్డుపై బాధితుడి ఆర్తనాదాలు -పోలీసుల చొరవతో తిరిగి ఆస్పత్రికి నెల్లూరు : నెల్లూరు ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో మానవత్వం మంటకలిసింది. ఆస్పత్రిలో ఉన్న రోగికి సపర్యలు చేయాల్సి వస్తుందని భావించిన కొందరు సిబ్బంది రోగిని రోడ్డుపై పడేశారు. నడవలేని స్థితిలో రెండు రోజులుగా డ్రైనేజీ కాలువ వద్ద పడి ఉన్న రోగి కుడిచేతి వేళ్లను ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ప్రాణాపాయస్థితిలో సదరు రోగి ఆర్తనాదాలు చేస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల చొరవతో ఆ రోగిని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ హృదయ విదారక సంఘటనకు జిల్లా ప్రభుత్వ బోధనాస్పత్రి వేదికైంది. వివరాలు ఇలా ఉన్నాయి.... ఓ గుర్తు తెలియని వ్యక్తి రెండు కాళ్లు చచ్చుబడిపోయి తీవ్ర అనారోగ్యంతో నెల్లూరు చెరువు వద్ద పడి ఉండడాన్ని 108 సిబ్బంది గుర్తించారు. ఈ నెల 25వ తేదీన అతడ్ని చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో చేర్పించారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కాని రెండురోజులుగా ఆ రోగి ఆస్పత్రి బయట (మెటర్నిటీ హాస్పిటల్‌కు వెళ్లే గేటు సమీపంలో) డ్రైనేజీ కాలువ వద్ద పడి ఉన్నాడు. కాలువ పక్కనే పడి ఉండటంతో అతని కుడిచేతి వేళ్లను ఎలుకలు కొరుక్కు తిన్నాయి. దీంతో వేళ్లలోని కండరాలు బయటకు వచ్చాయి. శనివారం వేసవి వేడికి అతడు బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు ఈ విషయాన్ని గమనించి ఆస్పత్రి సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఐదోనగర ఎస్ఐ జగత్సింగ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. రోగి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండటంతో వెంటనే అంబులెన్స్ సహాయంతో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రి వైద్యులు అతడికి పరీక్షలు నిర్వహించి ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. అతనికి నా అనే వారు ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. దీంతో అతనికి అన్ని సేవలు వైద్యసిబ్బందే చేయాల్సి ఉంది. మూత్ర, మల విసర్జన సైతం బెడ్‌పైనే. దీంతో ఇవ్వన్నీ చేయలేకనే మానవత్వం మరచిన వైద్య సిబ్బంది స్థానిక సెక్యూరిటీ గార్డుల సాయంతో రాత్రికి రాత్రే రోగిని ఆస్పత్రి బయట వదిలివేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండురోజులుగా సదరు రోగి రోడ్డుపైనే నరకయాతన పడుతున్నా ఎవరికీ కనికరం కలగలేదు. ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది అటువైపుగా నిత్యం రాకపోకలు సాగిస్తున్నా కనీసం పట్టించుకొన్న దాఖలాలు లేవు. చివరకు స్థానికులు స్పందించి పోలీసుల చొరవతో రోగిని ఆస్పత్రిలో చేర్పించారు. ఇది ఇలా ఉంటే ఈ ఘటనపై వైద్యసిబ్బంది మాత్రం మరోలా చెబుతున్నారు. సదరు రోగికి మతిస్థిమితం లేదనీ... దీంతో అతడు తరచూ ఆస్పత్రిలోనుంచి బయటకు నడుచుకుంటూ వెళ్లిపోయేవాడని ... తాము పలుమార్లు అతడిని పట్టుకొచ్చినా ఫలితం లేకుండాపోయిందని చెబుతున్నారు. రెండు కాళ్లు చచ్చుబడి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రోగి నడుచుకుంటూ ఎలా వెళుతాడని ప్రశ్నించగా దానిపై మాత్రం ఆసుపత్రి సిబ్బంది సమాధానం దాటేశారు. అక్కడున్న కొందరు రోగులు మాత్రం రెండురోజులు కిందటే ఆస్పత్రి సిబ్బందే అతడ్ని బయట పడేశారని చెబుతున్నారు. ప్రభుత్వ బోధానాస్పత్రిలో ఇలాంటి ఘటనలు షరా మామూలేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది. సకాలంలో వైద్య సేవలు అందక ఎందరో మృతి చెందిన ఘటనలు లేకపోలేదు. కొందరు చివరి పరిస్థితుల్లో బతుకు జీవుడా అంటూ ప్రైవేటు హాస్పిటల్స్‌కు తరలివెళుతున్నారు. ఆస్పత్రి ప్రాంగణం పరిశీలిస్తే నిత్యం ఎంతో మంది తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి బయటే పడుకొని ఉండటం దర్శనమిస్తుంది. వారికి కనీస వైద్యసేవలు అందించాలన్న చిత్తశుద్ధి అటు వైద్యుల్లో... ఇటు సిబ్బందిలో కొరవడింది. -
తేలని.. పంచాయితీ!
నల్లగొండ టౌన్ : ఒక్క గది కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగుల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. ఇటీవల ఆధునిక హంగులతో మరమ్మతులు చేపట్టిన క్యాజువాలిటీ విభాగమే ఈ అంతర్గత పోరుకు ఆజ్యం పోసింది. ఈసీజీ విభాగం ఉద్యోగులకు, నర్సింగ్ ఉద్యోగులకు మధ్య పచ్చగడ్డి వేస్తే మండేంత స్థాయిలో పోరు సాగుతోంది. వీరి పంచాయితీని పరిష్కరించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతోనే క్యాజువాలిటీ విభాగం ప్రారంభానికి నోచుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీని కారణంగా రోగులతోపాటు ఆస్పత్రి సిబ్బంది కూడా తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారు. క్యాజువాలిటీ విభాగంలో మూడు గదులను ఏర్పాటు చేశారు. అందులో రెండు నర్సులకు, ఒకటి ఈసీజీ విభాగానికి కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. దీనిని నర్సులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. క్యాజువాలిటీలో విధులు నిర్వర్తించే తమకు సౌకర్యంగా ఉండడానికి మూడు గదులను కేటాయించాలని మహిళా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నర్సులతోపాటు మహిళా స్వీపర్లు కూడా ఇక్కడ విధులలో ఉంటారని, అందరూ డ్యూటీ ముగిసిన తరువాత డ్రెస్‌లు మార్చుకోవడానికి అనుకూలంగా ఉండడంతోపాటు రాత్రి విధులలో ఉండేవారికి సౌకర్యంగా ఉంటుందని వాదిస్తున్నారు. అసలు ఈసీజీ విభాగం ఉద్యోగులు అత్యవసరమైనప్పుడు పిలిపిస్తే వచ్చి ఈసీజీ తీస్తారని, వారికి గది అవసరం లేదని నర్సులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే నర్సులకు రెండు గదులు సరిపోతాయని, తమకు గది కేటాయించకపోతే ఆరుబయట ఈసీజీని తీయాలా అని ప్రశ్నిస్తున్నారు. గదిలో ఈసీజీ తీయడానికి బెడ్‌తోపాటు రోగి కొంతసేపు విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. గది లేకపోతే మహిళా రోగులకు బయట ఈసీజీని తీయగలమా అని ప్రశ్నిస్తున్నారు. తమకు ఎట్టిపరిస్థితులలో గదిని కేటాయించాల్సిందేనంటూ అధికారుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇరువర్గాలకు చెందిన యూనియన్ లీడర్లు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని గది కోసం పట్టుబడుతున్నారు. దీనిపై ఏమి నిర్ణయం తీసుకోలేని అధికారులు క్యాజువాలిటీ ప్రారంభించానికి జంకుతున్నట్లు సమాచారం. ఇరు విభాగాల సిబ్బంది అంతర్గత పోరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లడంతో ఆస్పత్రి అధికారులకు తలనొప్పిగా మారింది. ఉద్యోగులపై అధికారుల అజమాయిషీ లేకపోవడం వల్లే గది కోసం అంతర్గత పోరు సాగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా దీనిపై ఒక నిర్ణయం తీసుకుని క్యాజువాలిటీని వెంటనే ప్రారంభించి రోగులకు సరైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.