ప్రతిభాభారతి... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి మహిళా స్పీకరు! జిల్లా నుంచి సుదీర్ఘకాలం మంత్రిగా కూడా ప్రాతినిధ్యం వహించిన దళిత మహిళ! టీడీపీ ఆవిర్భావం నుంచీ చివరకు పార్టీ కష్టకాలంలో సైతం పక్కపార్టీల వైపు చూడకుండా వెన్నంటిఉన్న సీనియర్ నాయకురాలు! కానీ ఈ ‘ప్రతిభ’ అంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన కొండ్రు మురళీమోహన్ ముందు వెలవెలబోయింది. పార్టీ అధినేత చంద్రబాబు ఆశ చూపించిన ‘సముచిత స్థానం’ అనే బ్రహ్మపదార్థాన్ని నమ్ముకొని ప్రత్యక్ష రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పేసేలా ఉన్న ఆమె నిర్ణయం రాజాం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. జిల్లా టీడీపీ గ్రూపు రాజకీయాల్లో చివరకు మంత్రి అచ్చెన్న చేతులెత్తేయడం, మరో మంత్రి కళావెంకటరావుదే పైచేయి కావడం, రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి కూడా చేజారిపోవడంతో కావలి రాజకీయ వారసత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: కావలి ప్రతిభాభారతి ఎస్సీ రిజర్వుర్డ్ ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి 1983–1999 మధ్యకాలంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కళావెంకటరావు ప్రజారా జ్యం పార్టీలోకి వెళ్లి మళ్లీ టీడీపీలోకి వెనక్కివచ్చినా ఆమె మాత్రం టీడీపీనే నమ్ముకున్నారు. 1999 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా తలపడిన కోండ్రు మురళీమోహన్‌ను మట్టికరిపించారు. అయితే 2004 ఎన్నికల్లో కోండ్రు చేతిలోనే స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 2009 సంవత్సరంలో ఎచ్చెర్ల జనరల్ నియోజకవర్గంగా, రాజాం ఎస్సీ రిజర్వుర్డ్‌గా మారడంతో ఆమె రాజాంకు మారారు.
ఆమె స్వగ్రామం కావలి కూడా రాజాం నియోజకవర్గంలోని సంతకవిటి మండలంలోనే ఉండటంతో ఇదే తనకు సుస్థిర స్థానమని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చారు. అయితే కళా ఇలాకా రేగిడి మండలం రాజాం నియోజకవర్గంలోనే ఉండటం, ఆయన క్యాంపు కార్యాల యం కూడా రాజాంలోనే ఏర్పాటు చేసుకోవ డం, తద్వారారాజకీయ, అధికారిక కార్యకలాపాల్లో కళా జోక్యం మితిమీరడం ప్రతిభాభారతికి గిట్టేదికాదు. పార్టీ గ్రూపు రాజకీయాల్లో మంత్రి అచ్చెన్నాయుడు కొంత సపోర్టు ఇవ్వడంతో ప్రతిభాభారతి కళాను ఢీకొట్టే ప్రయత్నం చేశా రు. కానీ కళా చాపకిందనీరులా పావులు కదిపా రు. చివర్లో అచ్చెన్న చేతులెత్తేయడంతో ఆమె రాజకీయ భవితవ్యమే గందరగోళంలో పడింది.
‘డిపాజిట్’ దక్కని వలస నేతే ఆధారం...
గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిభాభారతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబాల జోగులు చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికలలోనే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌కు డిపాజిట్ కూడా దక్కలేదు. దాదాపు 4,600 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆయన వ్యక్తిగత బలమేమిటో ఆ ఎన్నికలలో తేలిపోయింది. కానీ రాజాం రాజకీయపటంపై నుంచి కావలి కుటుంబ రాజకీయ వారసత్వానికి శాశ్వతంగా ఫుల్‌స్టాప్ పెట్టేలా కళా పావులు కదిపారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రతిభాభారతి వేదనను పార్టీ అధినేత కూడా పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. అసలు గత ఎన్నికలలో కళావెంకటరావు అనుచరులు తనకు సహకరించకపోవడం వల్లే ఓడిపోయానని ఆమె ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. కళాకు మంత్రి పదవి ఇస్తే తాను ఆత్మత్యాగానికీ వెనుకాడబోనని హెచ్చరించినా అరణ్యవేదనే అయ్యింది. చివరకు ఇటీవల జిల్లా ఇన్‌చార్జి మంత్రి పితాని సత్యనారాయణకు కళావెంకటరావుపై ఫిర్యాదు ఇచ్చినా పాచికలు పారలేదు. కౌంటర్‌గా రాజాం నియోజకవర్గంలోని కళా అనుచర నాయకులు అంతా నేరుగా చంద్రబాబుకే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
అంతేకాదు ప్రతిభాభారతిని కట్టడిచేసేందుకు కాంగ్రెస్ నుంచి కోండ్రును తీసుకొచ్చి రాజాం పీఠంపై కూర్చోబెట్టారు. ప్రజలు ఎన్నుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కంబాల జోగులకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వకుండా వాటిని టీడీపీ తమ్ముళ్లకు మళ్లించుకోవడానికి సృష్టించిన రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి కూడా ప్రతిభాభారతి చేతి నుంచి జారిపోయింది. ఆ స్థానాన్ని కోండ్రు మురళీమోహన్‌కు కట్టబెట్టింది.
ప్రతిభ అనుచరులు ఎటు...
కోండ్రు ఎచ్చెర్ల నియోజకవర్గంలోని లావేరు మండలానికి చెందినవారు. ఆ నియోజకవర్గంలో తన స్వలాభం కోసమే కళావెంకటరావు కోండ్రును రాజాం నియోజకవర్గానికి తీసుకొచ్చారనే ఆవేదన ప్రతిభాభారతి వర్గీయుల్లో కనిపిస్తోంది. కోండ్రు రెండుసార్లూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాబల్యం గెలిచి, గత ఎన్నికలలో సొంత బలం చూపించుకోలేక మట్టికరిచినా ఎందుకు తమపై రుద్దుతున్నారో తెలియక గందరగోళపడుతున్నారు. మరోవైపు కోండ్రు దూకుడు వైఖరిని తలచుకొని లోలోనే మదనపడుతున్నారు. అసలు ‘సముచిత స్థానం’ అంటే ఏమిటో తేల్చుకోకుండా తమ నాయకురాలు స్టీరింగ్ వదిలేయడంతో తమ గమ్యస్థానం ఏమిటనే ఆందోళనలో ఉన్నారు.
గత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈ ‘సముచిత స్థానం’ అనే బ్రహ్మాపదార్థంతోనే సంతకవిటిలో సీనియర్ నాయకుడు కోళ్ల అప్పలనాయుడికి ఝలక్ ఇచ్చిన వైనాన్ని ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారంతా కోండ్రు నిర్వహిస్తున్న సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. రాజాం ఏఎంసీ చైర్మన్ పైల వెంకటరమణ, రేగిడి మండలానికి చెందిన కరణం శ్రీనివాసరావు, రాజాంకు చెందిన వంగా వెంకటరావు, టంకాల కన్నంనాయుడు వంటి సీనియర్ నాయకులు అందులో ఉండటం గమనార్హం. కళా, కోండ్రు ద్వయాన్ని ఎదుర్కోవడానికి కావలి వర్గం ఎలాంటి పావులు కదుపుతుందో చూడాలి. ఈ పోరులో చేతులెత్తేస్తే కావలి రాజకీయవారసురాలు గ్రీష్మప్రసాద్ భవితవ్యానికి భరో సా ఎలా దక్కుతుందనేదీ మిలయన్ డాలర్ల ప్రశ్న!!
Comments
Please login to add a commentAdd a comment