టీడీపీ సారథి ఎవరో?
► పర్వత వారసుడి కోసం తర్జనభర్జన
► కాపు సామాజికవర్గానికే మళ్లీ పగ్గాలు!
► బీసీలకు అవకాశం ఇవ్వాలని మరో వాదన
► మొగ్గు మెట్టవైపా? కోనసీమకా?
► పోటీలో సీనియర్ నాయకులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు ఆకస్మిక మృతి జిల్లాలో ఆ పార్టీకి పెద్దలోటే. మంత్రుల మధ్య వర్గపోరు నడుస్తున్నా పర్వత పార్టీలో అందరివాడుగా ఉండేవారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం చేతులెత్తేయడం, రాజధాని భూముల వ్యవహారంలో అక్రమాలు, కేంద్ర నిధుల సాధనలో వైఫల్యం, మరోవైపు గ్రామాల్లో జన్మభూమి కమిటీల పెత్తనం తదితర కారణాలతో ప్రజావ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో జిల్లా సారథిగా అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని ఎంపిక చేయూలంటే అధిష్టానానికి కష్టమే. ఈ పదవి కోసం కొందరు సీనియర్ నాయకులు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు.
జిల్లా అధ్యక్షుడి హోదాలో లభించే వెసులుబాటును ఉపయోగించుకొని రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనే తపన ఉన్న జూనియర్ నాయకులు కూడా తమ వంతు కృషి చేసుకుంటున్నట్టు తెలిసింది. కాగా జిల్లాలో పార్టీ పగ్గాల్ని మళ్లీ కాపు సామాజిక వర్గానికే ఇస్తారా లేక బీసీ, ఎస్సీల్లో ఎవరికైనా ఇస్తారా అనే చర్చ కూడా నడుస్తోంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభించే అవకాశం ఉన్న దృష్ట్యా కాపు నాయకుడికే టీడీపీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ కాపులకే ఇచ్చినా మెట్ట ప్రాంతం వారికా లేదా కోనసీమ నేతలకా అనేది మరో చర్చ.
చిక్కాలకు దక్కుతుందా..?
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతల్లో ప్రస్తుతం ఎలాంటి పద వీ లేని వ్యక్తి చిక్కాల రామచంద్రరావే కనిపిస్తున్నారు. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. వివాదాస్పదం కాని వ్యక్తిగా, సౌమ్యుడిగా పేరుంది. గతంలో ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందనే ప్రచారం జరిగినా అధిష్టానం మొండిచెయ్యి చూపింది. కనీసం నామినేటెడ్ పదవైనా ఇస్తారనుకున్నా అదీ లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ కాపు సామాజిక వర్గానికే సారథ్య బాధ్యతలు అప్పగించాలనుకుంటే చిక్కాలకే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే.. ఇప్పటికే ఎన్నికల సమయంలో కాపులకు ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చలేదంటూ ముద్రగడ కాపు ఉద్యమం తలపెట్టిన దృష్ట్యా సౌమ్యుడు చిక్కాల కన్నా దూకుడుగా ఉండే కాపు నాయకుడు ఎవరికైనా అవకాశం ఇవ్వవచ్చనే వాదనా వినిపిస్తోంది.
అదే కోణంలో అయితే రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు అవకాశం రావచ్చు. అలా పార్టీ జిల్లా సారథి అయితే మాత్రం తోట మంత్రి పదవి కలలపై నీళ్లు చల్లినట్లే! మరో సీనియర్ నాయకుడు, కోనసీమ ప్రాంతానికి చెందిన బండారు సత్యానందరావు పేరు కూడా వినిపిస్తోంది. కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నేత చిర్ల జగ్గిరెడ్డితో పోటీపడి ఓటమి పాలైన ఆయనకు ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం భావిస్తే.. బండారుకు మళ్లీ చక్రం తిప్పే అవకాశం లభిస్తుంది. అందుకే ఆయన కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
పదవి కోసం రాజా యత్నం..!
కాపు ఉద్యమాన్ని తలకెత్తుకున్న ముద్రగడ పద్మనాభం, వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ వంటి సీనియర్ నాయకులను ఎదుర్కోవాలంటే మెట్ట ప్రాంతం వారికే పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలనే వాదన కూడా టీడీపీ శ్రేణుల్లో మొదలైంది. ఈ కోణంలో అవకాశం వస్తుందనే ఆశతో డీసీసీబీ అధ్యక్షుడు వరుపుల రాజా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
రేసులో పిల్లి సత్యనారాయణ..!
ఇప్పటివరకూ జిల్లాలో బలీయమైన కాపు సామాజిక వర్గానికే జిల్లాలో టీడీపీ సారథ్య బాధ్యతలు దక్కుతున్నాయి. జిల్లాలో బీసీలు కూడా ప్రాధాన్య స్థానంలోనే ఉన్నారు. ఆ వర్గాలను ఆకట్టుకోవడానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు చాన్స్ ఇవ్వవచ్చనే చర్చ నడుస్తోంది. ఒకవేళ ఆయనకే ఇస్తే మంత్రి పదవిపై ఆయన ఆశలు దాదాపు ఆవిరైనట్లే! కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త సత్యనారాయణ కూడా ఈ రేస్‌లో ఉన్నట్లు తెలిసింది. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప జిల్లా అధ్యక్షుడిగా చేస్తున్న సమయంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏదిఏమైనా అటు అధిష్టానానికి, ఇటు జిల్లాలో మంత్రులిద్దరికీ అనుకూలమైనవారికే టీడీపీ అధ్యక్ష పదవి దక్కుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది.
పార్టీ మారనున్న ప్రసాద్..!
ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా కూడా పర్వత చిట్టిబాబే వ్యవహరించేవారు. ఆయన మరణంతో టీడీపీ శ్రేణులు అక్కడ కూడా నాయకుడి అన్వేషణలో పడ్డాయి. ఈ నియోజకవర్గ రాజకీయాల్లో పర్వత, వరుపుల, ముద్రగడ కుటుంబాలదే ఇప్పటివరకూ పైచేయి. ఏ పార్టీ అయినా ఆ కుటుంబాల నుంచే రావాలి. ఈ నేపథ్యంలో పర్వత కుటుంబంలోనే ఎవరికైనా ఇవ్వవచ్చనే చర్చ మొదలైంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పర్వత ప్రసాద్ పేరు తెరపైకి రావడం గమనార్హం. సోమవారం చిట్టిబాబు కుటుంబసభ్యులను పరామర్శించడానికి వెళ్లిన ఆయన సాయంత్రం వరకూ ఆ ఇంటివద్దే ఉన్నారు. పరామర్శకు వచ్చిన ఎంపీ తోట నరసింహంతో ఎక్కువ సమయం మాట్లాడుతూ కనిపించడంతో ప్రసాద్ పార్టీ మారతారని టీడీపీ శ్రేణుల్లో చర్చ మొదలైంది.