ఏఆర్‌లో అంతర్గత పోరుతో కలెక్టర్‌కు అగౌరవం ! | Internal Fighting in AR | Sakshi
Sakshi News home page

ఏఆర్‌లో అంతర్గత పోరుతో కలెక్టర్‌కు అగౌరవం !

Published Tue, Jan 27 2015 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM

Internal Fighting in AR

సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఆర్మ్‌డ్ రిజర్వ్ ఫోర్స్... జిల్లా పోలీస్ శాఖలో కీలకమైన విభాగమిది. ఈ విభాగానికి చెందిన కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలే ఎస్కార్ట్, గార్డు, గన్‌మెన్, స్క్వాడ్ డ్యూటీలు చేస్తారు. పోలీస్ అధికారుల వాహనాల నిర్వహణ ఈ విభాగం అధికారులే చూస్తారు. పోలీసు మైదానం వారి పరిధిలోనే ఉంటుంది. అక్కడే కార్యక్రమాలు జరిగినా వాళ్లే బాధ్యత వహించాలి. అంతటి ప్రాధాన్యం గల ఆర్మ్‌డ్ రిజర్వు విభాగం ఇప్పుడు అంతర్గత పోరుతో సతమతమవుతోంది. ఈ క్రమంలోనే అధికారులు ఒకరినొకరు దెబ్బతీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పూర్తిగా సమన్వయం లోపించింది.  సోమవారం జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో చోటు చేసుకున్న పరిణామమే ఇందుకు ఉదాహరణ. బేరక్స్‌లో జరిగే ఉత్సవాల్లో  కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించేందుకు ఇన్‌స్పెక్షన్ వాహనం ఏర్పాటు చేయాలి. ఏటా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. కానీ ఈసారి కలెక్టర్‌కు  ఇన్‌స్పెక్షన్ వాహనం ఏర్పాటు చేయలేదు. దీంతో కాలి నడకన వెళ్లి గౌరవవందనం స్వీకరించారు. ఎందుకిలా చేశారని అడిగితే వాహనం రిపేర్‌లో ఉందని కొందరు, ఆ సమయానికి డ్రైవర్ రాలేదని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనప్పటికీ కలెక్టర్‌ను అగౌరవ పరిచినట్టే చెప్పుకోవాలి.
 
   మూడు ముక్కలాట
 ఆర్‌‌మడ్ రిజర్వుడు విభాగంలో ముగ్గురు అధికారుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. తమ వ్యవహారాలకు అడ్డు తగులుతున్నారని ఒకరిని మిగతా ఇద్దరు అధికారులు విభేదిస్తుండగా, వారిద్దరి అవినీతి వ్యవహారాలు బయటపెడుతున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారన్న ఆవేదనతో ఆ అధికారి ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి తీవ్ర స్థాయిలో పోరు నడుస్తోంది. బ్యాంకుల నగదు గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేసేందుకు ఎస్కార్ట్ డ్యూటీలకు పంపించే కానిస్టేబుళ్లకు అలెవెన్సులు ఇవ్వకుండా మింగేస్తున్నారని, కొందరికే డ్యూటీలేసి ఇంకొందర్ని వదిలేస్తున్నారని, యూనిఫారం స్టిచ్చింగ్ ఛార్జీల్లో కక్కుర్తి పడుతున్నారనే  ఆరోపణల్ని ఒక అధికారి మూటగట్టుకోగా, ఇంకో అధికారి  గన్‌మెన్‌ల నుంచి నెలకు రూ.2 వేల నుంచి రూ.3వేల వరకూ వసూలు చేశారని, ఆయనపై విచారణ కూడా జరిగిందన్న ఆరోపణలున్నాయి.  వాహనాల నిర్వహణలో కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.  వీరిద్దరూ తన చేతికి చిక్క లేదని మరో అధికారి గుర్రుగా ఉన్నారు.  తనదైన శైలీలో చర్యలు తీసుకుంటున్నారన్న  వాదనలు ఉన్నాయి. ఆ మధ్య  ఎన్నికల వ్యయం కింద వచ్చిన నిధుల్లో రూ.50లక్షలు దుర్వినియోగమైనట్ట  ఆరోపణలున్నాయి. ఈ విధంగా ఆ ముగ్గురు అధికారులు ఒకరికొకరు విభేధించుకుని పాలనా వ్యవహారాల్ని గాలికొదిలేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యవహరిస్తుండడంతో క్రమశిక్షణ కూడా లోపించినట్టు తెలుస్తోంది. అందుకు రిపబ్లిక్ డే ఉత్సవాల్లో చోటుచేసుకున్న సంఘటననే ఉదాహరణ. ప్రతిసారి రిపబ్లిక్ డే ఉత్సవాలకు కలెక్టర్ గౌరవ వందనం స్వీకరణ కోసం చింతవలస ఏపీ ఎస్పీ బెటాలియన్ నుంచి ఇన్‌స్పెక్షన్ వాహనం మూడు రోజుల ముందే తీసుకొచ్చి, దానితో పెరైడ్ ప్రాక్టీసు చేస్తారు. లోటుపాట్లు ఏవైనా ఉంటే ఈలోగానే పరిష్కరించుకుంటారు. ఉత్సవాలు జరిగే నాటికి అంతా పక్కాగా సిద్ధం చేస్తారు. కానీ సోమవారం జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో స్పష్టమైన లోటు కన్పించింది. కలెక్టర్‌కు సమకూర్చాల్సిన ఇన్‌స్పెక్షన్ వాహనాన్ని గౌరవవందనం స్వీకరించే సమయానికి తీసుకురాలేదు. అంతా సిద్ధమయ్యేసరికి వాహనం ఎక్కడని తలో దిక్కు చూశారు. ఎంతసేపైనా మైదానంలోకి వాహనం రాలేదు.
 
 దీంతో గత్యంతరం లేక కలెక్టర్ ఎం.ఎం.నాయక్ కాలి నడకన వెళ్లి గౌరవ వందనం స్వీకరించారు. బయటకి వ్యక్తం చేయలేకపోయినా కలెక్టర్‌కు  ఈ పరిణామం కాసింత అవమానకరంగానే చెప్పుకోవాలి. ఇదే విషయాన్ని స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ టి.త్రినాథ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఇన్‌స్పెక్షన్ వాహనం పాడైందని, అందుకనే ఏర్పాటు చేయలేకపోయామని చెప్పుకొచ్చారు. కానీ ఏఆర్ సిబ్బందిలో మాత్రం భిన్న వాదనలు విన్పించాయి. పాడవడం వల్ల అని   కొందరు, ఆ సమయానికి డ్రైవర్ లేకపోవడం వల్ల వాహనం పెట్టలేకపోయామని మరికొందరు చెప్పుకొచ్చారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement