పట్టు కోసం ఎమ్మెల్యే ల పోరు
శృంగవరపుకోట టీడీపీలో ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. నువ్వా.. నేనా అన్న రీతిలో వ్యవహారం కొనసాగుతోంది. వీరి మధ్య పోరు నడవడం కొత్తేమి కాకపోయినా ఇప్పుడు మరింత రసవత్తరంగా సాగుతోంది. సాధారణ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే సీటు కోసం పోరు నడిచింది. ఇప్పుడు నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం పోరు నడుస్తోంది. ఎమ్మెల్యే పదవితో ఒకరు, చేతికొచ్చిన జెడ్పీ చైర్‌పర్సన్ పవర్‌తో ఇంకొకరు పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్ భయంతో కోళ్ల లలితకుమారి ఒక అడుగు ముందుకేసి తమ అధినేత చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఎన్నికలకు ముందు ఎస్.కోట ఎమ్మెల్యే టిక్కెట్‌పై కోళ్ల లలితకుమారి, శోభా హైమావతి కన్నేశారు. నియోజకవర్గంలో కోళ్ల లలితకుమారికి వ్యతిరేకత ఉందన్న అస్త్రంతో హైమావతి ముందుకెళ్లగా, కొప్పల వెలమ సామాజిక వర్గం ఎక్కువగా నియోజకవర్గంలో ఉన్నారని, అదే సామాజిక వర్గానికి చెందిన తనకు టిక్కెట్ ఇవ్వాలన్న నినాదంతో లలితకుమారి టిక్కెట్ కోసం పోటీ పడ్డారు. దీంతో ఇరువురు రెండు గ్రూపులుగా విడిపోయి సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకుని తమ వాదనను అప్పట్లో వినిపించారు. అవకాశం వచ్చినప్పుడుల్లా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. అధినేత చంద్రబాబునాయుడు వద్ద తమదైన బాణీలో వాణి విన్పించారు.
ఈలోపే జెడ్పీటీసీ ఎన్నికలు రావడంతో వీరిద్దరికీ ఉపశమనం లభించింది. లలితకుమారికి ఎమ్మెల్యే టిక్కెట్, హైమావతి కుమార్తె స్వాతిరాణికి జెడ్పీ చైర్‌పర్సన్ పదవి ఇస్తామని అధిష్టానం ప్రకటించడంతో పరిస్థితి సద్దుమణిగింది. దీంతో మనసులు కలిసి ఎన్నికల్లో ఐక్యతగా పని చేశారు. గెలిచారు. ఇద్దరికీ పదవులు లభిం చాయి. దీంతో హమ్మయ్యా! అని టీడీపీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో మళ్లీ వారి మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యేగా తన ఆధిపత్యం కొనసాగాలని కోళ్ల లలితకుమారి ప్రయత్నిస్తుండగా, జెడ్పీ చైర్‌పర్సన్ హోదాలో పట్టు సాధించాలని హైమావతి ఆరాట పడుతున్నారు.
ముఖ్యంగా వేపాడ, ఎస్.కోట మండలాలను పూర్తిగా తనకే వదిలేయాలని, ఆ రెండింటిలో అభివృద్ధి, సంక్షేమ, కాంట్రాక్ట్ కార్యక్రమాలు తానే చూసుకుంటానని శోభా హైమావతి పార్టీ శ్రేణుల వద్ద అంతర్లీనంగా చెబుతున్న వార్తలతో కోళ్ల లలితకుమారి ఆవేదన చెందుతోంది. ఎమ్మెల్యేగా నియోజకవర్గమంతా తన పర్యవేక్షణలో ఉంటుందని, రెండు మండలాలను వేరుగా చూడటమేంటని కోళ్ల వర్గీయులు మండి పడుతున్నారు. ఇదంతా భవిష్యత్ వ్యూహామేనని, హైమావతి అల్లుడ్ని ఇక్కడ బరిలోకి దించాలనే ఆలోచన ఉందని, స్వతహాగా ఆమె అల్లుడు గణేష్ కొప్పల వెలమ సామాజిక వర్గానికి చెందిన వారని, అందుకోసం ఇప్పటి నుంచే కేడర్‌ను తనవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారని కోళ్ల లలితకుమారి అభద్రతా భావానికి లోనవుతున్నారు.
మరో పవర్ సెంటర్ తయారైతే ఇబ్బందులొస్తాయని భావిస్తూ లలితకుమారి అప్రమత్తమయ్యారు. ఆ ప్రయత్నాలను తిప్పికొట్టాలని, తనకే నియోజకవర్గం సొంతం కావాలని పావులు కదుపుతున్నారు. ఈ మేరకు జిల్లాలోని శోభా హైమావతికి వ్యతిరేక వర్గంగా కొనసాగుతున్న ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబుకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు.