mla Kolla Lalitha Kumari
-
అమ్మేశారు..
కొత్తవలస రూరల్ : విద్యుత్ సబ్ స్టేషన్లో పనిచేసే షిప్టు ఆపరేటర్ల పోస్టులను ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అమ్మేశారని కొత్తవలస మండలం తుమ్మికాపల్లి గ్రామస్తులు ఆరోపించారు. దీనికి నిరసనగా తుమ్మికాపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆదివారం ముట్టడించారు. గ్రామంలోని అర్హులైన యువతతో పోస్టులు భర్తీ చేయాలంటూ డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు ఏ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయడం లేదని, అందిన కాడికి దోచుకుంటున్నారని, నమ్మిన వారిని నిలువునా ముంచేస్తున్నారంటూ వాపోయారు. వివరాల్లోకి వెళ్తే... కొత్తవలస మండలం తుమ్మికాపల్లి గ్రామంలో సర్వే నంబర్ 72/4లో సుమారు రూ.2 కోట్లు విలువ చేసే 70 సెంట్ల భూమిలో గతేడాది 33/11 కేవీ ఏపీఈపీడీసీఎల్ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించారు. భూమిని ఇస్తే అర్హులైన నిరుద్యోగులకు సబ్ స్టేషన్లో షిఫ్టు ఆపరేటర్ల పోస్టులు ఇప్పిస్తామని తుమ్మికాపల్లి సర్పంచ్ భర్త పిల్లా అప్పలరాజు నమ్మబలికారు. గ్రామపెద్దలు తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో భూమి ఇచ్చారు. అక్కడే సీన్ రివర్స్ అయింది. అప్పలరాజు ఆధ్వర్యంలో గ్రామంలో యువతకి ఉద్యోగాలిస్తామని ఒప్పందం కుదుర్చుకున్న విద్యుత్ అధికారులు సబ్‌స్టేషన్ పనులు పూర్తయిన తరువాత ఎమ్మెల్యే సిపార్సుల మేరకు గ్రామంలో ఒక్కరికి మాత్రమే ఉద్యోగం ఇచ్చి మిగిలిన మూడు పోస్టులను టీడీపీ అనుయాయులతో భర్తీ చేశారని మాజీ సర్పంచి విరోతి కొండలరావుతో పాటు ఉద్యోగం వస్తుందని ఎదురుచూస్తున్న ఎస్.మహేశ్, బి.రవి, ఎ. నాగరాజు తదితరులు ఆరోపించారు. తమకు రావాల్సిన ఉద్యోగాలు వెరొకరికి ఎలా ఇచ్చారని విద్యుత్ శాఖ అధికారులకు, కలెక్టర్ గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. ఎమ్మెల్యే సిఫార్సుల మేరకు పోస్టులు భర్తీ చేశామని, తామేమీ చేయలేమం టూ విద్యుత్ శాఖ అధికారులు చెప్పారన్నారు. దీనిని నిరసనగా విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడిం చామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు తగిన బుద్ధిచెబుతామంటూ హెచ్చరించారు. తుమ్మికాపల్లి గ్రామస్తుల న్యాయ పోరాటానికి ఎస్. కోట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అల్లు జోగినాయుడు మద్దతుగా నిలిచారు. ఇంత మోసం చేస్తారను కోలేదు... పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామంటే ప్రస్తుత సర్పంచి భర్త పిల్లా అప్పలరాజుతో కలిసి మేమే గ్రామస్తులను ఒప్పించి భూమి ఇప్పించాం. తీరా నిర్మాణం పూర్తయిన తరువాత ఉద్యోగాలు టీడీపీ కార్యకర్తలకు చెందిన వారికి ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సిఫార్సులు చేయడం దారుణం. దీనిపై అప్పలరాజుని ప్రశ్నిస్తే... తన మాట కూడా వినకుండా ఉద్యోగాలకు సిఫార్సు చేశారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధిచెబుతాం. – వి.కొండలరావు, మాజీ సర్పంచ్ -
ఎమ్మెల్యే ఇంటి వద్ద తమ్ముళ్ల ఆందోళన
లక్కవరపుకోట (ఎస్‌కోట): మండల పరిషత్ ఎన్నికల సమయంలో నిర్ణయించుకున్న ప్రకారం జెంటిల్మన్ ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి (టీడీపీ) ఇంటిముందు ఆందోళనకు దిగారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోటలో శుక్రవారం జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2014 ఏప్రిల్‌లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో టీడీపీ ఆధిక్యం సాధించగా ఎంపీపీ పదవికి ఇద్దరు పోటీపడ్డారు. అందులో రెడ్డి వెంకన్నకు ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శోభా హైమావతి, జెడ్పీ చైర్పర్సన్ స్వాతిరాణి అండదండలున్నాయి. మరో వ్యక్తి మండల పార్టీ అధ్యక్షుడు ఆర్.చంద్రశేఖర్‌కు ఎమ్మెల్యే లలితకుమారి అండ ఉంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరిద్దరూ మండలంలో కీలక నేతలే. అప్పట్లో సమస్య పరిష్కరించేందుకు జంటిల్మన్ ఒప్పందాన్ని తెరపైకి తీసుకువచ్చి చెరో రెండున్నరేళ్లపాటు పదవిలో ఉండాలని, మొదట అవకాశం రెడ్డి వెంకన్నకే ఇస్తూ తీర్మానించారు. 2017 జనవరి 5వ తేదీతో ఆయన గడువు ముగియగా చంద్రశేఖర్ పదవి తనకివ్వాలంటూ పట్టుబడుతూ వచ్చారు. దీనిపై ఇప్పటికే మంత్రుల సమక్షంలో మూడు సార్లు పంచాయతీ నిర్వహించారు. పదవిని వదులుకునేందుకు సిద్ధంగా లేనని రెడ్డి వెంకన్న తెగేసి చెప్పారు. అయితే అయనపై చర్యలు తీసుకునే సాహసం చేయని నేతలు వివాదాన్ని పరిష్కరించలేకపోయారు. దీనికి నిరసనగా చంద్రశేఖర్ తన అనుయాయులతో కొంతకాలంగా మండల సమావేశాలకు సైతం గైర్హాజరవుతున్నారు. మరోసారి గైర్హాజరైతే చట్టరీత్యా పదవులు కోల్పోవాల్సి వస్తుందని అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్న చంద్రశేఖర్ 4వందల మంది మద్దతుదారులతో శుక్రవారం ఎమ్మెల్యే లలితకుమారి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి వారిని శాంతపరచి పంపించేశారు. కాగా వీరి ఆందోళనకు ముందే ఎంపీపీ రెడ్డి వెంకన్న ఎమ్మెల్యే లలితకుమారిని కలసి తాను పదవిని వీడేది లేదనీ, అవసరమైతే తనను పార్టీనుంచి సస్పెండ్ చేయమని కూడా సవాల్ విసిరారని తెలిసింది. -
జిల్లాకు రూ.87కోట్లు ఉపాధి నిధులు
జాగరం (జామి) : ఎన్ఆర్ఈజీఎస్ (ఉపాధిహామీ)ద్వారా జిల్లాకు రూ.87కోట్లు మంజూరు అయినట్లు జెడ్పీ చైర్పర్సన్ శోభ స్వాతిరాణి తెలిపారు. జామి మండలంలోని జాగరం గ్రామంలో నీరు-చెట్టు కింద మంజూరైన రాజచెరువులోని పనులను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారితో కలిసి బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మండలానికి రూ.మూడు కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ప్రస్తుతం ప్రతి గ్రామపంచాయతీలోనూ సర్పంచ్ల వద్ద నిదులు పుష్కలంగా ఉన్నాయన్నారు.13,14వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకే చేరుతున్నాయన్నారు. ఏ సర్పంచ్ వద్ద కూడా నిదులు 30 లక్షలకు తక్కువగా లేవన్నారు. పంచాయతీల అభివృద్ధిపై దృష్టిసారించాలని కోరారు. ప్రస్తుతం భూగర్భజలాలు అట్టడుగు స్థాయికి చేరుకున్నాయన్నారు. గతంలో 50 అడుగుల్లో నీరు ఉండేదని, ప్రస్తుతం 150 నుంచి 200 అడుగుల వరకు నీరు ఉండడం లేదన్నారు. భూ గర్భజలాలను మనమందరం కాపాడుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నీరు- చెట్టు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. అధికారులు,నేతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయలని కోరారు. ఎమ్మెల్యే లలిత కుమారి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామన్నారు.ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు,నీరు-చెట్టు కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పరశాన అప్పయ్యమ్మ,జెడ్పీటీసీ బండారు పెదబాబు, మండల ఉపాధ్యక్షుడు లగుడు సింహాద్రి, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు రెడ్డి పైడిబాబు,మంగమ్మ,తదితర మండలస్థాయి నేతలు ఇరిగేషన్ డీఈ ఎస్‌సీహెచ్ .అప్పలనాయుడు,ఎంపీడీఓ ఎస్.శారదాదేవి,తహశీల్దార్ ఆర్.ఎర్నాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు. -
పట్టు కోసం ఎమ్మెల్యే ల పోరు
శృంగవరపుకోట టీడీపీలో ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. నువ్వా.. నేనా అన్న రీతిలో వ్యవహారం కొనసాగుతోంది. వీరి మధ్య పోరు నడవడం కొత్తేమి కాకపోయినా ఇప్పుడు మరింత రసవత్తరంగా సాగుతోంది. సాధారణ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే సీటు కోసం పోరు నడిచింది. ఇప్పుడు నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం పోరు నడుస్తోంది. ఎమ్మెల్యే పదవితో ఒకరు, చేతికొచ్చిన జెడ్పీ చైర్పర్సన్ పవర్‌తో ఇంకొకరు పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్ భయంతో కోళ్ల లలితకుమారి ఒక అడుగు ముందుకేసి తమ అధినేత చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఎన్నికలకు ముందు ఎస్.కోట ఎమ్మెల్యే టిక్కెట్‌పై కోళ్ల లలితకుమారి, శోభా హైమావతి కన్నేశారు. నియోజకవర్గంలో కోళ్ల లలితకుమారికి వ్యతిరేకత ఉందన్న అస్త్రంతో హైమావతి ముందుకెళ్లగా, కొప్పల వెలమ సామాజిక వర్గం ఎక్కువగా నియోజకవర్గంలో ఉన్నారని, అదే సామాజిక వర్గానికి చెందిన తనకు టిక్కెట్ ఇవ్వాలన్న నినాదంతో లలితకుమారి టిక్కెట్ కోసం పోటీ పడ్డారు. దీంతో ఇరువురు రెండు గ్రూపులుగా విడిపోయి సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకుని తమ వాదనను అప్పట్లో వినిపించారు. అవకాశం వచ్చినప్పుడుల్లా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. అధినేత చంద్రబాబునాయుడు వద్ద తమదైన బాణీలో వాణి విన్పించారు. ఈలోపే జెడ్పీటీసీ ఎన్నికలు రావడంతో వీరిద్దరికీ ఉపశమనం లభించింది. లలితకుమారికి ఎమ్మెల్యే టిక్కెట్, హైమావతి కుమార్తె స్వాతిరాణికి జెడ్పీ చైర్పర్సన్ పదవి ఇస్తామని అధిష్టానం ప్రకటించడంతో పరిస్థితి సద్దుమణిగింది. దీంతో మనసులు కలిసి ఎన్నికల్లో ఐక్యతగా పని చేశారు. గెలిచారు. ఇద్దరికీ పదవులు లభిం చాయి. దీంతో హమ్మయ్యా! అని టీడీపీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో మళ్లీ వారి మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యేగా తన ఆధిపత్యం కొనసాగాలని కోళ్ల లలితకుమారి ప్రయత్నిస్తుండగా, జెడ్పీ చైర్పర్సన్ హోదాలో పట్టు సాధించాలని హైమావతి ఆరాట పడుతున్నారు. ముఖ్యంగా వేపాడ, ఎస్.కోట మండలాలను పూర్తిగా తనకే వదిలేయాలని, ఆ రెండింటిలో అభివృద్ధి, సంక్షేమ, కాంట్రాక్ట్ కార్యక్రమాలు తానే చూసుకుంటానని శోభా హైమావతి పార్టీ శ్రేణుల వద్ద అంతర్లీనంగా చెబుతున్న వార్తలతో కోళ్ల లలితకుమారి ఆవేదన చెందుతోంది. ఎమ్మెల్యేగా నియోజకవర్గమంతా తన పర్యవేక్షణలో ఉంటుందని, రెండు మండలాలను వేరుగా చూడటమేంటని కోళ్ల వర్గీయులు మండి పడుతున్నారు. ఇదంతా భవిష్యత్ వ్యూహామేనని, హైమావతి అల్లుడ్ని ఇక్కడ బరిలోకి దించాలనే ఆలోచన ఉందని, స్వతహాగా ఆమె అల్లుడు గణేష్ కొప్పల వెలమ సామాజిక వర్గానికి చెందిన వారని, అందుకోసం ఇప్పటి నుంచే కేడర్‌ను తనవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారని కోళ్ల లలితకుమారి అభద్రతా భావానికి లోనవుతున్నారు. మరో పవర్ సెంటర్ తయారైతే ఇబ్బందులొస్తాయని భావిస్తూ లలితకుమారి అప్రమత్తమయ్యారు. ఆ ప్రయత్నాలను తిప్పికొట్టాలని, తనకే నియోజకవర్గం సొంతం కావాలని పావులు కదుపుతున్నారు. ఈ మేరకు జిల్లాలోని శోభా హైమావతికి వ్యతిరేక వర్గంగా కొనసాగుతున్న ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబుకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు.