జాగరం (జామి) : ఎన్‌ఆర్‌ఈజీఎస్ (ఉపాధిహామీ)ద్వారా జిల్లాకు రూ.87కోట్లు మంజూరు అయినట్లు జెడ్‌పీ చైర్‌పర్సన్ శోభ స్వాతిరాణి తెలిపారు. జామి మండలంలోని జాగరం గ్రామంలో నీరు-చెట్టు కింద మంజూరైన రాజచెరువులోని పనులను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారితో కలిసి బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా మండలానికి రూ.మూడు కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.
ప్రస్తుతం ప్రతి గ్రామపంచాయతీలోనూ సర్పంచ్‌ల వద్ద నిదులు పుష్కలంగా ఉన్నాయన్నారు.13,14వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకే చేరుతున్నాయన్నారు. ఏ సర్పంచ్ వద్ద కూడా నిదులు 30 లక్షలకు తక్కువగా లేవన్నారు. పంచాయతీల అభివృద్ధిపై దృష్టిసారించాలని కోరారు. ప్రస్తుతం భూగర్భజలాలు అట్టడుగు స్థాయికి చేరుకున్నాయన్నారు. గతంలో 50 అడుగుల్లో నీరు ఉండేదని, ప్రస్తుతం 150 నుంచి 200 అడుగుల వరకు నీరు ఉండడం లేదన్నారు.
భూ గర్భజలాలను మనమందరం కాపాడుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నీరు- చెట్టు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. అధికారులు,నేతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయలని కోరారు. ఎమ్మెల్యే లలిత కుమారి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామన్నారు.ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు,నీరు-చెట్టు కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పరశాన అప్పయ్యమ్మ,జెడ్‌పీటీసీ బండారు పెదబాబు, మండల ఉపాధ్యక్షుడు లగుడు సింహాద్రి, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు రెడ్డి పైడిబాబు,మంగమ్మ,తదితర మండలస్థాయి నేతలు ఇరిగేషన్ డీఈ ఎస్‌సీహెచ్ .అప్పలనాయుడు,ఎంపీడీఓ ఎస్.శారదాదేవి,తహశీల్దార్ ఆర్.ఎర్నాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు.
జిల్లాకు రూ.87కోట్లు ఉపాధి నిధులు
Published Thu, May 21 2015 2:08 AM | Last Updated on Sat, Oct 20 2018 5:39 PM
Advertisement
Advertisement