► ‘ఉపాధి’ పనులకు ‘నీరు-చెట్టు’ మెరుగులు
► అధికార పార్టీ నాయకుల జిమ్మిక్కులు
►అధికారులకు భారీగా ముడుపులు
► రూ.11.63 లక్షలు ఉపాధి హామీ కింద చేసిన పనులకు రూ.33.85లక్షల నీరు-చెట్టు నిధులు
పెళ్లకూరు: ‘నీరు-చెట్టు పథకం కింద టీడీపీ కార్యకర్తలకు రాష్ర్ట ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పనులు చేజిక్కించుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు పనులు పూర్తి చేసినట్లు తెలియజేస్తారు. వెంటనే వారికి బిల్లులు చేయండి. అంతేగాని పనులపై పర్యవేక్షణ, పని లోపాలు గుర్తించాల్సిన అవసరం అధికారులకు లేదు. బిల్లులు చేసే అధికారులకు ఫార్మాలిటీస్ అంతా తమ్ముళ్లే చూసుకుంటారు’ - సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని అధికారులకు టీడీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే హుకుం చేశారు. దీంతో టీడీపీ శ్రేణుల అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. కొత్తకొత్త మార్గాలు అన్వేషించి మరీ ప్రభుత్వ నిధులను కొల్లగొడుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు సైతం తూతూమంత్రంగా మెరుగులు దిద్ది భారీమొత్తం తమ ఖాతాల్లో జమవేసుకుంటున్నారు.
తూతూ మంత్రంగా..
కానూరు పంచాయతీలోని కొండచెరువు కట్టపనులను (వర్క్‌కోడ్ : 091334307007050459) 2014 జూలై, 24 నుంచి ఉపాధి హామీ కూలీలతో నిర్వహించారు. ఈ పనులకు సంబంధించి రూ.1,38,391 ఉపాధి హామీ నిధులను కూలీలకు చెల్లించారు. అయితే అదే ప్రాంతానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ఉపాధి కూలీలు చేసిన పనులపై తూతూమంత్రంగా యంత్రాలతో మెరుగులు దిద్ది రూ.9.4లక్షలు నీరు-చెట్టు నిధులు స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా కానూరు రాజుపాళెంలో గంగిరేనిగుంట కట్టపనులను ఉపాధి హామీ పథకం కింద (వర్క్ కోడ్ : 091334307007170362) 2016 మే, 5 నుంచి పనులు చేపట్టి 10,343 పని దినాల్లో పూర్తి చేశారు. అందుకు రూ.7,70,932 ఉపాధి హామీ నిధులను కూలీలకు చెల్లించారు. అదేవిధంగా ఉదినాముడి గుంట కట్ట పనులు (వర్క్‌కోడ్ : 091334307007170302) ఉపాధి హామీలో 2,668 పని దినాల్లో కట్ట పనులు చేయడంతో కూలీలకు రూ.2,54,323 చెల్లించారు. అయితే గ్రామానికి చెందిన టీడీపీ నేత ఉపాధి హామీ పథకం కింద చేసిన ఈ పనులకు యంత్రాలతో నామమాత్రంగా తుదిమెరుగులు దిద్ది మరో రూ.24.45 లక్షలు నిధులు బొక్కేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండువారాలుగా ఈ తంతు నడుస్తున్నా అధికారుల్లో చలనం లేకపోవడం విచారకరం.
నిబంధనలకు తూట్లు
ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు మళ్లీ నీరు-చెట్టు కింద నిధులు వెచ్చిస్తుండటంతో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం నీరు-చెట్టు నిధులు బొక్కేసేందుకు అధికారులకు భారీగా ముడుపులిచ్చి అంచనాలు సిద్ధం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ యేడాది మే మాసంలో ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులనే నీరు-చెట్టు పథకం కింద చేజిక్కించుకున్న అధికారపార్టీ నేతలు పైపై మెరుగులు దిద్దుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విశేషం. పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో నేతల ఇష్టారాజ్యమైంది. ఉపాధి హామీలో చేపట్టిన పనులకు నీరు-చెట్టు కింద మరోమారు నిధులు మంజూరు చేయడం చట్టవిరుద్ధం. ఈ క్రమంలో మండలంలో పలుచోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ముందూ వెనుకా చూసుకోకుండా మంచినీళ్ల ప్రాయంలా నీరు-చెట్టు నిధులను ఖర్చు చేస్తున్నవారిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
అనుమతులు ఇవ్వలేదు
ఉపాధి హామీ పథకం కింద చెరువుకట్ట పనులు చేసేందుకు ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతులు ఇవ్వలేదు. ప్రస్తుతం నీరు-చెట్టు పనులను నిబంధనల మేర చేపట్టేలా చర్యలు చేపడుతున్నాం. - ఇరిగేషన్ ఏఈ సుబ్బారావు.
నెల్లూరులో తమ్ముళ్ల అక్రమాలు !
Published Sat, Jul 16 2016 6:30 PM | Last Updated on Sat, Oct 20 2018 5:39 PM
Advertisement