funds transfers
-
‘పీఎం–కిసాన్’ సొమ్ము విడుదల
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) 12వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ అర్హులైన రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, ఎరువుల శాఖల ఆధ్వర్యంలో ప్రారంభమైన పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్–2022 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 12వ విడతలో దాదాపు రూ.16,000 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి చేరాయి. దీంతో ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ.2.16 లక్షల కోట్ల సాయం అందించినట్లయ్యింది. ఏటా 11 కోట్ల మంది రైతన్నలు లబ్ధి పొందుతున్నారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం–కిసాన్ కింద అర్హులకు ప్రతి సంవత్సరం రూ.6,000 మూడు విడతల్లో అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి నాలుగో నెలలకోసారి రూ.2,000ను వారి ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నారు. ఈ పథకాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే అమలు చేస్తోంది. రైతులపై తగ్గిన ఆర్థిక భారం మధ్యవర్తులు, కమీషన్ల ఏజెంట్ల ప్రమేయం లేకుండా పీఎం–కిసాన్ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖతాల్లోకే బదిలీ చేస్తున్నామని ప్రధానీ మోదీ వివరించారు. కిసాన్ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దీపావళి పండుగకు ముందు రైతులకు నిధులు అందడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. రబీ సీజన్లో పంటల సాగుకు ఈ డబ్బులు ఉపయోగపతాయని చెప్పారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అన్నదాతలకు రూ.2 లక్షల కోట్లకుపైగా అందజేశామని తెలిపారు. పీఎం–కిసాన్ పథకం ఆర్థికంగా ఎంతో భారాన్ని తగ్గించిందని రైతులు తనతో చెప్పారని గుర్తుచేశారు. కిసాన్ సమృద్ధి కేంద్రాలు ప్రారంభం ‘ఒకే దేశం, ఒకే ఎరువుల పథకం’లో భాగంగా ‘భారత్’ బ్రాండ్ రాయితీ యూరియాను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల ఆవిష్కరించారు. అలాగే 600 పీఎం–కిసాన్ సమృద్ధి కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ రెండు చర్యల వల్ల రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందుతాయని చెప్పారు. అంతర్జాతీయ ఎరువుల ఈ–వారపత్రిక ‘ఇండియన్ ఎడ్జ్’ను సైతం మోదీ ఆవిష్కరించారు. మార్కెట్లో వివిధ రకాల బ్రాండ్లు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయని, అధిక కమీషన్ కోసం డీలర్లు కొన్ని రకాల బ్రాండ్లనే విక్రయిస్తున్నారని, ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఏకైక బ్రాండ్‌ను తీసుకొచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. ఖజానాపై ‘ఎరువుల’ భారం కిసాన్ సమృద్ధి కేంద్రాల్లో రైతులకు బహుళ సేవలు అందుతాయని తెలియజేశారు. ఇవి ‘వన్ స్టాప్ షాప్’గా పని చేస్తాయన్నారు. దేశవ్యాప్తంగా 3.25 లక్షల రిటైల్ ఎరువుల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మార్చబోతున్నట్లు ప్రకటించారు. ఎరువుల కోసం మనం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని, ఎరువులపై కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా రూ.2.5 లక్షల కోట్ల మేర రాయితీ భారం భరిస్తోందన్నారు. ఒక్కో కిలో ఎరువును రూ.80కి కొని, రైతులకు రూ.6కు అమ్ముతున్నామని చెప్పారు. ఎరువులతోపాటు ముడి చమురు, వంట నూనెల దిగుమతుల భారం సైతం పెరుగుతోందన్నారు. దిగుమతుల బిల్లు తగ్గించుకోవాలని, ఎరువులు, వంట నూనెల ఉత్పత్తిలో స్వయం స్వావలంబన సాధించాలని, ఈ విషయంలో మిషన్ మోడ్‌లో పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్‌లో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, మన్సుఖ్ మాండవియా తదితరులు పాల్గొన్నారు. 13,500 మందికిపైగా రైతులు హాజరయ్యారు. దాదాపు 1,500 వ్యవసాయ స్టార్టప్ కంపెనీలు తమ ఉత్పత్తులను, నవీన ఆవిష్కరణలను ప్రదర్శించాయి. -
నెల్లూరులో తమ్ముళ్ల అక్రమాలు !
► ‘ఉపాధి’ పనులకు ‘నీరు-చెట్టు’ మెరుగులు ► అధికార పార్టీ నాయకుల జిమ్మిక్కులు ►అధికారులకు భారీగా ముడుపులు ► రూ.11.63 లక్షలు ఉపాధి హామీ కింద చేసిన పనులకు రూ.33.85లక్షల నీరు-చెట్టు నిధులు పెళ్లకూరు: ‘నీరు-చెట్టు పథకం కింద టీడీపీ కార్యకర్తలకు రాష్ర్ట ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పనులు చేజిక్కించుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు పనులు పూర్తి చేసినట్లు తెలియజేస్తారు. వెంటనే వారికి బిల్లులు చేయండి. అంతేగాని పనులపై పర్యవేక్షణ, పని లోపాలు గుర్తించాల్సిన అవసరం అధికారులకు లేదు. బిల్లులు చేసే అధికారులకు ఫార్మాలిటీస్ అంతా తమ్ముళ్లే చూసుకుంటారు’ - సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని అధికారులకు టీడీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే హుకుం చేశారు. దీంతో టీడీపీ శ్రేణుల అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. కొత్తకొత్త మార్గాలు అన్వేషించి మరీ ప్రభుత్వ నిధులను కొల్లగొడుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు సైతం తూతూమంత్రంగా మెరుగులు దిద్ది భారీమొత్తం తమ ఖాతాల్లో జమవేసుకుంటున్నారు. తూతూ మంత్రంగా.. కానూరు పంచాయతీలోని కొండచెరువు కట్టపనులను (వర్క్కోడ్ : 091334307007050459) 2014 జూలై, 24 నుంచి ఉపాధి హామీ కూలీలతో నిర్వహించారు. ఈ పనులకు సంబంధించి రూ.1,38,391 ఉపాధి హామీ నిధులను కూలీలకు చెల్లించారు. అయితే అదే ప్రాంతానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ఉపాధి కూలీలు చేసిన పనులపై తూతూమంత్రంగా యంత్రాలతో మెరుగులు దిద్ది రూ.9.4లక్షలు నీరు-చెట్టు నిధులు స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా కానూరు రాజుపాళెంలో గంగిరేనిగుంట కట్టపనులను ఉపాధి హామీ పథకం కింద (వర్క్ కోడ్ : 091334307007170362) 2016 మే, 5 నుంచి పనులు చేపట్టి 10,343 పని దినాల్లో పూర్తి చేశారు. అందుకు రూ.7,70,932 ఉపాధి హామీ నిధులను కూలీలకు చెల్లించారు. అదేవిధంగా ఉదినాముడి గుంట కట్ట పనులు (వర్క్కోడ్ : 091334307007170302) ఉపాధి హామీలో 2,668 పని దినాల్లో కట్ట పనులు చేయడంతో కూలీలకు రూ.2,54,323 చెల్లించారు. అయితే గ్రామానికి చెందిన టీడీపీ నేత ఉపాధి హామీ పథకం కింద చేసిన ఈ పనులకు యంత్రాలతో నామమాత్రంగా తుదిమెరుగులు దిద్ది మరో రూ.24.45 లక్షలు నిధులు బొక్కేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండువారాలుగా ఈ తంతు నడుస్తున్నా అధికారుల్లో చలనం లేకపోవడం విచారకరం. నిబంధనలకు తూట్లు ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు మళ్లీ నీరు-చెట్టు కింద నిధులు వెచ్చిస్తుండటంతో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం నీరు-చెట్టు నిధులు బొక్కేసేందుకు అధికారులకు భారీగా ముడుపులిచ్చి అంచనాలు సిద్ధం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ యేడాది మే మాసంలో ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులనే నీరు-చెట్టు పథకం కింద చేజిక్కించుకున్న అధికారపార్టీ నేతలు పైపై మెరుగులు దిద్దుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విశేషం. పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో నేతల ఇష్టారాజ్యమైంది. ఉపాధి హామీలో చేపట్టిన పనులకు నీరు-చెట్టు కింద మరోమారు నిధులు మంజూరు చేయడం చట్టవిరుద్ధం. ఈ క్రమంలో మండలంలో పలుచోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ముందూ వెనుకా చూసుకోకుండా మంచినీళ్ల ప్రాయంలా నీరు-చెట్టు నిధులను ఖర్చు చేస్తున్నవారిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. అనుమతులు ఇవ్వలేదు ఉపాధి హామీ పథకం కింద చెరువుకట్ట పనులు చేసేందుకు ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతులు ఇవ్వలేదు. ప్రస్తుతం నీరు-చెట్టు పనులను నిబంధనల మేర చేపట్టేలా చర్యలు చేపడుతున్నాం. - ఇరిగేషన్ ఏఈ సుబ్బారావు.