
లక్కవరపుకోట (ఎస్‌కోట): మండల పరిషత్ ఎన్నికల సమయంలో నిర్ణయించుకున్న ప్రకారం జెంటిల్మన్ ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి (టీడీపీ) ఇంటిముందు ఆందోళనకు దిగారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోటలో శుక్రవారం జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2014 ఏప్రిల్‌లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో టీడీపీ ఆధిక్యం సాధించగా ఎంపీపీ పదవికి ఇద్దరు పోటీపడ్డారు. అందులో రెడ్డి వెంకన్నకు ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శోభా హైమావతి, జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి అండదండలున్నాయి. మరో వ్యక్తి మండల పార్టీ అధ్యక్షుడు ఆర్.చంద్రశేఖర్‌కు ఎమ్మెల్యే లలితకుమారి అండ ఉంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరిద్దరూ మండలంలో కీలక నేతలే. అప్పట్లో సమస్య పరిష్కరించేందుకు జంటిల్మన్ ఒప్పందాన్ని తెరపైకి తీసుకువచ్చి చెరో రెండున్నరేళ్లపాటు పదవిలో ఉండాలని, మొదట అవకాశం రెడ్డి వెంకన్నకే ఇస్తూ తీర్మానించారు. 2017 జనవరి 5వ తేదీతో ఆయన గడువు ముగియగా చంద్రశేఖర్ పదవి తనకివ్వాలంటూ పట్టుబడుతూ వచ్చారు.
దీనిపై ఇప్పటికే మంత్రుల సమక్షంలో మూడు సార్లు పంచాయతీ నిర్వహించారు. పదవిని వదులుకునేందుకు సిద్ధంగా లేనని రెడ్డి వెంకన్న తెగేసి చెప్పారు. అయితే అయనపై చర్యలు తీసుకునే సాహసం చేయని నేతలు వివాదాన్ని పరిష్కరించలేకపోయారు. దీనికి నిరసనగా చంద్రశేఖర్ తన అనుయాయులతో కొంతకాలంగా మండల సమావేశాలకు సైతం గైర్హాజరవుతున్నారు. మరోసారి గైర్హాజరైతే చట్టరీత్యా పదవులు కోల్పోవాల్సి వస్తుందని అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్న చంద్రశేఖర్ 4వందల మంది మద్దతుదారులతో శుక్రవారం ఎమ్మెల్యే లలితకుమారి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి వారిని శాంతపరచి పంపించేశారు. కాగా వీరి ఆందోళనకు ముందే ఎంపీపీ రెడ్డి వెంకన్న ఎమ్మెల్యే లలితకుమారిని కలసి తాను పదవిని వీడేది లేదనీ, అవసరమైతే తనను పార్టీనుంచి సస్పెండ్ చేయమని కూడా సవాల్ విసిరారని తెలిసింది.