సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన తుమ్మికాపల్లి గ్రామస్తులు
కొత్తవలస రూరల్ : విద్యుత్ సబ్ స్టేషన్‌లో పనిచేసే షిప్టు ఆపరేటర్ల పోస్టులను ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అమ్మేశారని కొత్తవలస మండలం తుమ్మికాపల్లి గ్రామస్తులు ఆరోపించారు. దీనికి నిరసనగా తుమ్మికాపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆదివారం ముట్టడించారు. గ్రామంలోని అర్హులైన యువతతో పోస్టులు భర్తీ చేయాలంటూ డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు ఏ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయడం లేదని, అందిన కాడికి దోచుకుంటున్నారని, నమ్మిన వారిని నిలువునా ముంచేస్తున్నారంటూ వాపోయారు.
వివరాల్లోకి వెళ్తే... కొత్తవలస మండలం తుమ్మికాపల్లి గ్రామంలో సర్వే నంబర్ 72/4లో సుమారు రూ.2 కోట్లు విలువ చేసే 70 సెంట్ల భూమిలో గతేడాది 33/11 కేవీ ఏపీఈపీడీసీఎల్ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించారు. భూమిని ఇస్తే అర్హులైన నిరుద్యోగులకు సబ్ స్టేషన్‌లో షిఫ్టు ఆపరేటర్ల పోస్టులు ఇప్పిస్తామని తుమ్మికాపల్లి సర్పంచ్ భర్త పిల్లా అప్పలరాజు నమ్మబలికారు.
గ్రామపెద్దలు తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో భూమి ఇచ్చారు. అక్కడే సీన్ రివర్స్ అయింది. అప్పలరాజు ఆధ్వర్యంలో గ్రామంలో యువతకి ఉద్యోగాలిస్తామని ఒప్పందం కుదుర్చుకున్న విద్యుత్ అధికారులు సబ్‌స్టేషన్ పనులు పూర్తయిన తరువాత ఎమ్మెల్యే సిపార్సుల మేరకు గ్రామంలో ఒక్కరికి మాత్రమే ఉద్యోగం ఇచ్చి మిగిలిన మూడు పోస్టులను టీడీపీ అనుయాయులతో భర్తీ చేశారని మాజీ సర్పంచి విరోతి కొండలరావుతో పాటు ఉద్యోగం వస్తుందని ఎదురుచూస్తున్న ఎస్.మహేశ్, బి.రవి, ఎ. నాగరాజు తదితరులు ఆరోపించారు.
తమకు రావాల్సిన ఉద్యోగాలు వెరొకరికి ఎలా ఇచ్చారని విద్యుత్ శాఖ అధికారులకు, కలెక్టర్ గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. ఎమ్మెల్యే సిఫార్సుల మేరకు పోస్టులు భర్తీ చేశామని, తామేమీ చేయలేమం టూ విద్యుత్ శాఖ అధికారులు చెప్పారన్నారు.
దీనిని నిరసనగా విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడిం చామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు తగిన బుద్ధిచెబుతామంటూ హెచ్చరించారు. తుమ్మికాపల్లి గ్రామస్తుల న్యాయ పోరాటానికి ఎస్. కోట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అల్లు జోగినాయుడు మద్దతుగా నిలిచారు.
ఇంత మోసం చేస్తారను కోలేదు...
పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామంటే ప్రస్తుత సర్పంచి భర్త పిల్లా అప్పలరాజుతో కలిసి మేమే గ్రామస్తులను ఒప్పించి భూమి ఇప్పించాం. తీరా నిర్మాణం పూర్తయిన తరువాత ఉద్యోగాలు టీడీపీ కార్యకర్తలకు చెందిన వారికి ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సిఫార్సులు చేయడం దారుణం. దీనిపై అప్పలరాజుని ప్రశ్నిస్తే... తన మాట కూడా వినకుండా ఉద్యోగాలకు సిఫార్సు చేశారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధిచెబుతాం. – వి.కొండలరావు, మాజీ సర్పంచ్
Comments
Please login to add a commentAdd a comment