శ్రీనివాసరావు మృతదేహం, సాయికుమార్ మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువు, శ్రీనివాసరావు (ఫైల్), సాయికుమార్ (ఫైల్)
మక్కువ : మరికొద్ది గంటల్లో పాఠశాలలో ఉండాల్సిన కొడుకు కళ్ల ముందే విద్యుదాఘాతంతో గిలగిలా కొట్టుకుంటుంటే ఆ తండ్రి తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి కాపాడడానికి ప్రయత్నించాడు. కాని విధి ఆడిన వింత నాటకంలో ఆ తండ్రి ప్రయత్నం ఫలించలేదు. కుమారుడిని రక్షించబోయి తాను కూడా మృత్యుకౌగిలికి చిక్కిపోయాడు. ఐదేళ్ల కిందట బతుకుదెరువుకు భార్య, కుమార్తెతో కలసి హైదరాబాద్ వెళ్లిపోయిన ఆ బడుగుజీవి, కుమారుడ్ని పైతరగతిలో జాయిన్ చేసేందుకు స్వగ్రామానికి వచ్చి కొడుకుతో సహా పరలోకాలకు వెళ్లిపోయాడు.
ఈ హృదయ విషాదకర సంఘటన మండలంలోని కాశీపట్నం పంచాయతీ పాపయ్యవలసలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాపయ్యవలసకు చెందిన యామాలపల్లి శ్రీనివాసరావు (38) భార్య కృష్ణవేణి, కుమార్తె అమృతతో కలిసి బతుకుదెరువు కోసం ఐదేళ్ల కిందట హైదరాబాద్ వెళ్లిపోయాడు. అక్కడ ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. తన కుమారుడు సాయికుమార్‌ను (12)మాత్రం బొబ్బిలిలోని అభ్యుదయ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివిస్తున్నాడు. సాయికుమార్ వేసవి సెలవులకు ఇటీవల హైదరాబాద్ వెళ్లి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపాడు.
ఎనిమిదో తరగతిలో చేరేందుకు..
సాయికుమార్ ఎనిమిదో తరగతిలో చేరాల్సి ఉండడంతో ఆ పనులు చక్కబెట్టేందుకు తండ్రి శ్రీనివాసరావుతో కలసి ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కుమారుడ్ని అభ్యుదయ పాఠశాలలో జాయిన్ చేసి, పార్వతీపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని చూసి తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు శ్రీనివాసరావు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. సాయికుమార్ ఇంటి ఆవరణలో ఉన్న బావి వద్ద స్నానం చేస్తుండగా, బావికి అమర్చిఉన్న మోటార్‌ను ప్రమాదవశాత్తూ తగిలాడు. దీంతో విద్యుత్ షాక్‌కు గురైన చిన్నారి పెద్దగా కేకలు వేయడంతో తండ్రి శ్రీనివాసరావు వెంటనే వచ్చి సాయికుమార్‌ను తప్పించడానికి ప్రయత్నిస్తూ తాను కూడా షాక్‌కు గురై కుప్పకూలిపోయాడు. పక్కనే ఆటలాడుతున్న యువకులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మోటార్‌ను ఆఫ్ చేసి విషయాన్ని చుట్టుపక్కల వాళ్లకు తెలియజేశారు. వెంటనే సమీపంలో ఉన్న వారు వచ్చి కుప్పకూలిపోయిన తండ్రీ,కుమారులను మక్కువ పీహెచ్‌సీకి తరలించారు. అయితే అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు వైద్యాధికారి వాణీవిశ్వనాథ్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. ఎస్సై కె. కృష్ణప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాతను బస్టాండ్‌కు సాగనంపి...
చిన్నారి సాయికుమార్ తాత జగన్నాథం బుర్రకథ కళాకారుడు. మండలంలోని ఎ.వెంకంపేటలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్నాథంను శుక్రవారం ఉదయం సాయికుమారే బస్టాండ్‌కు దిగబెట్టి ఇంటికి చేరుకున్నాడు. ఇంతలో మనవడు, కుమారుడు మృతి చెందాడన్న వార్త తెలుసుకుని జగన్నాథం బస్టాండ్ ఆవరణలోనే సొమ్మసిల్లిపోయాడు. ఒకేసారి తండ్రీ, కుమారుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామస్తులు అధిక సంఖ్యలో పీహెచ్‌సీకి చేరుకుని మృతదేహాలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment