విజయనగరం మునిసిపాలిటీ : ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన బదిలీలను నిలిపివేయాలని ఏపీఈఈయూ-1104 ప్రాంతీయ కార్యదర్శి డీఆర్‌ఎస్ వరప్రసాద్ డిమాండ్ చేశారు.
విజయనగరం మునిసిపాలిటీ : ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన బదిలీలను నిలిపివేయాలని ఏపీఈఈయూ-1104 ప్రాంతీయ కార్యదర్శి డీఆర్‌ఎస్ వరప్రసాద్ డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో దాసన్నపేటలోని విద్యుత్ భవనం ఆవరణలో రిలే దీక్షలు నిర్వహించారు. దీక్షల్లో యూనియన్ తరపున డి.శ్రీనివాస్‌కుమార్, కె.అనిల్‌కుమార్, కె.గణేశ్వరరావు, పి.రాంబాబు, వై.సంతోష్‌కుమార్ పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో రెండో రోజు గురువారం యూనియన్ తరపున ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి వరప్రసాద్ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది బదిలీల ప్రక్రియను ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారన్నారు. ప్రత్యేక కమిటీ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని బదిలీలు చేసినట్లు ఆరోపించారు. ఈ విషయంలో కొందరు రాజకీయ ప్రతినిధులు, యూనియన్ నాయకులకు అనుగుణంగా నడుచుకున్నారంటూ విమర్శించారు.
ఈ విషయంలో సంస్థతో పాటు సర్కిల్ పరిధిలో అధికారులు స్పందించకపోతే నిరసనను దశల వారీ ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజుల పాటు రిలే దీక్షలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీఈఈయూ-1104 ప్రాంతీయ అధ్యక్షుడు సిహెచ్.తిరుపతిరావు, డి.రాజేంద్రప్రసాద్, ఎస్.గోవింద్, వీజీబీ కృష్ణారావు, టీఎస్‌ఎన్ రాజు, వీఎస్ కృష్ణయ్య, ఆర్.బంగారప్పడు తదితరులు పాల్గొన్నారు.