పైరవీలదే పవర్
Published Wed, Aug 9 2017 11:54 PM | Last Updated on Mon, Sep 11 2017 11:41 PM
–విద్యుత్ శాఖలో నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు
– ప్రక్రియ ముగిసిన తర్వాత మార్పులు, చేర్పులు
– పదుల సంఖ్యలో ఈపీడీసీఎల్ మోడిఫికేషన్ ఉత్తర్వులు
– తాజాగా రాజమహేంద్రవరం సర్కిల్‌లో ముగ్గురు డీఈల బదిలీ
సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీ ఈపీడీసీఎల్) బదిలీల్లో పైరవీలు చేసిన వారిదే పై చేయి అయింది. మునుపెన్నడూ లేని విధంగా బదిలీల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. సీనియారిటీ పరిగణనలో ట్రాన్స్‌కో మార్గదర్శకాలకు విరుద్ధంగా జూన్ 25న బదిలీలు చేసిన ఈపీడీసీఎల్ తర్వాత కూడా పదుల సంఖ్యలో మార్పులు చేర్పులు చేసింది. కొందరు అధికారులు ఆపరేషన్ విభాగాల్లో పోస్టుల కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేయడంతో మూడేళ్ల కాలపరిమితి ముగియకపోయినా ఆ స్థానంలో ఉన్న అధికారిని బదిలీ చేస్తూ పైరవీలు చేసుకున్న అధికారికి మోడిఫికేషన్ ద్వారా ఆ పోస్టును కట్టపెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు, మోడిఫికేషన్ల వ్యవహారం ఇప్పటికీ సాగుతూనే ఉంది. తమకు జరిగిన అన్యాయంపై కొందరు అధికారులు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు చేయడంతో వారికి న్యాయం చేసేందుకు తాజాగా కొత్తవారిని బలిచేశారు. శనివారం రాజమహేంద్రవరం సర్కిల్‌లో మరో మగ్గురు డీఈలను బదిలీ చేస్తూ ఈపీడీసీఎల్ నిర్ణయం తీసుకుంది. కాకినాడ ఆపరేషన్స్ డీఈగా పని చేస్తున్న పి.సాల్మన్‌రాజును అమలాపురం ఆపరేషన్స్ డీఈగా పంపుతూ ఆ స్థానంలో ఉన్న ఎన్.రమేష్‌ను రాజమహేంద్రవరం ట్రాన్స్‌ఫార్మర్స్ డీఈగా బదిలీ చేసింది. అక్కడ పని చేస్తున్న డీఈ జి.ప్రసాద్‌ను కాకినాడ ఆపరేషన్స్ డీఈగా నియమించింది.
ఒకరికి ఏడాదిలోనే రెండు బదిలీలు
అప్పటి వరకూ ఆపరేషన్స్ విభాగంలో పని చేసిన కొందరు అధికారులు బదిలీల్లో అప్రధానమైన ట్రాన్స్‌ఫార్మర్స్, కన్‌స్ట్రక్షన్ తదితర విభాగాలకు వెళ్లారు. వీరిలో కొందరు తిరిగి ప్రధానమైన ఆపరేషన్స్ విభాగంలో పోస్టు కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేశారు. ఫలితంగానే ఈపీడీసీఎల్ బదిలీలు ముగిసిన తర్వాత పదుల సంఖ్యలో మార్పులు చేర్పులు (మోడిఫికేషన్స్) చేసింది. దీంతో అనేక మంది అధికారులకు అన్యాయం జరిగింది. తాజాగా జరిగిన బదిలీల్లో కాకినాడ డివిజన్ ఆపరేషన్స్ నుంచి అమలాపురం ఆపరేషన్స్‌కు వచ్చిన పి.సాల్మన్‌రాజు జూన్ 25న జరిగిన బదిలీల్లో రాజమహేంద్రవరం ట్రాన్స్‌ఫార్మర్స్ డీఈగా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆపరేషన్స్ నుంచి వచ్చారు. అయితే నాలుగు రోజులకే సాల్మన్‌రాజును కాకినాడ ఆపరేషన్స్ డీఈగా పంపుతూ బదిలీలో మోడిఫికేషన్ చేశారు. అక్కడ రెండేళ్లుగా పని చేస్తున్న జి.ప్రసాద్‌ను సాల్మన్‌రాజు స్థానంలోకి పంపారు. ఒక పోస్టులో మూడేళ్లు, ఒక స్టేషన్‌లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారే బదిలీకి అర్హులు. అయితే కేవలం రెండేళ్ల సీనియారిటీ ఉన్న ప్రసాద్‌ను సాల్మన్‌రాజు కోసం మోడిఫికేన్ ద్వారా బదిలీ చేశారు. మళ్లీ ఇప్పుడు ప్రసాద్‌ను కాకినాడకు పంపేందుకు అమలాపురం ఆపరేషన్స్ డీఈగా ఉన్న రమేష్‌ను బలి చేశారు. కాకినాడ డివిజన్ ఆపరేషన్స్ డీఈగా ఉన్న సాల్మన్ రాజును అమలాపురం డీఈగా పంపి అక్కడ ఏడాది నుంచి పని చేస్తున్న ఎన్.రమేష్‌ను రాజమహేంద్రవరం ట్రాన్స్‌ఫార్మర్స్ డీఈగా బదిలీ చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి ఏడాది క్రితం అమలాపురం వచ్చిన రమేష్‌ను ఇంతలోనే తిరిగి బదిలీ చేశారు. కాగా, జూన్‌లో జరిగిన బదిలీల్లో ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్‌లు సీనియారిటీ నిర్ధారణలో భిన్నంగా వ్యవహరించాయి. ఎస్పీడీసీఎల్ ఒక లిస్టు తయారు చేయగా, ఈపీడీసీఎల్ మూడు లిస్టులు తయారు చేసి చివరకు జూనియర్లను బదిలీ చేయడంతో ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాలు మిన్నకుండిపోయాయి.
Advertisement
Advertisement