ప్రైవేటు విద్యుత్ వదులుకోవచ్చు
► వీలు కాదంటూ ప్రభుత్వాన్ని, మంత్రిని తప్పుదారి పట్టించిన అధికారులు
► వదులుకుంటే మళ్లీ తీసుకోవడం కుదరదన్న మంత్రి
►కానీ కొనుగోళ్లకు రోజువారీగానే షెడ్యూలింగ్
► కావాల్సిన విద్యుత్ ఎంతో ముందు రోజు తెలిపితే చాలు
► ఎలాంటి పెనాల్టీ లేకుండా 15 శాతం వదులుకోవచ్చు
► మిగిలిన 85శాతంలోనూ వదులుకున్న మొత్తంపైనే 20 శాతం పెనాల్టీ
►ఈ జరిమానా కూడా ఏడాది సగటున 85 శాతానికి తగ్గితేనే..
► తర్వాతిరోజు కోరితే ఒప్పందం మేరకు మొత్తం కరెంటు ఇవ్వాల్సిందే
ఓ ప్రైవేటు సంస్థ పీపీఏల పరిశీలనలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: అవసరం లేని సమయంలో ప్రైవేటు విద్యుత్‌ను వదిలేసుకోవచ్చు. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు, ప్రైవేటు కంపెనీల మధ్య కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లోని (పీపీఏల్లోని) నిబంధనలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఓ ప్రైవేటు కంపెనీతో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) కుదుర్చుకున్న స్వల్పకాలిక పీపీఏను పరిశీలించగా ఈ అంశాలు వెల్లడయ్యాయి. అందులోని నిబంధనలు సైతం విద్యుత్‌ను వదులుకోవచ్చన్న విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ తగ్గడంతో ‘ప్రైవేటు’ కొనుగోళ్లను కొనసాగించడానికి వీలుగా తరచూ జెన్‌కో విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గించి బ్యాక్‌డౌన్ చేస్తున్నారు.
దీంతో జెన్‌కో ఉత్పత్తి సామర్థ్యం గతంలో ఎన్నడూ లేనివిధంగా 73.21 శాతానికి పతనమైంది. దీనివల్ల జెన్‌కో రూ.800 కోట్ల ఆదాయాన్ని నష్టపోగా.. ప్రైవేటు విద్యుత్ కారణంగా ప్రజలపై రూ.600 కోట్ల అనవసర భారం పడింది. ఈ అంశాన్ని వెలుగులోకి తెస్తూ.. ప్రైవేటు కరెంటుపై అంత ప్రేమెందుకు.. అయ్యో పాపం జెన్‌కో శీర్షికన సాక్షి మంగళవారం ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి... 15 శాతానికి మించి ప్రైవేటు విద్యుత్‌ను వదులుకోలేమని, అంతకు మించాల్సి వస్తే జెన్‌కో విద్యుత్‌నే వదులుకోక తప్పదని వివరణ ఇచ్చారు. ఓ రోజు డిమాండ్ తగ్గిందని ప్రైవేటు విద్యుత్‌ను వదులుకుంటే మరుసటి రోజు తీసుకోవడం వీలుకాదని సైతం పేర్కొన్నారు. కానీ ఇవన్నీ సత్యదూరమని పీపీఏల్లో ఉండే పెనాల్టీ క్లాజ్ నిబంధనలు చెబుతున్నాయి. దీనిని బట్టి ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ల విషయంలో తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కంల ఉన్నతాధికారులు మంత్రిని కూడా తప్పుదోవ పట్టించారని స్పష్టమవుతోంది.
ఒక రోజు ముందు కూడా వదులుకోవచ్చు
తర్వాతి రోజు ఎంత విద్యుత్ అవసరమో ఒక రోజు ముందే బెంగళూరులోని దక్షిణ ప్రాంత లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్సారెల్డీసీ)కు డిస్కంలు తెలియజేస్తాయి. దీనినే షెడ్యూలింగ్ అంటారు. అవసరమైనప్పుడు పూర్తిస్థాయిలో తీసుకోవడం, అవసరం లేని రోజు వదులుకోవడానికి షెడ్యూలింగ్ చేస్తుంటారు. ఒప్పందం ప్రకారం పెనాల్టీ లేకుండా 15 శాతం ప్రైవేటు విద్యుత్‌ను వదులుకోవచ్చు. వినియోగం తగ్గినప్పుడు ఓ రోజు ముందే నోటీసిచ్చి అంతకు మించి కూడా విద్యుత్‌ను వదులుకోవచ్చు. 15శాతానికి మించి అదనంగా వదులుకున్న విద్యుత్ ధరలో 20శాతాన్ని పెనాల్టీగా చెల్లిస్తే సరిపోతుంది.
అసలు రోజువారీగా తగ్గించుకున్నా వార్షిక సగటు 85 శాతానికి తగ్గితేనే 20 శాతం పెనాల్టీ వర్తిస్తుంది. ఇలా ఓ రోజు తగ్గించుకున్నా మరుసటి రోజు అవసరమైన మొత్తం విద్యుత్‌ను ప్రైవేటు కంపెనీ సరఫరా చేయాల్సిందే. ఒకవేళ విద్యుత్ సరఫరాకు నిరాకరించి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే... ప్రైవేటు కంపెనీల నుంచే యూనిట్‌కు ఏకంగా రూ.10 చొప్పున డిస్కంలు నష్టపరిహారాన్ని రాబట్టవచ్చు. ఇక అత్యవసరంగా సైతం విద్యుత్‌ను వదులుకునే అవకాశం కూడా ఉంది. ముందస్తు నోటీసులో పేర్కొన్న దానికన్నా అధికంగా వదులుకున్న విద్యుత్‌లో 10 శాతం విద్యుత్ ధరను పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది.