‘తూర్పు’లో మూలాలు ... ‘పశ్చిమ’లో సోదాలు
‘తూర్పు’లో మూలాలు ... ‘పశ్చిమ’లో సోదాలు
Published Mon, Jun 5 2017 11:17 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
- పెద్దాపురం ఈవోపై ఏసీబీ కొరడా
- అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు
- రూ. కోటికి పైనే అక్రమాస్తులు
- ఏసీబీ చేతిలో మరో అరడజన్ మంది చిట్టా
- ‘సాక్షి’ వరుస కథనాలతో కొరడా ఝుళిపించి ఏసీబీ
సాక్షి ప్రతినిధి, కాకినాడ : దేవాదాయశాఖలోని అవినీతి తిమింగలాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గుడినే కాకుండా గుడిలో లింగాన్ని సైతం మింగేసే ప్రబుద్ధుల నిర్వాకాలతో ఆ శాఖపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. అర్హత లేకున్నా అందలాలు ఎక్కించడం మొదలుకుని ఒకే చోట ఏళ్ల తరబడి తిష్టవేయడం వరకు దేవాదాయశాఖలో అడ్డగోలు వ్యవహారాలకు అంతే లేకుండాపోయింది. ఈ బాగోతాలపై ‘సాక్షి’ ఇటీవల కాలంలో వరుస కథనాలను ప్రచురిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ శాఖలోని పలువురు అవినీతి అధికారులపై నిఘా పెట్టిన ఏసీబీ తొలి పంజా సోమవారం పెద్దాపురం మహారాణి సత్రం ఈఓ చీమలకొండ సాయిబాబుపై విసిరింది.ఆస్తులు గుర్తించింది పశ్చిమ గోదావరి జిల్లాలో అయినా దాని మూలాలు మాత్రం పెద్దాపురం సత్రంలోనే ఉండటం గమనార్హం. రెండేళ్లుగా ఇక్కడ ఈఓగా పనిచేస్తున్న సాయిబాబు ఆధ్వర్యంలో సత్రంలో పేదలకు అన్నదానం జరుగుతుంటుంది. అన్నదానం చేయకుండానే చేసినట్టుగా రికార్డులు సృష్టించి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి అక్రమ ఆస్తులు సంపాదించినట్టు ఏసీబీ నిర్థారణకు రావడం, ఏకకాలంలో ఉభయ గోదావరి జిల్లాల్లో దాడులు జరపడంతో దేవాదాయ శాఖలో గుబులు రేపుతోంది.
ఏసీబీ జాబితాలో మరింతమంది...
ప్రస్తుతం ఏసీబీ వలకు చీమలకొండే చిక్కినా జిల్లాలో మరికొన్ని దేవాలయాల కార్యనిర్వాహణాధికారుల జాతకాలు కూడా ఏసీబీ సేకరించిందని సంబంధిత వర్గాల సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలు, కొందరు అధికారుల అండదండలు దండిగా ఉండటంతో అర్హత లేకున్నా ఇన్‌చార్జీలుగా కొనసాగుతున్న వారి చిట్టా సిద్ధంగా ఉందంటున్నారు. ఇందులో అసిస్టెంట్ కమిషనర్లు,, గ్రేడ్–1, గ్రేడ్ –2 ఇఒలు అరడజన్ మంది వరకు ఉన్నారని చెబుతున్నారు. తొలి తిమింగలం పెద్దాపురం మహారాణి సత్రం ఈఓ సాయిబాబుతోనే మొదలైందని మిగిలిన వారి భరతం కూడా త్వరలో పట్టడం ఖాయమంటున్నారు.
సాయిబాబు అక్రమాస్తుల చిట్టా...
సాయిబాబు ఆస్తులను నిగ్గుతేల్చేందుకు ఏసీబీ పెద్దాపురం, తణుకు బ్యాంకు కాలనీలో సొంత ఇల్లు, మరో రెండు ఇళ్లతోపాటు మూడు ఇళ్లస్థలాలు, ప్లాటు, పెద్దాపురం కార్యాలయం, భీమవరంలో బావమరిది ఇంటితోపాటు స్వగ్రామం రేలంగిలో ఇల్లు, తణుకులో స్నేహితుడి ఇళ్లలో ఈ సోదాలు నిర్వహించడంతో ఆ శాఖల అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. కోనాల గ్రామంలోని వేణుగోపాల స్వామి దేవాలయానికి చెందిన 35 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, పాస్‌పుస్తకాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ లెక్కేస్తే అతని ఆస్తుల విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులకు చెందిన 14 బ్యాంకు ఖాతాలకు చెందిన పాసు పుస్తకాలు, బ్యాంకు లాకర్లకు చెందిన పత్రాలను సీజ్ చేయగం గమనార్హం.
Advertisement
Advertisement