హెలికాప్టర్ ‘టూర్’
- పర్యాటక శాఖ కసరత్తు
- అధికారులతో మంత్రి సమీక్ష
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల్ని గంటల వ్యవధిలో చేరుకునే విధంగా, గాల్లో చక్కర్లు కొడుతూ వీక్షించే రీతిలో హెలికాప్ట్టర్ సేవలకు శ్రీకారం చుట్టేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఇందు కోసం పర్యాటక శాఖ మంత్రి ఎస్పీ షణ్ముగనాథన్ అధికారులతో సమీక్షించ జరిపి ఉన్నారు. రాష్ట్రం ఆధ్యాత్మికతకు, చారిత్రాత్మక కట్టడాలకు, పర్యాటక కేంద్రాలకు ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రతి నగరం పర్యాటకంగా ప్రసిద్ధి చెంది ఉన్నది. పశ్చిమ పర్వత శ్రేణుల్ని తనలో ఇముడ్చుకుని ఆహ్లాదకర వాతావరణంలో నిండి ఉండే నీలగిరులు, మంచు దుప్పటిలో మునిగి ఉండే కొడెకైనాల్, ఉదయాన్నే సూర్యుడ్ని ఆహ్వానించే కన్యాకుమారి... ఇలా చెప్పుకుంటూ పోతే, ఎన్నో మరెన్నో పర్యాటక ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి.
దేశ విదేశాల నుంచి పర్యాటకుల రాక ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నది. దీనిని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర పర్యాటక శాఖ తన సేవల్ని విస్తృత పరిచేందుకు కసరత్తుల్లో మునిగి ఉన్నది. పర్యాటక ప్రాంతాలకు తరలి వెళ్లాలంటే, ఇక్కడ రైలు, రోడ్డు మార్గాలు మాత్రమే ఉన్నాయి. పదమూడు జిల్లాల్లో సముద్రం విస్తరించి ఉన్నా, ప్రయాణం కష్టమే. దీన్ని గుర్తెరిగి సరికొత్తగా విదేశాల్లో తరహా హెలికాఫ్టర్ సేవల్ని ఇక్కడ అమలు చేయించేందుకు పర్యాటక కసరత్తులు మొదలెట్టింది.
హెలికాప్టర్ సేవ: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు ఆకాశమార్గంలో, పర్యాటక అందాలన్ని గాల్లో చక్కర్లు కొడుతూ తిలకించే రీతిలో హెలికాప్టర్ సేవలకు కసరత్తులు మొదలెట్టారు. సచివాలయంలో పర్యాటక శాఖ మంత్రి షన్ముగనాథన్, కార్యదర్శి కన్నన్‌ల నేతృత్వంలో ఇందుకు తగ్గ సమీక్ష జరిగి ఉన్నది. పర్యాటక ప్యాకేజీ టూర్ల తరహాలో హెలికాఫ్టర్ సేవలు చేపట్టే విధంగా నిర్ణయం తీసుకుని ఉన్నారు. మదురై, రామేశ్వరం, కన్యాకుమారి, కొడెకైనాల్, మహాబలిపురం, పాండిచ్చేరిలను ఈ ప్యాకేజిలోకి చేర్చి ఉన్నారు. తొలి విడతగా మదురై - రామేశ్వరం మధ్య, కన్యాకుమారి - మదురై మధ్య హెలికాప్టర్ పర్యాటక సేవలు చేపట్టే రీతిలో ఈ సమీక్షలు నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
కేంద్ర పర్యాటక శాఖ అనుమతిని పొందడంతో పాటుగా హెలికాప్టర్ సేవలకు సంబంధించిన అన్ని రకాల వ్యవహారాలను, ప్యాకేజీలో చేర్చిన పర్యాటక ప్రాంతాల్లో హెలికాప్ట్టర్ సేవలకు అనుకూలతను ఆరా తీయడం తదితర అంశాలను పరిశీలించి నివేదికను సిద్ధం చేయడానికి ఈ సమావేశం ద్వారా పర్యాటక అధికారులకు ఆదేశాలు వెలువడి ఉండడం గమనార్హం. ప్రధానంగా పవన్ హన్స్ హెలికాప్టర్స్ లిమిటెడ్ వర్గాలతో సంప్రదింపులకు సిద్ధం అయ్యారు. అలాగే, కొడెకైనాల్‌లో హెలికాప్ట్టర్ సేవల నిమిత్తం నాలుగు ఎకరాల స్థలాన్ని సిద్ధం చేయడానికి అనుమతులు ఇచ్చినట్టుగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.