ఎంత కాదనుకున్నా... జిల్లా పాలనలో వారి ప్రమేయం ఉండనే ఉంటుంది. సిఫార్సులు ఉండకూడదని ఎంతగా మొత్తుకున్నా... వారి హస్తం తప్పనిసరిగా ఉంటోంది. జిల్లాలో ఇటీవల రెవెన్యూలో జరిగిన బదిలీలన్నీ నేతల సిఫార్సుల మేరకే జరిగాయన్నది ఆ శాఖలోని సిబ్బందే బహిరంగంగా చెబుతున్నారు. తమకు అనుకూలమైనవారిని నచ్చిన చోట నియమించడం... నచ్చనివారిని సుదూరంగా తరలించేయడం... తాజా విశేషం. ఈ బదిలీలు కొందరికి మోదం... మరికొందరికి ఖేదం మిగిల్చాయి.
విజయనగరం గంటస్తంభం: అంతా అనుకున్నట్టే రెవెన్యూశాఖలో బదిలీలు పూర్తిగా రాజకీయ సిఫార్సులతోనే సాగాయి. రెవెన్యూశాఖలో 14మంది తహసీల్దార్లు, 14మంది డిప్యూటీ తహసీల్దార్లు, 27మంది సీనియర్ సహాయకులు, ఐదుగురు జూనియర్ సహాయకులు,36మంది గ్రామ రెవెన్యూ అధికారులను బదిలీ చేస్తూ కలెక్టర్ వివేక్‌యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 67మంది వీఆర్వోలు మినహా మిగతావారందరికీ మంగళవారం బదిలీ చేశారు. ఒకేసారి ఇంతమందికి బదిలీ చేయడం ఒక చర్చనీయాంశమైతే బదిలీలన్నీ పూర్తిగా రాజకీయ కోణంలోనే జరిగాయన్నది మరో విశేషం.
పాలనలో సౌలభ్యం పేరుతో...
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ నెల 24వ తేదీతోనే బదిలీలపై గడువు ముగిసింది. ఐదేళ్లు దాటిన వారితోపాటు మూడేళ్లు దాటిన వారినీ అప్పుడే బదిలీ చేయాలి. కానీ నిర్దేశిత గడువులోగా ఐదేళ్లు దాటిన వారిని బదిలీ చేసిన అధికారులు ఉన్నట్టుండి మంగళవారం వారూవీరూ అని తేడా లేకుండా బదిలీలు చేసేశారు. నిబంధనల ప్రకారం రిక్వెస్టు చేసుకున్న బదిలీలు ఐదుశాతానికి మించి చేయరాదు. కానీ ఒక్కో కేడరులో 20 నుంచి 30శాతం చేసేసి... దానికి పరిపాలనా సౌలభ్యం అనే ముద్దుపేరు పెట్టారు. వాస్తవానికి పరిపాలనాపరంగా ఇబ్బందులుంటే ఎప్పటికప్పుడు చేయాలి తప్ప అందరినీ ఒకేసారి చేయడమేమిటని పలువురు రెవెన్యూ ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు.
అంతా రాజకీయ సిఫార్సులతోనే...
అధికారులు పరిపాలనా సౌలభ్యమని చెబుతున్నా బదిలీలన్నీ రాజకీయ కోణంలోనే జరిగాయన్నది నిర్వివాదాంశం. నేతలు సిఫార్సు ఇచ్చిన వారందరికీ బదిలీ చేశారన్న చర్చ ప్రస్తుతం ఆ శాఖలో నడుస్తోంది. తహసీల్దార్లు మొదలుకుని వీఆర్వోల వరకు తమకు నచ్చిన వారిని వేయాలని దాదాపు అందరు అధికారపార్టీ ఎమ్మెల్యేలు లేఖలు ఇచ్చారు. విశేషమేమిటంటే ప్రజాప్రతినిదులు కాకపోయినా తెలుగుదేశంపార్టీ నాయకులు ఇచ్చిన సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకుని బదిలీ చేశారని ఉద్యోగులే చెబుతున్నారు. కౌన్సెలింగ్ సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖల స్థానాలను రిజర్వు చేసి ఇప్పుడు రిక్వెస్టు బదిలీల్లో వారు కోరిన వారిని వేయడం విశేషం. ఈ నేపథ్యంలో తీవ్ర విమర్శలు రేగుతున్నాయి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండదని చెప్పినా పూర్తిగా రాజకీయ కోణంలో బదిలీలు చేశారని వాపోతున్నారు. గత ప్రభుత్వాలు కంటే ఇప్పుడు పరిస్థితి అధ్వానంగా ఉందని ఆరోపిస్తున్నారు.
సిఫార్సు లేనివారికి అవస్థలు
రెవెన్యూశాఖలో రాజకీయ సిఫార్సులతోనే అధికారులు బదిలీలు చేయడంతో పలువురు ఉద్యోగులు నష్టపోయారు. సిఫార్సు లేఖలతో బదిలీలు చేయించుకున్న వారు మేలు పొందగా రాజకీయ అండదండలు లేనివారు, రాజకీయాల జోలికిపోకుండా ఉద్యోగం చేసుకున్న వారు బలిపశువులయ్యారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బదిలీల తీరును పలువురు ప్రశ్నిస్తున్నారు. అనేక అవినీతి ఆరోపణలు ఉన్న ఎస్.కోట తహసీల్దారు రాములమ్మ, గంట్యాడ తహసీల్దారు బాపిరాజును స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సుతో పక్క మండలాల్లోనే నియమించారు.
వారిని అదే నియోజకవర్గాల్లో కొనసాగించడం వెనుక రాజకీయ సిఫార్సులు పని చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్వతీపురం ఎమ్మెల్యే లేఖ ఇచ్చారని కలెక్టరేట్‌లో పని చేస్తున్న అప్పారావును బలిజిపేటలో నియమించారు. ఆయన నియామకాన్ని కాదనలేకపోయినా ఈ కారణంగా అక్కడ పని చేస్తున్న బి.వి.లక్ష్మికి ఏడాది గడవకముందే గిరిజన ప్రాంతమైన జియ్మమ్మవలసకు బదిలీ చేశారు. ఆరోపణలు లేకపోయినా, ఒక మహిళ అని చూడకుండా మారుమూలకు బదిలీ చేయడం రెవెన్యూ వర్గాలనే ఆశ్చర్యపరిచాయి.
పూసపాటిరేగ డీటీ శ్రీనివారావును అక్కడ నియమించి నాలుగు నెలలే కాగా ఎమ్మెల్యే జోక్యంతో ఆయన్ను బొండపల్లి హెచ్‌డీగా బదిలీ చేసి అక్కడకు నాలుగు నెలల క్రితమే వెళ్లిన భాస్కరరావును అత్యవసరంగా ఎన్నికల డీటీగా ఎస్.కోట బదిలీ చేశారు. కొందరు సీనియర్ సహాయకులను ఆర్‌ఐలుగా నియమించి రెండేళ్లు కాకుండా బదిలీ చేయడం, సీనియర్లు ఉన్నా జూనియర్లను ఆర్‌ఐలుగా నియమించడంపై విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. దీంతో రాజకీయ నాయకులు తమ సిఫార్సుల మేరకు నియామకాలు జరగడంతో సంతోషించినా బదిలీ చేసిన కలెక్టర్, జేసీ, ఇతర అధికారులు మాత్రం పాలనపరంగా అపవాదు మూటగట్టుకోవడం కోసమెరుపు.
అంతా వారు చెప్పినట్టే...
Published Wed, May 31 2017 6:23 AM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM
Advertisement
Advertisement