టీడీపీ నేతల బేరసారాలు...?
పదేళ్లుగా రాజకీయ నిరుద్యోగంతో అల్లాడిన తెలుగుదేశం నేతలు అన్నింటా తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. జిల్లాలో ఏ శాఖలో ఏ చిన్న ఉద్యోగమైనా... తాము చెప్పిన వారికే దక్కాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏ ఉద్యోగానికైనా కొంత రేటు ఫిక్స్ చేసేస్తున్నారు. సంబంధిత అభ్యర్థులతో బేరసారాలు కుదుర్చుకుంటున్నారు. మరోవైపు తమ వారికే ఏ ఉద్యోగమైనా... దక్కాలన్న ఆలోచనతో అధికారులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. తాజాగా ఏపీఈపీడీసీఎల్‌లో తాత్కాలిక ప్రాతి పదికన నియమించే షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులపై వీరి కన్ను పడింది. ఇంకేముంది!!
విజయనగరం మున్సిపాలిటీ: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో (ఏపీఈపీడీసీఎల్) తాత్కాలిక ప్రాతిపదికన నియమించే షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులపై టీడీపీ నేతల కన్ను పడింది. ఇందుకోసం సదరు అభ్యర్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో పోస్టుకు సుమారు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు డిమాండ్‌ను బట్టి బేరసారాలు సాగిస్తున్నట్లు సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇదే పోస్టుల భర్తీ విషయం లో అధికార పార్టీ నేతల సిఫార్సులకే అధికారులు పెద్ద పీట వేసినట్టు ఆరోపణలు వినిపించేవి. తాజాగా టీడీపీ నాయకులు ఇదే తరహాలో వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
వాస్తవానికైతే ఎలక్ట్రికల్ ట్రేడ్ విభాగంలో ఐటీఐ అర్హత ఉన్న వారిని విద్యు త్ ఉప కేంద్రాల్లో షిఫ్ట్ ఆపరేటర్లుగా నియమించాల్సి ఉంది. వాటిని జిల్లాలో విద్యుత్ ఉప కేంద్రాలను నిర్వహించే కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో నియమించుకుంటారు. వారే ఒక్కో కేంద్రానికి నలుగురు చొప్పున షిఫ్ట్ ఆపరేటర్లను ఎంపిక చేసుకుని సంబంధిత పత్రాలను ఈపీడీసీఎల్ అధికారులకు పంపాలి. అభ్యర్థుల అర్హత ధ్రువీకరణ పత్రాలు పరిశీలన చేసి సం తృప్తి చెందిన తరువాత షిఫ్ట్ ఆపరే టర్లను సంబంధిత డివిజనల్ ఇంజినీర్లు నియమిస్తారు. అయితే ఈ నియామకాల విషయంలో టీడీపీ ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో ఇటీవల జరిగిన 127 జూనియర్ లైన్‌మెన్ పోస్టుల నియూమకాల్లో 68 పోస్టులను ఇన్ సర్వీసు అభ్యర్థులు స్థానాలు దక్కించుకున్నారు. ఇందులో జిల్లాకు చెంది న అభ్యర్థులు సుమారు 40 మంది వరకు ఉన్నారు. మిగిలిన వారు పక్క జిల్లాలైన శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాకు చెందిన వారు. అయితే జిల్లాలో పోస్టు లు దక్కించుకున్న 40 మంది అభ్యర్థులు ఇటీవల వరకు వివిధ సబ్‌స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్లుగా పని చేసిన వారే. ప్రస్తుతం ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ పోస్టుల భర్తీ పై అధికార టీడీపీ నేతల కన్నుపడినట్లు ఆరోపణ లు వినిపిస్తున్నాయి. జిల్లాలోని నియోజకవర్గాల పరిధిలో ఏఏ సబ్‌స్టేషన్‌లలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో.. వాటిని ఆయా నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇచ్చిన జాబితా ప్రకారం నియమకాలు చేపట్టాలని హుకుం జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతిపక్ష పార్టీకి చెందిన అభ్యర్థులు ఎవరూ చె ప్పినా పట్టించుకోవద్దని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయమై డివిజన్ ఇంజినీర్ స్థాయి అధికారుల నుంచి జిల్లా ఉన్నతాధికారుల వర కు అందరికీ ఫోన్‌ల ద్వారా సదరు పార్టీ నాయకులు ప్రతిరోజు ఒత్తిళ్లు తెస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికైతే తాత్కాలిక పద్ధతిన నియమించే షిఫ్ట్ ఆపరేటర్ పోస్టును దక్కించుకుని కొద్ది సంవత్సరాల పాటు పని చేస్తే జూనియర్ లైన్‌మెన్ ఎంపికల్లో వారికి వెయిటేజీ ఇస్తారు. అందుకే ముందుస్తుగా ఈ పోస్టులను ఎవరైతే దక్కించుకుంటారో.. వారికి జేఎల్‌ఎం పోస్టుల తప్పనిసరిగా వస్తుందన్నది అభ్యర్థుల ఆశ. అయితే ఈ పోస్టుల భర్తీ అయ్యే సమయంలో ప్రతిసారీ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారెరిగిన అధికార పార్టీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖలో వివిధ విభాగాల్లో తాత్కాలిక ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న పలువురు ఐటీఐ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఎంవీ శేషగిరిబాబును కలిసి తమ గోడును వినిపించినట్టు సమాచారం.
మార్గదర్శకాలు జారీ కావాల్సి ఉంది...
షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టుల భర్తీకి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి మార్గదర్శకాలు రాలేదు. వారి మార్గదర్శకాలకు అనుగుణంగా నియూమకాలు చేపడతాం. ఈ విషయంలో అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిళ్లు వస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. - సి.శ్రీనివాసమూర్తి, ఎస్‌ఈ