‘యువగళం’ కార్యకర్తలకు విద్యుత్ బిల్లులు నమోదు చేసే పని
నామినేషన్ విధానంలో టీడీపీ నేతలకు కాంట్రాక్టులు!
ఉపాధి కోల్పోతామని 10వేల మంది స్పాట్ బిల్లింగ్ రీడర్ల ఆందోళన
విద్యుత్ మీటర్ రీడర్లకు కూటమి ప్రభుత్వం షాక్ ఇస్తోంది. టీడీపీ నేతలు, నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలకు ఉపాధి కల్పించేందుకు చాలా సంవత్సరాలుగా పని చేస్తున్న మీటర్ రీడర్లపై వేటు వేస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10వేల మంది మీటర్ రీడర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ కమీషన్‌లో కోత విధించిందని, ఇప్పుడు తమ ఉపాధికే ఎసరు పెట్టిందని మీటర్ రీడర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. –సాక్షి, అమరావతి
మొదట కమీషన్‌లో కోత...
రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల పరిధిలో అన్ని జిల్లాల్లో కలిపి దాదాపు 1.92 కోట్ల విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. వాటిలో 20 శాతం నుంచి 30 శాతం వరకు పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ సర్వీసులు ఉంటాయి. మిగతా 70 శాతం సర్వీసులకు ప్రతి నెలా విద్యుత్ బిల్లులను స్పాట్ బిల్లింగ్ రీడర్ల ద్వారా ఇస్తున్నారు. ఇందుకోసం డిస్కంలు కాంట్రాక్టు పద్ధతిలో మీటర్ రీడర్లను తీసుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది మీటర్ రీడర్లు పనిచేస్తున్నారు.
వీరికి గతంలో ఒక్కో బిల్లుకు (పీస్ రేట్) కమిషన్‌గా అర్బన్‌లో రూ.3.49, రూరల్‌లో రూ.3.89 చెల్లించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిని అర్బన్‌లో రూ.2.60, రూరల్‌లో రూ.2.89కి కమీషన్ తగ్గించారు. నెలలో మొదటి 10 రోజుల్లోనే బిల్లింగ్ పూర్తిచేసిన తర్వాత మిగతా 20 రోజులు రీడర్లు ఖాళీగా ఉంటున్నారు. ఈ 20 రోజుల్లో విద్యుత్ బిల్లులు వసూలు చేయడం, మీటర్లు మార్చడం, మొండి బకాయిలున్న సర్వీసులను తొలగించడం, వంటి పనులకు అవకాశం ఇవ్వాలని రీడర్లు చాలాకాలంగా డిస్కంలను కోరుతున్నారు. కానీ ఇప్పుడు అసలు వారి ఉపాధి పైనే కూటమి ప్రభుత్వం దెబ్బకొడుతోంది.
నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు
విద్యుత్ మీటర్ల నుంచి రీడింగ్‌ను నమోదు చేసి వినియోగదారులకు ప్రతి నెలా బిల్లు ఇచ్చే స్పాట్ బిల్లింగ్ రీడింగ్ కాంట్రాక్టులను క్లాస్–1 కాంట్రాక్టర్‌లకే ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ ఇందుకు విరుద్ధంగా డిస్కంలు కేవలం చినబాబు అనుచరులు, టీడీపీ నేతలు అయితే చాలు అన్నట్లు.. జిల్లాల వారీగా నామినేషన్‌పై కాంట్రాక్టులు అప్పగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఇలా కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తూ ప్రస్తుతం ఉన్న రీడర్లకు కల్పించాలి్సన ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయాలను నిలిపివేశారు. తామిచ్చే రేటు(కమీషన్)కే పనిచేయాలని, లేదంటే వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. చాలాచోట్ల యువగళం కార్యకర్తలకు మీటర్ రీడింగ్ తీసే పనులు అప్పగిస్తూ ప్రస్తుత రీడర్ల ఉపాధికి గండికొడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment