Shift operator posts
-
త్వరపడండి.. అమ్మకానికి షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు
సాక్షి, గిద్దలూరు (ప్రకాశం): ఎన్నికల నియమావళి వస్తోందని పనులు పూర్తికాక ముందే ప్రారంభించిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ల్లో ఖాళీగా ఉండే షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులు అమ్మకానికి పెట్టారు. ఒక్కో పోస్టును రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలకు సొమ్ము చేసుకుంటున్నారు. దీపం ఉన్నప్పుడూ ఇల్లు చక్కదిద్దుకోవాలన్న నినాదంతో అధికార టీడీపీ నాయకులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మళ్లీ అధికారం వస్తుందో లేదో అన్న అనుమానంతో అర్హత కలిగిన వారికి దక్కాల్సిన ఉద్యోగాలను డబ్బులిచ్చిన వారికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఐదేళ్లుగా టీడీపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వకపోవడంతో చదువుకున్న నిరుద్యోగులు ఖాళీగా తిరగలేక కనీసం డబ్బులు కడితేనైనా తమకు ఉద్యోగం వస్తుందన్న ఆశతో నాయకులు అడిగినంత ఇచ్చుకుంటున్నారు. కొందరు ఉద్యోగాలు లేవని పెళ్లి కూడా చేసుకోకుండానే అలాగే ఉండిపోతుఆన్నరు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ వంటి ఉపాధి కోర్సులు చదువుకున్నా సొంతంగా దుకాణాలు పెట్టుకున్నా పోటీ ఎక్కువ కావడంతో కనీసం ఇల్లు గడవడానికి సంపాదించుకోలేకపోతున్నారు. ప్రైవేటు ఉద్యోగమైనా ఏదో ఒక రోజు మనసున్న ముఖ్యమంత్రి రాకపోతాడా..తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేయకపోతాడా.. అన్న ఆశతో పెద్ద మొత్తంలో నగదు చెల్లించి షిఫ్ట్ ఆపరేటర్లుగా చేరుతున్నారు. ఒక్కో సబ్‌స్టేషన్‌లో ఐదు పోస్టులు ప్రతి విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పనిచేసేందుకు ఐదుగు ఉద్యోగులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమిస్తారు. ఇందులో ఒకరు వాచ్‌మన్ కాగా మిగిలిన నలుగురు షిఫ్ట్ ఆపరేటర్లుగా ఉంటారు. ఇందులో సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థలం ఇచ్చిన దాతకు ఒక పోస్టు ఇవ్వగా మిగిలిన పోస్టులకు విపరీతమైన పోటీ ఏర్పడింది. దీన్ని ఆసరా చేసుకున్న అధికార టీడీపీ నాయకులు డిమాండ్ సృష్టించి నిరుద్యోగుల నుంచి అందిన కాడికి పిండుకుంటున్నారు. తమ గ్రామంలోని సబ్‌స్టేషన్‌లో పోస్టుల్లో తనకు వాటా ఉందంటూ కొందరు అధికార పార్టీ నాయకులు ముందుగానే అడ్వాన్సులు పుచ్చుకున్నారు. తమకు ఉద్యోగం ఎప్పుడు వస్తోందని నగదు ఇచ్చిన వారు నాయకుల వెంట తిరుగుతున్నారు. టీడీపీలో చేరితే పోస్టులంటూ ఎర గిద్దలూరు నియోజకవర్గంలో ప్రాభవం కోల్పోయిన టీడీపీ.. షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులిస్తాం..తమ పార్టీలో చేరండని మాజీ సర్పంచ్‌లు, కుల సంఘాల నాయకులను బతిమిలాడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ముండ్లపాడులో ఓ నాయకునికి రెండు పోస్టులు ఇస్తామని కండువా కప్పారు. అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచికి రెండు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు ఇస్తానంటూ ఎరవేస్తున్నారు. నియోజకవర్గంలోని ఐదు గ్రామాల్లో నిర్మిస్తున్న విద్యుత్ సబ్‌స్టేషన్‌ల్లో ఆరు విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో పొదలకుంటపల్లెలో ఉన్న సబ్‌స్టేషన్ ఇటీవల పూర్తయింది. మిగిలిన కొత్తపల్లె, బురుజుపల్లె, అనుములపల్లె, చిన్నకంభం, నల్లగుంట్ల గ్రామాల్లో నిర్మిస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మాణాలు పూర్తికాక ముందే పోస్టులు అమ్మకానికి పెట్టారు. ఒక్కో సబ్ స్టేషన్లో నాలుగు పోస్టుల చొప్పున మొత్తం 24 పోస్టులు విక్రయానికి పెట్టారు. ఎన్నికల నియమావళి రావడంతో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పాత తేదీలతో నియామకాలు చేపట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పొదలకుంటపల్లె గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నేటికీ కొత్త ఉద్యోగులు విధుల్లో చేరలేదు. అయినా ఈ నెల 5వ తేదీనే నియామకాలు చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. ఇలానే అన్ని సబ్స్టేషన్లలోని పోస్టులను భర్తీ చేసేందుకు ఒక్కో పోస్టుకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా రూ.1.60 కోట్లు నిరుద్యోగుల నుంచి లాగేసుకుంటున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఇలా దాదాపు రూ.2 కోట్లు వసూలు చేసేందుకు అధికార పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి నియామకాలు చేపడుతున్న విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు, అర్హత కలిగిన నిరుద్యోగ యువకులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై విద్యుత్ శాఖ మార్కాపురం డీఈఈ టి.వెంకటేశ్వరరావును వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు. -
టీడీపీ నేతల బేరసారాలు...?
పదేళ్లుగా రాజకీయ నిరుద్యోగంతో అల్లాడిన తెలుగుదేశం నేతలు అన్నింటా తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. జిల్లాలో ఏ శాఖలో ఏ చిన్న ఉద్యోగమైనా... తాము చెప్పిన వారికే దక్కాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏ ఉద్యోగానికైనా కొంత రేటు ఫిక్స్ చేసేస్తున్నారు. సంబంధిత అభ్యర్థులతో బేరసారాలు కుదుర్చుకుంటున్నారు. మరోవైపు తమ వారికే ఏ ఉద్యోగమైనా... దక్కాలన్న ఆలోచనతో అధికారులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. తాజాగా ఏపీఈపీడీసీఎల్‌లో తాత్కాలిక ప్రాతి పదికన నియమించే షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులపై వీరి కన్ను పడింది. ఇంకేముంది!! విజయనగరం మున్సిపాలిటీ: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో (ఏపీఈపీడీసీఎల్) తాత్కాలిక ప్రాతిపదికన నియమించే షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులపై టీడీపీ నేతల కన్ను పడింది. ఇందుకోసం సదరు అభ్యర్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో పోస్టుకు సుమారు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు డిమాండ్‌ను బట్టి బేరసారాలు సాగిస్తున్నట్లు సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇదే పోస్టుల భర్తీ విషయం లో అధికార పార్టీ నేతల సిఫార్సులకే అధికారులు పెద్ద పీట వేసినట్టు ఆరోపణలు వినిపించేవి. తాజాగా టీడీపీ నాయకులు ఇదే తరహాలో వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికైతే ఎలక్ట్రికల్ ట్రేడ్ విభాగంలో ఐటీఐ అర్హత ఉన్న వారిని విద్యు త్ ఉప కేంద్రాల్లో షిఫ్ట్ ఆపరేటర్లుగా నియమించాల్సి ఉంది. వాటిని జిల్లాలో విద్యుత్ ఉప కేంద్రాలను నిర్వహించే కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో నియమించుకుంటారు. వారే ఒక్కో కేంద్రానికి నలుగురు చొప్పున షిఫ్ట్ ఆపరేటర్లను ఎంపిక చేసుకుని సంబంధిత పత్రాలను ఈపీడీసీఎల్ అధికారులకు పంపాలి. అభ్యర్థుల అర్హత ధ్రువీకరణ పత్రాలు పరిశీలన చేసి సం తృప్తి చెందిన తరువాత షిఫ్ట్ ఆపరే టర్లను సంబంధిత డివిజనల్ ఇంజినీర్లు నియమిస్తారు. అయితే ఈ నియామకాల విషయంలో టీడీపీ ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇటీవల జరిగిన 127 జూనియర్ లైన్మెన్ పోస్టుల నియూమకాల్లో 68 పోస్టులను ఇన్ సర్వీసు అభ్యర్థులు స్థానాలు దక్కించుకున్నారు. ఇందులో జిల్లాకు చెంది న అభ్యర్థులు సుమారు 40 మంది వరకు ఉన్నారు. మిగిలిన వారు పక్క జిల్లాలైన శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాకు చెందిన వారు. అయితే జిల్లాలో పోస్టు లు దక్కించుకున్న 40 మంది అభ్యర్థులు ఇటీవల వరకు వివిధ సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్లుగా పని చేసిన వారే. ప్రస్తుతం ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ పోస్టుల భర్తీ పై అధికార టీడీపీ నేతల కన్నుపడినట్లు ఆరోపణ లు వినిపిస్తున్నాయి. జిల్లాలోని నియోజకవర్గాల పరిధిలో ఏఏ సబ్స్టేషన్లలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో.. వాటిని ఆయా నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇచ్చిన జాబితా ప్రకారం నియమకాలు చేపట్టాలని హుకుం జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన అభ్యర్థులు ఎవరూ చె ప్పినా పట్టించుకోవద్దని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయమై డివిజన్ ఇంజినీర్ స్థాయి అధికారుల నుంచి జిల్లా ఉన్నతాధికారుల వర కు అందరికీ ఫోన్ల ద్వారా సదరు పార్టీ నాయకులు ప్రతిరోజు ఒత్తిళ్లు తెస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికైతే తాత్కాలిక పద్ధతిన నియమించే షిఫ్ట్ ఆపరేటర్ పోస్టును దక్కించుకుని కొద్ది సంవత్సరాల పాటు పని చేస్తే జూనియర్ లైన్మెన్ ఎంపికల్లో వారికి వెయిటేజీ ఇస్తారు. అందుకే ముందుస్తుగా ఈ పోస్టులను ఎవరైతే దక్కించుకుంటారో.. వారికి జేఎల్ఎం పోస్టుల తప్పనిసరిగా వస్తుందన్నది అభ్యర్థుల ఆశ. అయితే ఈ పోస్టుల భర్తీ అయ్యే సమయంలో ప్రతిసారీ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారెరిగిన అధికార పార్టీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖలో వివిధ విభాగాల్లో తాత్కాలిక ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న పలువురు ఐటీఐ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఎంవీ శేషగిరిబాబును కలిసి తమ గోడును వినిపించినట్టు సమాచారం. మార్గదర్శకాలు జారీ కావాల్సి ఉంది... షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టుల భర్తీకి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి మార్గదర్శకాలు రాలేదు. వారి మార్గదర్శకాలకు అనుగుణంగా నియూమకాలు చేపడతాం. ఈ విషయంలో అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిళ్లు వస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. - సి.శ్రీనివాసమూర్తి, ఎస్ఈ -
ఉత్తరముంటే.. ఉద్యోగం!
దండుకోవడంలో పోటీ! అంగట్లో సబ్స్టేషన్లలోని షిప్ట్ ఆపరేటర్ పోస్టులు అధికార పార్టీ నేతల సిఫారసు లేఖ ఉంటే ఉద్యోగం వచ్చినట్లే ఎమ్మెల్యే, ఎంపీతో పాటు మేయర్, మున్సిపల్ చైర్మన్లూ లేఖలిస్తున్న వైనం తలలు పట్టుకుంటున్న ఎస్పీడీసీఎల్ అధికారులు ఒక్కో లేఖ ఖరీదు రూ.2లక్షలుపైనే సాక్షి, చిత్తూరు: ‘దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం అంటే ఇదే!’ అధికారం పీఠం ఎక్కిన అనతికాలంలోనే ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు కొంతమంది ప్రజాప్రతినిధులు. జిల్లాలో విద్యుత్ సబ్స్టేషన్లలో షిప్ట్ ఆపరేటర్ పోస్టులను బేరానికి పెట్టారు. ఒక్కో పోస్టు ఖరీదు రూ.2లక్షలుగా ఖరారు చేసి బేరం కుదిరిన వారికి సిఫారసు లేఖ ఇస్తున్నారు. ఒకే పోస్టుకు ఇద్దరు, ముగ్గురు ప్రజాప్రతినిధులు లేఖలు ఇవ్వడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎవరికి పోస్టింగ్ ఇవ్వాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల జిల్లాలో చర్చనీయాంశమవుతున్న ఈ అవినీతి బాగోతం వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లాలో ఇటీవల 46 విద్యుత్ సబ్స్టేషన్లను ప్రభుత్వం నిర్మించింది. ఇందులో 43 సబ్స్టేషన్లు 2-3 నెలల కాలంలో ప్రారంభమయ్యాయి. మరో 3 సబ్స్టేషన్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి స్టేషన్లో 3 ఆపరేటర్లు, ఓ వాచ్‌మన్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాలి. ఈ క్రమంలో అనుప్పల్లి, దొడ్డిపల్లి, బోయకొండ, తిరుపతి ఆటోనగర్‌తోపాటు పలు సబ్స్టేషన్లలో ఆపరేటర్ పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తికాలేదు. ఇప్పటికే ప్రారంభించిన కొత్త సబ్స్టేషన్లలో కూడా ఖాళీ లు ఉన్నాయి. తమకు తెలియకుండా వీటిని భర్తీ చేయరాదని విద్యుత్ అధికారులపై అధికార పార్టీ ప్ర జాప్రతినిధులు హుకుం జారీ చే సినట్లు తెలిసింది. తమ నియోజకవర్గ పరిధిలోని పోస్టు ఎవరికి ఇవ్వాలో లిఖిత పూర్వక లేఖ ఇస్తామని, అందులో పేర్కొన్న వారికే ఇవ్వాలని చెప్పినట్లు తెలుస్తోంది. చిత్తూరు నేతల మధ్య రగడ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గాని కి సంబంధించి కొన్ని ఆపరేటర్ పోస్టులకు ఓ మహిళా ప్రజాప్రతినిధి సిఫారసు లేఖ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఇవే పోస్టులకు ఓ ఎంపీ కూడా లేఖ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది చాలదన్నట్లు మరో మహిళా ప్రజాప్రతినిధి మరో లేఖ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఎవరికి ఇవ్వాలో తెలియక అధికారులు తలలుపట్టుకుంటున్నట్లు ఎస్పీడీసీఎల్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఆయా ప్రజాప్రతినిధులకు వివరించినా ఎవరూ లేఖను వెనక్కు తీసుకునేందుకు సిద్ధపడడం లేదు. ‘నా పరిధి అంటే నా పరిధి’ అని వారిలో వారే పంతానికి పోతున్నారు. చేసేదేమీ లేక అధికారులు కూడా వీటి భర్తీకి తాత్కాలికంగా బ్రేక్ వేశారు. ఇదే రగడ తిరుపతి నియోజకవర్గంలోనూ చోటు చేసుకున్నట్లు తెలిసింది. లేఖలు వెనక్కు తీసుకోవాలంటే అభ్యర్థుల నుంచి తీసుకున్న డబ్బులు ఇచ్చేయాలి. దీనికి ప్రజాప్రతినిధులు ససేమిరా అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొంది. దండుకోవడంలో ఉన్న పోటీ అభివృద్ధిలో ఉంటే జిల్లా బాగుపడుతుందని ఐటీఐ విద్యార్థులు అంటున్నారు.