- దండుకోవడంలో పోటీ!
- అంగట్లో సబ్‌స్టేషన్లలోని షిప్ట్ ఆపరేటర్ పోస్టులు
- అధికార పార్టీ నేతల సిఫారసు లేఖ ఉంటే ఉద్యోగం వచ్చినట్లే
- ఎమ్మెల్యే, ఎంపీతో పాటు మేయర్, మున్సిపల్ చైర్మన్లూ లేఖలిస్తున్న వైనం
- తలలు పట్టుకుంటున్న ఎస్‌పీడీసీఎల్ అధికారులు
- ఒక్కో లేఖ ఖరీదు రూ.2లక్షలుపైనే
సాక్షి, చిత్తూరు: ‘దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం అంటే ఇదే!’ అధికారం పీఠం ఎక్కిన అనతికాలంలోనే ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు కొంతమంది ప్రజాప్రతినిధులు. జిల్లాలో విద్యుత్ సబ్‌స్టేషన్లలో షిప్ట్ ఆపరేటర్ పోస్టులను బేరానికి పెట్టారు. ఒక్కో పోస్టు ఖరీదు రూ.2లక్షలుగా ఖరారు చేసి బేరం కుదిరిన వారికి సిఫారసు లేఖ ఇస్తున్నారు. ఒకే పోస్టుకు ఇద్దరు, ముగ్గురు ప్రజాప్రతినిధులు లేఖలు ఇవ్వడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎవరికి పోస్టింగ్ ఇవ్వాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల జిల్లాలో చర్చనీయాంశమవుతున్న ఈ అవినీతి బాగోతం వివరాలు ఇలా ఉన్నాయి..
జిల్లాలో ఇటీవల 46 విద్యుత్ సబ్‌స్టేషన్లను ప్రభుత్వం నిర్మించింది. ఇందులో 43 సబ్‌స్టేషన్లు 2-3 నెలల కాలంలో ప్రారంభమయ్యాయి. మరో 3 సబ్‌స్టేషన్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి స్టేషన్‌లో 3 ఆపరేటర్లు, ఓ వాచ్‌మన్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాలి. ఈ క్రమంలో అనుప్పల్లి, దొడ్డిపల్లి, బోయకొండ, తిరుపతి ఆటోనగర్‌తోపాటు పలు సబ్‌స్టేషన్లలో ఆపరేటర్ పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తికాలేదు. ఇప్పటికే ప్రారంభించిన కొత్త సబ్‌స్టేషన్లలో కూడా ఖాళీ లు ఉన్నాయి. తమకు తెలియకుండా వీటిని భర్తీ చేయరాదని విద్యుత్ అధికారులపై అధికార పార్టీ ప్ర జాప్రతినిధులు హుకుం జారీ చే సినట్లు తెలిసింది. తమ నియోజకవర్గ పరిధిలోని పోస్టు ఎవరికి ఇవ్వాలో లిఖిత పూర్వక లేఖ ఇస్తామని, అందులో పేర్కొన్న వారికే ఇవ్వాలని చెప్పినట్లు తెలుస్తోంది.
చిత్తూరు నేతల మధ్య రగడ
చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గాని కి సంబంధించి కొన్ని ఆపరేటర్ పోస్టులకు ఓ మహిళా ప్రజాప్రతినిధి సిఫారసు లేఖ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఇవే పోస్టులకు ఓ ఎంపీ కూడా లేఖ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది చాలదన్నట్లు మరో మహిళా ప్రజాప్రతినిధి మరో లేఖ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఎవరికి ఇవ్వాలో తెలియక అధికారులు తలలుపట్టుకుంటున్నట్లు ఎస్‌పీడీసీఎల్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఆయా ప్రజాప్రతినిధులకు వివరించినా ఎవరూ లేఖను వెనక్కు తీసుకునేందుకు సిద్ధపడడం లేదు.
‘నా పరిధి అంటే నా పరిధి’ అని వారిలో వారే పంతానికి పోతున్నారు. చేసేదేమీ లేక అధికారులు కూడా వీటి భర్తీకి తాత్కాలికంగా బ్రేక్ వేశారు. ఇదే రగడ తిరుపతి నియోజకవర్గంలోనూ చోటు చేసుకున్నట్లు తెలిసింది. లేఖలు వెనక్కు తీసుకోవాలంటే అభ్యర్థుల నుంచి తీసుకున్న డబ్బులు ఇచ్చేయాలి. దీనికి ప్రజాప్రతినిధులు ససేమిరా అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొంది. దండుకోవడంలో ఉన్న పోటీ అభివృద్ధిలో ఉంటే జిల్లా బాగుపడుతుందని ఐటీఐ విద్యార్థులు అంటున్నారు.