Electrical substation
-
ఫీడర్ బేకర్‌లో తాచుపాము
సంతబొమ్మాళి: నౌపడ విద్యుత్ సబ్‌స్టేషన్‌లోని నౌపడ రూరల్ ఫీడర్ బేకర్‌లో తాచుపాము కలకలం రేపింది. రీడింగ్ తీసుకునేందుకు వెళ్లిన షిఫ్ట్ ఆపరేటర్ గోవిందరావు సాయంత్రం 5 గంటలకు స్పీడర్ బ్రేకర్ వద్దకు వెళ్లారు. తలుపు తీయగానే బ్రేకర్‌కు తాచుపాము చుట్టి ఉండడంతో కంగారుపడి వెంటనే బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత గోవిందరావు రాయితో కొట్టడంతో తాచుపాము కిందికి దిగడంతో పక్కనే ఉన్న కర్రతో దానిని కొట్టి చంపేశాడు. సుమారు ఆరడుగులు ఉందని, గతంలో కూడా నాగుపాము, కొండచిలువలు ఇలాగే కనిపించాయని సిబ్బంది తెలిపారు. -
అన్నదాతల ఆశలు మీపైనే..
సాక్షి, సిద్దిపేట/గజ్వేల్: ‘కరువుతో అల్లాడిన తెలంగాణ రైతులు.. మీరు చేసే పనులు త్వరగా పూర్తయితే సాగుజలాలు తమ పొలాల్లోకి వస్తాయని ఆశగా చూస్తున్నారు. అన్నదాత ఆశలను త్వరగా తీర్చేందుకు మీరు పనుల్లో వేగం పెంచాలి’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఇంజనీరింగ్ అధికారులు, రంగనాయకసాగర్ ప్రాజెక్టు కాంట్రాక్టర్లను ఆదేశించారు. బుధవారం సిద్దిపేట జిల్లా చంద్లాపూర్‌లో నిర్మిస్తున్న రంగనాయకసాగర్ రిజర్వాయర్, టన్నెల్, విద్యుత్ సబ్‌స్టేషన్ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అక్కడ పనిచేసే కార్మికులు, అ«ధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడారు. 90 కిలోమీటర్ల దూరం నుంచి టన్నెల్ పనులు వేగంగా చేస్తున్నారని, చివరగా ఉన్న పనులను వేగవంతం చేయాలని సూచించారు. రిజర్వాయర్ కట్ట పనుల్లో వేగం పెంచాలని, రాతి కట్టడం పనుల్లో జాప్యం జరుగుతోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సబ్‌స్టేషన్ పనులు పరిశీలించారు. ప్రభుత్వ పనితీరుకు మార్కెట్లే నిదర్శనం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు రాష్ట్రంలో ఉన్న మార్కెట్లు, వాటి పనితీరు, ఉత్పత్తుల కొనుగోళ్లే నిదర్శనమని మంత్రి అన్నారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌కు ఐఎస్ఓ–9001 అవార్డు రావడంపై మంత్రి విలేకరులతో మాట్లాడుతూ హర్షం వ్యక్తంచేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నూతన గోదాంలు నిర్మించామని, దీంతో రైతుల ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు, మద్దతు ధరకు అమ్ముకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈనామ్ పద్ధతిని అమలు చేయడంలో దేశంలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ ముందు వరుసలో ఉండటం తెలంగాణకే గర్వకారణమన్నారు. కాంగ్రెసోళ్లు ఉంటే ఇన్ని పనులు జరిగేవా? ‘ఇన్నేండ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు.. ఏ ఒక్క రోజు కూడా రైతుల గురించి ఆలోచించలే. ఇయ్యాల కేసీఆర్ అన్నదాతల కోసం నిరంతరం పరితపిస్తూ సాహసోపేతంగా ‘రైతుబంధు’పేరిట పెట్టుబడి సాయం పథకం తీసుకొచ్చిండు. ఈ పథకం చూసి దేశమంతా ముక్కున వేలేసుకుంటోంది’అంటూ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. బుధవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన ‘రైతు బంధు’అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో కరెంటు, నీళ్ల కోసం రైతులు పడ్డ కష్టాలు శాశ్వతంగా తీరిపోయాయన్నారు. 70 ఏళ్లలో జరగని పనులెన్నో ఈ మూడేళ్లలో చేసి చూపించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 58 లక్షల మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలతో పాటు పెట్టుబడి సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మే 10 నుంచి 17 వరకు పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ భూంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సబ్‌స్టేషన్‌లో పోస్టులు అమ్మబడును..
నెల్లిమర్ల రూరల్: విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఉద్యోగాలు అమ్మబడును...ఒక్కో ఉద్యోగం రూ.ఆరు లక్షలు మాత్రమే అంటూ ప్లకార్డులను ప్రదర్శించి విన్నూత నిరసనకు దిగారు నెల్లిమర్ల మండలం రామతీర్థం పంచాయతీ డి.నెలివాడకు చెందిన యువత. విషయంలోకి వెళితే.. గ్రామంలో ఇటీవలే సబ్‌స్టేషన్‌ను కొత్తగా నిర్మించారు. స్థల సేకరణ చేసేటప్పుడు గ్రామానికి చెందిన చందక అప్పలనాయుడు అనే రైతు కుటుంబంలో ఒకరికి సబ్‌స్టేషన్‌లో ఉద్యోగం ఇప్పించేలా చూస్తామని.. అలాగే ఐటీఐ చేసిన స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యం కల్పిస్తామని కొంతమంది టీడీపీ నాయకులు అప్పటిలో నమ్మబలికి స్థలాన్ని తీసుకున్నారు. అయితే కొద్ది రోజుల కిందట సబ్‌స్టేషన్‌లోని పోస్టులు అమ్ముకున్నారన్న వార్తలు రావడంతో యువత గురువారం స్థానిక సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్థలం ఇచ్చిన అప్పలనాయుడు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పిన నాయకులు మాటతప్పారన్నారు. అలాగే పోస్టుల భర్తీలో యువతకు ప్రాధాన్యం ఇవ్వకుండా అమ్ముకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. అధికార పార్టీకి చెందిన ఓ నియోజకవర్గ నాయకుడు పోస్టులు అమ్ముకున్నారని ఆరోపించారు. అధికారులు స్పం దించి నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక యువత నరేష్, సంతోష్, ధనుంజయ, సురేష్, రామునాయుడు, అప్పలనాయుడు పాల్గొన్నారు. -
విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ఆందోళన
పోలవరం: విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతుండడంతో ఆగ్రహించిన రైతులు బుట్టాయగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద శనివారం ఆందోళన నిర్వహించారు. మూడు నెలలుగా విద్యుత్ సక్రమంగా అందివ్వకపోవడంతో బుట్టాయగూడెం మండలం అచ్చియ్యపాలెం, కండ్రికగూడెం, ఎన్ఆర్ పాలెం తదితర గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయి. అనేకమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో రైతులు శనివారం పెద్ద సంఖ్యలో స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ వద్దకు చేరి నిరసనకు దిగారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పొగాకును సాగు చేస్తున్నామని, విద్యుత్ మోటార్లు ఉన్నా కరెంట్ సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలను నియమించుకున్నా కరెంట్ లేకపోవడం వల్ల వారు ఖాళీగా ఉండాల్సి వస్తోందని, దీంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నట్టు చెప్పారు. ఎలక్ట్రికల్ ఏఈ వి.రవిశంకర్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్ చేసి రప్పించారు. ఏఈ వచ్చిన తర్వాత రైతులు, ఏఈ మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడం వల్ల సర్దుబాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. వినతిపత్రం ఇస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని ఏఈ హామీ ఇచ్చారు. దీంతో వినతిపత్రం ఇచ్చిన రైతులు మూడు రోజుల్లోగా సమస్య పరిష్కారంకాకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ పొడియం శ్రీనివాస్, రైతులు సయ్యద్ బాజీ, ఎన్ఎస్వి వెంకట్రావు, రెడ్డి వెంకట్రావు, కొండపల్లి కృష్ణ, అప్సాని రాజా, పిన్నమనేని సత్యనారాయణ, గద్దే శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ స్టోర్స్‌లో అగ్నిప్రమాదం
► నిప్పు రవ్వలు పడి భారీగా వ్యాపించిన అగ్నికీలలు ► కృష్ణానగర్, ఆర్‌ఆర్‌వీపురం, దుర్గానగర్ ప్రాంతాల్లో కమ్మేసిన పొగ ► మూడు గంటల పాటు ఉక్కిరిబిక్కిరి... భయాందోళనలో జనం గోపాలపట్నం (విశాఖ పశ్చిమ) : జిల్లా విద్యుత్ స్టోర్స్‌లో మంగళవారం సంభవించిన అగ్నిప్రమాదం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే... ఆర్‌ఆర్‌వీపురంలో ఉన్న సింహాచలం విద్యుత్ సబ్ స్టేషన్‌ని ఆనుకుని ఏపీఈపీడీసీఎల్‌కు చెందిన జిల్లా విద్యుత్ స్టోర్స్ కేంద్రం ఉంది. ఇక్కడి నుంచే జిల్లా వ్యాప్తంగా మీటర్లు, హై టెన్షన్ వైర్లు, తదితర సామగ్రి సరఫరా చేస్తుంటారు. కేంద్రం ఆవరణలో పాడైన ట్రాన్స్ఫార్మర్లు, మీటర్లు, వైర్లు ఉంటాయి. అయితే ఇక్కడున్న 380 టన్నుల స్క్రాప్‌ని ఇటీవలే కాంట్రాక్టర్‌కి వేలంలో కిలో రూ.12ల చొప్పున ఇచ్చేశారు. మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో స్క్రాప్‌కి సంబంధించిన సామగ్రిని గ్యాస్ కట్టర్‌తో సరిచేస్తుండగా నిప్పు రవ్వలు ఒక్కసారిగా ఎగసి ఎండిన తుప్పలు, డొంకలకు అంటుకున్నాయి. ఇలా ఒక్కసారిగా అగ్నికీలలు వ్యాపించి అదుపు చేయలేని స్థాయికి ఎగిశాయి. భారీగా మంటలతో పాటు పెద్ద ఎత్తున పొగ వ్యాపించాయి. ఇక్కడి కృష్ణానగర్, ఆర్‌ఆర్‌వీపురం, దుర్గానగర్ తదితర కాలనీల వైపు పొగ కమ్మేయడంతో అంతా అలజడి రేగింది. జనం భయాందోళన చెందారు. సమీప ఇళ్లలోని జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎల్జీ పాలిమర్స్, మర్రిపాలెం, ఎన్ఎస్టీఎల్ నుంచి అగ్నిమాపక శకటాల సిబ్బంది, అధికారులు చేరుకుని మంటలు అదుపు చేయడానికి విశ్వప్రయత్నాలు చేశారు. సాయంత్రం 6 గంటలకు మంటలు అదుపు చేయడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. మర్రిపాలెం ఫైర్ స్టేషన్ అధికారి సత్యరాజు తదితరులు ఇక్కడ సేవలందించారు. మంటలు చెలరేగడానికి కారణాలపై ఏడీఈ యజ్ఞేశ్వర్రావు, తదితర అధికారులు, సిబ్బందిని ఆరా తీశారు. ఆస్తి నష్టంపై అంచనాలు వేస్తున్నామని ఆయన తెలిపారు. ఇక్కడున్న 380 టన్నుల స్క్రాప్‌లో ప్లాస్టిక్ సామాగ్రి కూడా ఉండడం వల్ల మంటలు, పొగ అదుపులోకి రావడం ఆలస్యమయిందని చెప్పారు. రూ.2లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని తెలిపారు. -
కరెంటు కష్టాలు తీర్చండి
విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతుల నిరసన బాలాయపల్లి: కాలువ సాగేలోపే కరెంట్ పోతుందని మండలంలోని నిండలి గ్రామానికి చెందిన రైతులు గూడూరు రూరల్ సబ్‌స్టేషన్ ఎదుట మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిండలి రైతులు మాట్లాడుతూ కరెంట్ సరఫరా అస్తవ్యస్తంగా మారడంతో వారం రోజుల నుంచి సాగు, తాగు నీటికి అవస్థ పడుతున్నామని వాపోయారు. కరెంట్ ప్రతి ఐదు నిమిషాలకు వస్తూపోతూ ఉండటంతో మోటారు వద్దే పడిగాపులు పడాల్సి వస్తోందన్నారు. గత వారం బాలాయపల్లి విద్యుత్ శాఖ ఏఈ ఓంకార్‌కు సమస్యను విన్నవించినా పట్టించుకోలేదన్నారు. విద్యుత్ కోతలతో నిమ్మ చెట్లు ఎండ బెట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. -
నేరడ మోడల్ స్కూల్లో గ్యాస్ సిలిండర్ లీక్
చెలరేగిన మంటలు పదో తరగతి విద్యార్థినికి స్వల్ప గాయాలు మంటలను ఆర్పిన విద్యుత్ సబ్‌స్టేషన్ సిబ్బంది నేరడ(కురవి) : మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని నేరడ గ్రామంలో ఉన్న మోడల్ స్కూల్ ఆవరణలోని బాలికల వసతిగృహంలో గురువారం రాత్రి గ్యాస్ సిలిండర్‌కు ఉన్న పైప్ లీకై మంటలు చెలరేగిన సంఘటన చోటుచేసుకుంది. కురవి ఎస్సై తీగల అశోక్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.... నేరడ మోడల్ స్కూల్ ఆవరణలో బాలికల వసతిగృహం ఉంది. గురువారం రాత్రి బాలికలకు భోజనాల కోసం వంట మనుషులు వంటలను వండుతున్న క్రమంలో సిలిండర్, స్టౌకు ఉన్న పైప్ లీకైంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్కూల్ ఎదురుగా ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పనిచేసే సిబ్బంది పరుగున చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో పదో తరగతి విద్యార్థిని ఝాన్సీకి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన విషయం తెలుసుకున్న కురవి ఎస్సై తీగల అశోక్ హుటాహుటిన వసతిగృహం వద్దకు చేరుకుని విద్యార్థులకు మనోధైర్యం చెప్పారు. ఎంఈఓ ఇస్లావత్ లచ్చిరాంనాయక్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్యాస్ పైప్ లీకై మంటలు చెలరేగినప్పటికీ విద్యుత్ సిబ్బంది సకాలంలో వచ్చి మంటలను ఆర్పి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
పట్టాలెక్కని మెట్రో ప్రాజెకు
విజయవాడ నగరంలో మెట్రోరైలు ప్రాజెక్టు పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. టెండర్లు ఖరారు చేసేలోగా భూసేకరణ పూర్తి చేయాలని జిల్లా అధికార యంత్రాంగం భావించింది. అయితే సేకరణ ప్రక్రియకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో సకాలంలో మెట్రో పనులు పూర్తి అవుతాయా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, విజయవాడ : విజయవాడలో బందరురోడ్డు, ఏలూరు రోడ్డులో మెట్రో రైలు మార్గం నిర్మాణానికి 75 ఎకరాల భూమి అవసరం అవుతుందని తొలుత అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్(ఏఎంఆర్‌సీ)అధికారులు భావించారు. చివరకు 68.32 ఎకరాలకు కుదించారు. ఇందులో 61.23 ఎకరాలు నిడమానూరులో కోచ్ డిపోల కోసం, 2.57 ఎకరాలు పెనమలూరులో ఎలక్ట్రికల్ స్టేషన్ కోసం సేకరిస్తారు. మిగిలిన 4.52 ఎకరాలు నగరంలో సేకరించాల్సి ఉంది. భూ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చి, ఇటీవల ప్రజాభిప్రాయసేకరణకు సమావేశాలు నిర్వహిస్తే భూ యజమానులు అధికారుల ఎదుట ఆత్మహత్మలకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా అధికారపార్టీ నేతకు చెందిన బహుళ అంతస్తుల సముదాయాన్ని కాపాడేందుకు చిన్న వ్యాపారస్తుల కడుపు కొడుతున్నారంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. నగరంలో మెట్రో రైలు అవసరం లేదని వాదించారు. అంతేకాక భూసేకరణపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అధికారులు అమ్ముడు పోయారంటూ బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. మరి కొంతమంది దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావిస్తున్నారు. దీంతో భూసేకరణ రెవెన్యూ అధికారులకు ఇబ్బందిగానే మారింది. అప్పులతోనే నిధులు సేకరణ.... మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.7,200 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 20 శాతం భరిస్తాయి. మిగిలిన 60 శాతం ఏఎంఆర్‌సీ అప్పుగా సేకరించుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తమ వాటాగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. భూసేకరణ పూర్తయి పనులు ప్రారంభించిన తరువాత ఆ సొమ్ము వచ్చే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం తన వాటాలో ఇప్పటి వరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. మిగిలిన సొమ్మును ఆర్థిక సంస్థల నుంచి అప్పుగా తీసుకొనేందుకు జీవో జారీ చేసింది. ఏఎంఆర్‌సీ వాటా 60శాతం నిధులు కోసం జపాన్, జర్మనీ, ఫ్రాన్స్‌లోని ఆర్థిక సంస్థల ప్రతినిధులతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. టెండర్లు పూర్తయ్యేనాటికి ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు పూర్తయి నిధులు ఎంతమేరకు వస్తాయనేది అనుమానమే. భూ సేకరణకు సుమారు రూ.450 కోట్లు అవసరం. ప్రస్తుతం ఉన్న సొమ్ము భూసేకరణకు సరిపోదు. దీంతో ఆర్థిక సంస్థల నుంచి అప్పు తీసుకుంటే కానీ ప్రాజెక్టు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. నిర్ణీత సమయానికి పూర్తయ్యేనా! మెట్రో ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2018 ఫిబ్రవరి నాటికి మెట్రో రైలు ట్రయల్‌రన్ నడపాలనే ఉద్దేశంతో 2015 ఏప్రిల్‌లో పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు టెండర్లు ఖరారు కాలేదు. ఫిబ్రవరి నెలాఖరుకు ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ లోగా భూసేకరణ చేసి భూమి అప్పగించే నాటికి కనీసం మరో మూడు, నాలుగు నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మెట్రో రైలు నిర్మాణానికి కేవలం 10 నెలలే వ్యవధి ఉంటుంది. ఆ తరువాత కనీసం నాలుగేళ్లకు పనులు పూర్తవుతాయని ఏఎంఆర్‌సీ అధికారులు చెబుతున్నారు. దాంతో మెట్రో రైలు నిర్మాణ వ్యయం పెరిగిందని తిరిగి ప్రాజెక్టు అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచే అవకాశం లేకపోలేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
విద్యుత్ సేవలో డ్రోన్స్
సాక్షి, చెన్నై: విద్యుత్ శాఖ సేవకు డ్రోన్స (మానవ రహిత విమానాలు) రంగంలోకి దిగనున్నాయి. తొలి విడతగా చెన్నైలో మూడు లేదా నాలుగు విమానాల కొనుగోలుకు కసరత్తులు సాగుతున్నాయి. రాష్ట్రంలో రోజుకు పదమూడు వేల మెగావాట్ల మేరకు విద్యుత్ వినియోగం సాగుతున్న విషయం తెలిసిందే. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి, కేంద్ర గ్రిడ్ల నుంచి వచ్చే విద్యుత్ సబ్స్టేషన్ల ద్వారా రాష్ట్రంలో సరఫరా అవుతున్నది. ఇందుకుగాను భారీ విద్యుత్ లైన్లు ఆయా సబ్ స్టేషన్లను అనుసంధానించే విధంగా ఏర్పాట్లు చేశారు. అరుుతే, తరచూ ఈ భారీ విద్యుల్ లైన్లలో ఏర్పడే సమస్యలతో , మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకాలు తప్పడం లేదు. ఇలాంటి ప్రభావాలతో శుక్రవారం ఎనిమిది జిల్లాలు అంధకారంలో మునగాల్సిన పరిస్థితి. అంతకు ముందు దక్షిణ చెన్నైలో ఇలాంటి సమస్యను ప్రజలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విద్యుత్ లైన్లలో ఎక్కడ సమస్య బయలు దేరిందో గుర్తించేందుకు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి. ఈ కారణంగా సమయం వృథా, పని భారం ఎక్కువే. దీనిని పరిగణలోకి తీసుకున్న విద్యుత్ బోర్డు వర్గాలు ఎక్కడెక్కడ అయితే, సమస్యలు బయలు దేరుతాయో , తక్కువ సమయంలో వాటిని పరిశీలించి, ఆ ఫొటోలను కంట్రోల్ రూంకు చేరే వేసే విధంగా, సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుని మరమ్మతులు చేపట్టేందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు సాగేందుకు నిర్ణయించారు. ఇందు కోసం ప్రత్యేకంగా మానవ రహిత విమానాలను కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకున్నారు. విద్యుత్ సేవలో డ్రోన్స: తొలి విడతగా చెన్నైలో మానవ రహిత విమానాలను రంగంలోకి దించేందుకు తగ్గ ప్రయత్నాలు వేగవంతం చేశారు. శ్రీ పెరంబదూరు నుంచి తరమణి, మనలి నుంచి మైలాపూర్ , ఉత్తర చెన్నై నుంచి మరలి, మైలాపుర్ నుంచి బేషిన్ బ్రిడ్జి వైపుగా సాగే భారీ విద్యుత్ లైన్లను పరిశీలించేందుకు, పర్యవేక్షించేందుకు ఈ మానవ రహిత విమానాలు రంగంలోకి దించనున్నారు. ముందుగా ఆ లైన్ల వెంబడి మానవ రహిత విమానాల్లోని కెమెరాల ఆధారంగా వీడియో చిత్రీకరణ సాగుతుంది. ఆ లైన్లలో ఎక్కడైనా సాంకేతిక పరంగా, హై ఓల్టేజీ కారణంగా, ఇతర కారణాలతో ఏదేని మరమ్మతులు చోటు చేసుకున్నా, సమస్య బయలు దేరినా తక్షణం ఆ ప్రదేశాన్ని గుర్తించేందుకు వీలుగా మానవ రహిత విమానాలను పంపిస్తారు. ఆవిమానాలు ఆ ప్రదేశాన్ని గుర్తించి కంట్రోల్ రూంకు ఫొటోలను పంపుతుంది. దీంతో సిబ్బంది అక్కడికి చేరుకుని సకాలంలో సమస్యను అధిగమించేందుకు వీలు ఉండడం వల్లే, ఈ మానవ రహిత విమానాల మీద దృష్టి పెట్టినట్టు విద్యుత్ బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. తొలివిడతగా చెన్నైలో మూడు లేదా, నాలుగు విమానాలను కొనుగోలు చేయనున్నామని ప్రకటించారు. టెండర్ల ద్వారా మానవ రహిత విమానాల కొనుగోలు ఉంటుందని, ఈ ప్రయత్నం సత్ఫలితాల్ని ఇచ్చిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రధాన నగరాల్లో మానవ రహిత విమానాల సేవల్ని విస్తరింప చేస్తామన్నారు. -
విద్యుత్‌సిబ్బందిని నిర్బంధించిన రైతులు
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం యాచవరం గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజులుగా విద్యుత్ సరఫరా సరిగ్గా లేకపోవ డంతో.. సబ్‌స్టేషన్ పరిధిలోని నాలుగు గ్రామాలకు చెందిన రైతులు ఈ రోజు సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యుత్ అధికారులు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో.. ఆగ్రహించిన రైతులు సిబ్బందిని గదిలో వేసి తాళంవేశారు. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు సర్ది చెప్పడానికి యత్నిస్తున్నారు. -
సబ్ స్టేషన్లకు రూ.110 కోట్లు
♦ ఇకపై లో ఓల్టేజీ సమస్య పూర్తిగా తీరుతుంది ♦ ఇప్పటికే రైతులకు 9గంటలు విద్యుత్ ఇస్తున్నాం ♦ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి చేవెళ్ల రూరల్: జిల్లాలో 50 విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు రూ.110 కోట్లు కేటాయించినట్టు రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మంత్రి మహేందర్‌రెడ్డి చేవెళ్ల మండలం ముడిమ్యాలలో నిర్మించిన 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం, రేగడిఘనాపూర్‌లో కొత్తగా నిర్మించే 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం నిరంతర కరెంట్, రైతులకు 9 గంటల సరఫరాను అందిస్తున్నామని చెప్పారు. దీని వల్ల జిల్లాలోని లక్షా 10వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. 50 యూనిట్లలోపు విద్యుత్ వాడిన ఎస్సీ, ఎస్టీలకు చార్జీల మాఫీ చేశామని మంత్రి చెప్పారు. జిల్లాలోని తూర్పు డివిజన్లో 9 సబ్స్టేషన్లకు రూ.22కోట్లు, ఉత్తర డివిజన్లో 14 సబ్స్టేషన్లకు రూ.53కోట్లు, పశ్చిమ డివిజన్లో రూ.17 సబ్‌స్టేషన్‌లో రూ.34 కోట్లు కేటాయించామన్నారు. ఇంకా 37 విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలో 8 సబ్స్టేషన్లకు గాను రూ.17 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుతో వినియోగదారులకు లో ఓల్టేజీ సమస్య ఉండదన్నారు. బంగారు తెలంగాణ సాధనలో ప్రజలు బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అందరం కలిసి పనిచేస్తేనే ఆ కల నేరవేరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, విద్యుత్ ఎస్ఈ శ్రీరామలు, డీఈ దుర్గారావు, ఏఈ అశోక్‌రావు, సర్పంచులు కోరే సువర్ణ, తిప్పని రాంరెడ్డి, ఎంపీసీటీ సభ్యులు బుర్ల సుమలత, శ్రీలత, ఎంపీపీ ఎం.బాల్‌రాజ్, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు పి. వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ సబ్‌స్టేషన్‌కు భూమిపూజ
ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని లింగాపూర్‌లో నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ సబ్‌స్టేషన్‌కు ఎమ్మెల్యే పురాణం సతీశ్, ఎమ్మెల్సీ దివాకర్ రావు భూమిపూజ చేశారు. రూ. కోటి రూపాయలతో ఈ సబ్‌స్టేషన్‌ను నిర్మించనున్నారు. ఈ సబ్‌స్టేషన్ నిర్మాణంతో మండలంలోని విద్యుత్ సమస్యలు తీరుతాయని వారు తెలిపారు. -
విద్యుత్ సబ్ ఇంజనీర్ ఆత్మహత్యాయత్నం
నర్సీపట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నంలో విద్యుత్‌శాఖ సబ్ ఇంజనీర్ ఒకరు ఆత్మహత్యాయత్నం చేశారు. సబ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శివప్రసాద్ తన ఇంట్లో నిద్ర మాత్రలు మింగడంతో ఆయన్ను చికిత్స కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. డీఈ వేధింపులు తట్టుకోలేకే అతడు ఈ పనికి పాల్పడినట్టు సమాచారం. శివప్రసాద్ వారం రోజులుగా సెలవులో ఉన్నారు. -
విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నాగుపాము హల్చల్
యాలాల(రంగారెడ్డి జిల్లా): దౌలాపూర్ సమీపంలోని సబ్‌స్టేషన్‌లో మంగళవారం ఓ నాగుపాము సిబ్బందిని హడలెత్తించింది. నాగుపాము కారణంగా దాదాపు మూడు గంటల పాటు విద్యుత్ ప్రసారానికి అంతరాయం ఏర్పడింది. సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఆపరేటర్ లింగం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విధుల్లోకి వచ్చాడు. ఆ సమయంలో సబ్‌స్టేషన్‌లోని ప్యానల్ బోర్డులో వైర్లు కాలిపోతున్న వాసన రావడంతో ప్యానల్ బోర్డు తెరిచాడు. అప్పటికే పలుమార్లు విద్యుదాఘాతానికి గురై కోపంగా ఉన్న నాగుపామును చూసి లింగం భయభ్రాంతికి గురయ్యాడు. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేసి, విషయాన్ని తోటి ఆపరేటర్లతో పాటు ఏఈకి తెలిపాడు. పాము కోసం సిబ్బందితో పాటు స్థానికులు దానిని పట్టుకునేందుకు ప్రయత్నించినా వీలుపడలేదు. మూడు గంటల పాటు వెతికినా కనిపించకుండా పోయింది. -
లోవోల్టేజ్ సమస్యకు చరమగీతం
శరవేగంగా జరుగుతున్న విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు కొల్లిపర : రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) పరిధిలోని పలు గ్రామాల్లో విద్యుత్ లోవోల్టేజ్ సమస్యకు మరో నాలుగు నెలల్లో చరమగీతం పాడనున్నారు. మండలంలోని పలు గ్రామాలలో లోవోల్టేజ్, అనధికార విద్యుత్ కోతల సమస్యలు ఉన్నా యి. విషయం తెలుసుకున్న అప్పటి శాసన సభాపతి నాదెండ్ల మనోహర్ చొరవ తీసుకుని రూ.8 కోట్లతో 132/32 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి నిధులను విడుదల చేయించారు. 2014లో చక్రాయపాలెంలో 132.32కేవీ సబ్ స్టేషన్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణ పనులు 80శాతం వరకు పూర్తి అయ్యాయి. మిగిలిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భవన నిర్మాణం, ప్రహరి గోడ, విద్యుత్ పరికరాల ఏర్పాటుకు అవసరమైన పిల్లర్ల నిర్మాణం పూర్తిచేశారు. అలాగే విద్యుత్ పరికారాలు, మరికొంత మెటీరియల్ రావలసి ఉంది. తీరనున్న విద్యుత్ సమస్య ఈ సబ్ స్టేషన్ నుంచి నాలుగు 32 కె.వి సబ్స్టేషన్లకు విద్యుత్‌ను సరఫరా చేస్తారు. తెనాలి ఆటోనగర్, కొల్లిపర మండలంలోని మున్నంగి, కొల్లూరు మండలంలోని చిలుమూరు, కొల్లూరులో ఉన్న ఫీడర్ సబ్స్టేషన్లకు విద్యుత్ సరఫరా లైన్లను ఏర్పాటు చేశారు. తాడికొండ నుంచి తెనాలి, తెనాలి నుంచి చక్రయపాలెంలోని ఈ విద్యుత్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరా అయ్యేలా లైన్లను ఏర్పాటు చేశారు. లోవోల్టేజ్ కారణంగా అనేక సందర్భాలలో పలు గ్రామాలలో గృహోపకరణాలు దెబ్బతిన్నాయి. ఈ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే పలు ఆ గ్రామాలలో వోల్టేజి సమస్య తీరుతుంది. విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా ఉంటుంది. మరో నాలుగు నెలల్లో సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి అవుతుందని ట్రాన్స్‌కో ఎడిఈ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. దీనివల్ల సీఆర్డీఏ పరిధిలో పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు తొలగిపోతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
ట్రాన్స్ఫార్మర్ పేరుతో రూ.10 లక్షలు వసూలు చేసి..
సింహాద్రిపురం (వైఎస్సార్ జిల్లా) : టాన్స్‌ఫార్మర్ ఇప్పిస్తానని రైతుల నుంచి వసూలు చేసిన రూ.10 లక్షలతో ఓ అధికారి కనిపించకుండా పోయారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన కొందరు రైతులు ట్రాన్స్ఫార్మర్ల కోసం దరఖాస్తు చేసుకోగా విద్యుత్ సబ్ ఇంజినీర్ శివప్రసాద్ వారి నుంచి రూ.10 లక్షల వరకు తీసుకున్నాడు. అయితే గత మూడు రోజులుగా ఆయన కనిపించకుండా పోవటంతో దాదాపు 15 మంది రైతులు గురువారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
అన్నదాతకు షాక్!
పరిగి: అన్నదాతకు అర్ధరాత్రి కరెంట్ కష్టాలు షురువయ్యాయి. ఇటీవలి వరకు తెల్లవారుజామున ఓ దఫా.. మరో దఫా పగలు సరఫరా చేస్తూ వచ్చిన విద్యుత్ అధికారులు సోమవారం నుంచి కరెంట్ వేళలు మార్చేశారు. గతంలో తెల్లవారు జామున సరఫరా చేసే కరెంట్‌ను ప్రస్తుతం అర్ధరాత్రి 12 గంటలకు సరఫరా చేయనున్నారు. ఇదేమంటే ఉన్నతాధికారుల సూచనల మేరకు ఓ దఫా సమయాన్ని అర్ధరాత్రికి మార్చామని అధికారులు పేర్కొంటున్నారు. రైతులకు 7 గంటల కరెంట్ ఇవ్వలేం ఆరు గంటలు మాత్రం ఇస్తామని కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ప్రకటించింది. సర్కారు ప్రకటన వాస్తవ విరుద్ధంగా ఉందని రైతులు అవస్థలు చూసిన వారెవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఆయా విద్యుత్ సబ్స్టేషన్లకు చెందిన ఫీడర్లలో ఇటీవలి వరకు కొన్నింటిలో ఉదయం 3 నుంచి 6 గంటల వరకు, తిరిగి మ్యధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు, మరో వారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరిగి రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు రోజుకు ఆరు గంటల విద్యుత్ సరఫరా చేస్తూ వచ్చారు. ప్రస్తుతం మారిన వేళల ప్రకారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు తిరిగి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు సరఫరా చేయనున్నారు. దీంతో రైతులు అర్ధరాత్రి కష్టాలు మొదలయ్యాయి. కరెంట్ కోసం రాత్రిపూట వ్యవసాయ పొలాల వద్ద కంటిమీద కునుకు లేకుండా ఉండాల్సిందే. అర్ధరాత్రి విష కీటకాల బారిన పడటంతో పాటు విద్యుత్ ప్రమాదాల భయంతో రైతులు వణికే పరిస్థితులు దాపురించాయి. సరఫరా చేస్తోంది 3 నుంచి 4 గంటల కరెంటే ప్రభుత్వం రైతులకు ఆరు గంటల కరెంటు సరఫరా చేస్తున్నామని చెబుతున్నప్పటికీ వాస్తవంగా 3 నుంచి 4 గంటల కరెంటే సరఫరా అవుతోంది. సరఫరా అయ్యే సమయంలో ఐదు నుంచి పదిసార్లు కరెంట్ పోయి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. సరఫరా అవుతున్న కరెంటు కూడా లో ఓల్టేజితో రావడంతో మోటార్లు, స్టార్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. కరెంటు కూడా వచ్చీ పోతుండడంతో పొలానికి నీళ్లు పారించడం రైతులకు గగనంగా మారుతోంది. పదే పదే కరెంటు పోతుండడంతో పారించిన పొలాన్నే తిరిగి పారించాల్సి వస్తుందని దీంతో రోజులో నాలుగు గుంటల భూమికంటే ఎక్కువ పారించలేకపోతున్నామని పరిగికి చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తంచేశాడు. కరెంట్‌ను నమ్ముకుంటే వ్యవసాయం చేయలేమని కనీసం జనరేటరైనా కొందామని వికారాబాద్‌లోని ఓ దుకాణానికి వెళితే రూ. 80 వేలు ధర చెప్పడంతో చేసేదిలేక తిరిగి వచ్చానని మరో రైతు తన ఆందోళన వ్యక్తం చేశాడు. ఆయిల్ ఇంజిన్లు, జనరేటర్లను ఆశ్రయిస్తున్న రైతులు కరెంటు కోతల కారణంగా రైతులు ఆయిల్ ఇంజిన్లను ఆశ్రయించాల్సి వస్తోంది. కొంత డబ్బు వెచ్చించే స్థోమత ఉన్న రైతులు జనరేటర్లను ఆశ్రయిస్తున్నారు. అయినప్పటికీ పొలం బాగా బీటలు వారి ఉండడంతో ఒక్కో ఎకరం నీరు పారించడానికి రెండు రోజులు ఆయిల్ ఇంజిన్‌ను నడిపించాల్సివస్తోంది. గంటసేపు వీటిని నడిపించాలంటే డీజిల్‌కు రూ. 130 ఖర్చవుతోందని పరిగికి చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎకరా పొలానికి నీరు పారించడం కోసం రైతులు వేల రూపాయలు వెచ్చించాల్సి వ స్తోంది. కరెంటు వస్తూ పోతూ ఉండడంతో ఓ వ్యక్తి స్టార్టర్ వద్దే పట్టుకొని ఉండాల్సి వస్తుందని మల్లెమోనిగూడకు చెందిన ఓ రైతు వాపోయాడు. ట్రాన్స్ఫార్మర్ కాలితే పంట ఎండాల్సిందే.. ఇటీవల కరెంటు వస్తూ పోతూ (ట్రిప్ అవుతుండటం)ఉండడంతో పాటు వచ్చిన కరెంటు కూడా లో ఓల్జేజితో వస్తుండడంతో స్టార్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన వెంటనే అధికారులు స్పందించకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు మోటార్లు పదే పదే కాలిపోతుండడంతో వాటి మరమ్మతులకు వేలకు వేలు ఖర్చుచే యాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో అధికారులు స్పందించకపోవడంతో రైతులే చందాలు వేసుకొని బాగు చేయించుకుంటున్నారు. -
విద్యుత్‌షాక్‌లతో కోనాయిపల్లి విలవిల
⇒సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా ఒకరి మృతి ⇒15 మందికి గాయాలు ⇒మృతదేహంతో విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి ⇒పోలీసుల హామీతో ఆందోళన విరమణ ⇒ఫిర్యాదు చే స్తున్నా పట్టించుకోలేదంటున్న గ్రామస్తులు తూప్రాన్ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఖరీదు ఓ నిండి ప్రాణాన్ని బలిగొనడమే గాక మరో 15 మంది గాయపడ్డారు. అయితే సంబంధిత అధికారుల తీరును నిరసిస్తూ గ్రామ పరిధిలోని సబ్ స్టేషన్‌ను ముట్టడించి ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేశారు. అయితే పోలీసుల జోక్యంతో గ్రామస్తులు శాంతించారు. ఈ సంఘటన మండలంలోని కోనాయిపల్లి (పీటీ)లో మంగళవారం చోటు చేసుకుం ది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన శెట్టి నరసింహులు, భారతమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు ఆడపిల్లలకు వివాహాలు కాగా కుమారుడు శ్రీకాంత్ (20) కాళ్లకల్ గ్రామ సమీపంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమంలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అయితే మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో శ్రీకాంత్ సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా.. విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. దీంతో విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు అప్పటికే పనులకు వెళ్లిన శ్రీకాంత్ తల్లిదండ్రులకు సమాచారాన్ని చేరవే స్తూ బాధితుడిని కొంపల్లిలోని లీలా ఆస్పత్రికి తరలిం చారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు మృతి చెందాడ ని ధ్రువీకరించారు. విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద మృతదేహంతో ఆందోళన శ్రీకాంత్ మృతికి ట్రాన్స్‌కో అధికారులే కారణమంటూ బాధిత కుటుంబ సభ్యు లు, గ్రామస్తులు మృతదే హాన్ని గ్రామ సమీపంలో గల విద్యుత్ సబ్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఆందోళనకు దిగారు. అక్కడి గదుల కిటికీల అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ సంతోష్‌కుమార్ సిబ్బంది గ్రామానికి చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పే యత్నం చేయడంతో వారు తిరగబడ్డారు. దీంతో ఎస్ఐ విషయాన్ని సీఐ సంజయ్ కుమార్‌కు తెలపడంతో ఆయన శివ్వంపేట ఎస్ఐ రాజేష్, సిబ్బందిని వెంటబెట్టుకుని గ్రామానికి చేరుకుని వారితో మాట్లాడారు. విద్యుత్ అధికారులతో చర్చించి నష్టపరిహారంతో పాటు విద్యుత్ అధికారులపై కేసు నమోదు చేస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముమ్మాటికీ అధికారుల నిర్లక్ష్యమే.. గ్రామంలోని ఓవర్‌హెడ్ ట్యాంకు వద్ద ఉన్న సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఎర్తింగ్ లోపంతోనే దీని పరిధిలోని ఇళ్లకు సోమవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో షాక్ రావడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఇదే విషయాన్ని విద్యుత్ అధికారులకు చెప్పినా ఎవరూ స్పందించలేదన్నారు. అధికారుల నిర్లక్ష్యమే గ్రామానికి చెందిన శ్రీకాంత్ ప్రాణం తీసిందని గ్రామస్తులు ఆరోపించారు. అదే గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త మన్నే సురేఖ ఇంట్లో ఉదయం వంట చేసేందుకు రైస్ కుక్కర్‌తో అన్నం వండేందుకు స్విచ్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా షాక్‌కు గురై స్పృహ కోల్పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రా ణాపాయ స్థితి నుంచి బయటపడింది. ఇలా గ్రామానికి చెందిన బక్క శోభ, మ హిపాల్, మన్నే రవి, మల్లిక, పృథ్వీరా జ్, మంగమ్మలతో పాటు మరికొందరు గ్రామస్తులు విద్యుదాఘాతానికి గురై గా యపడ్డారు. ఈ విషయంపై ఏడీఈ వినోద్‌రెడ్డిని వివరణ కోరగా విద్యుదాఘాతంతో మృతి చెందిన యువకుడి కుటుంబానికి తమ శాఖ తరఫున రూ. 2 లక్షల నష్టపరిహారాన్ని మూడు నెలల్లో అందిస్తామని తెలిపారు. మండలంలోని సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లకు గల ఎర్తింగ్లను సరి చేస్తామన్నారు. -
నష్టం ఒకరిది... పరిహారం మరొకరికా..?
పరిగిరూరల్ : హైటెన్షన్ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు వల్ల పాడైన పంటకు పరిహారం ఇవ్వడం లేదంటూ మండల పరిధిలోని మాదారం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శంకర్పల్లి నుంచి పరిగి విద్యుత్ సబ్‌స్టేషన్ వరకు హైటెన్షన్ విద్యుత్(టవర్) స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటకు సంబంధిత రైతుల అనుమతులు తీసుకొని పనులు చేస్తున్నారు. రెండు నెలల క్రితం టవర్లు ఏర్పాటు చేసేందుకు దిమ్మెలు ఏర్పాటు చేశారు. నెలలు దాటుతున్నా టవర్లు బిగించడం లేదంటూ రైతులు పంటలను సాగు చేసుకున్నారు. మొక్కజొన్న, పత్తి పంటలు వేసిన పొలాల్లో పదిహేను రోజుల క్రితం టవర్లను ఏర్పాటు చేశారు. టవర్లు ఏర్పాటు చేసేందుకు పొలాల్లోకి ట్రాక్టర్ రావడం, తాళ్లతో టవర్ పట్టీలను లాగడం వంటి పనులు పంటచేలలో చేశారు. ఈ పనులు చేస్తున్న సమయంలో ఒక్కో పొలంలో అర ఎకరా, పావు ఎకరా పంట పూర్తిగా నేల మట్టమైంది. దీనికి పరిహారం అందించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అయితే పరిహారం అందించడంలో కూడా మరో చిక్కు సమస్య రైతులను వేధిస్తోంది. చాలా మంది తమ పొలాలను ఇతరులకు కౌలుకు ఇచ్చారు. పట్టాదారుతో పనులు చేస్తున్న కాంట్రాక్టర్ విద్యుత్ స్తంభం(టవర్) ఏర్పాటుకు, పరిహారానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. భూముులను లీజుకు తీసుకుని వేలరూపాయలు వెచ్చించి పంట నష్టపోయిన తమకు పరిహారం ఇవ్వకపోవడమేమిటని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులతో చర్చిస్తాం టవర్లు వేసే సమయంలో పొలం యజమాలనులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రస్తుతం ఆ పొలంలో వేరొకరు పంటలను సాగు చేస్తున్నారు. పంట నష్టపోయిన కౌలురైతులకే పరిహారం దక్కాలి. ఈ విషయమై సంబంధిత ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం, కౌలు రైతులు, పొలం యజమానులు కూడా ఇందుకు సహకరించాలి. ఏఈ రాజ్‌కుమార్ పత్తి మొక్కలు నేలపాలు రంగాపూర్ గ్రామానికి చెందిన నర్మమ్మ పొలం కౌలుకు తీసుకొని పత్తిపంట సాగు చేశాను. విద్యుత్తు స్తంభం ఏర్పాటు పనుల్లో భాగంగా పత్తి పొలంలో ట్రాక్టర్ తిప్పి కాయలు పట్టిన మొక్కలను నేలపాలు చేశారు. మాకు పరిహారం అందించాలని సంబంధింత కాంట్రాక్టర్‌తో మాట్లాడగా పొలం సొంతదారుకే పరిహారం అంటున్నారు. పరిహారం మాకే అందించేలా అధికారులు చొరవచూపాలి. కౌలు రైతు బాలయ్య(మాదారం) -
ట్రాన్స్ఫార్మర్ల దొంగలు దొరికారు
మోమిన్‌పేట: కొంతకాలంగా ట్రాన్స్ఫార్మర్లు అపహరిస్తూ రైతులను ముప్పుతిప్పలు పెట్టిన దొంగలు ఎట్టకేలకు పోలీసులకు దొరికారు. తీగ లాగితే డొంకంతా కదిలింది అన్న చందంగా.. పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా నిందితులు ఆరుగురు దొరికా రు. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కేసారం గ్రామానికి చెందిన పంచలింగాల పర్మ య్య నాలుగేళ్ల క్రితం మోమిన్‌పేట విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్టు బేస్‌లో పని చేశాడు. అతడి తీరు బాగలేకపోవడంతో రెండేళ్ల క్రితం అధికారులు ఉద్యోగంలోంచి తొలగించారు. జల్సాలకు అలవాటు పడిన అతడు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోంచి కాపర్ తీగలు అపహరించేందుకు పథకం పన్నాడు. తనొక్కడితో చోరీలు చేయడం కాదని భావించిన అతడు అదే గ్రామానికి చెందిన షేక్ ఆజం, అసిఫ్, ఎండీ రహమత్ అలీ, సీహెచ్ సంగయ్య, ద్యాంగ లాయక్ అలీతో కలిసి ఓ ముఠా ఏర్పాటు చేశాడు. వీరు సయ్యద్‌అల్లిపూర్ 2, కేసారం గ్రామంలో 2, మొరంగపల్లి 3, వెల్చాల్ గ్రామంలో 2, దుర్గంచెరువు గ్రామంలో 2 మొత్తం 11 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి రాగి తీగలు అపహరించారు. కాపర్ తీగలను నగరంలోని బేగంబజార్‌లో విక్రయించేవారమని నిందితులు పోలీసులకు తెలిపారు. ఇలా దొరికిపోయారు.. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు గురువారం ఉదయం కేసారం గ్రామానికి చెందిన అసిఫ్‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరిపారు. దీంతో అతడు మిగతా వారి పేర్లు చెప్పారు. ఈమేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. -
అన్నదాత ఆగ్రహం
ముచ్చర్ల విద్యుత్ సబ్‌స్టేషన్‌పై రైతుల దాడి - ఫర్నిచర్ ధ్వంసం - కార్యాలయం ఎదుట రాస్తారోకో కామేపల్లి :విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్నాయని, నిర్ణీత సమయమంటూ లేకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామేపల్లి మండలం ముచ్చర్ల సబ్‌స్టేషన్‌పై బుధవారం తెల్లవారుజామున మద్దులపల్లి గ్రామ రైతులు దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సబ్‌స్టేషన్ గేటు తొలగించి రోడ్డుపై పడేశారు. కిటికీలు పగలకొట్టి రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రతిరోజు రాత్రిపూట కనీసం నాలుగు గంటలు విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండగా, వారం రోజులుగా తీవ్రంగా కోత విధిస్తున్నారని, ఏ సమయంలో విద్యుత్ వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదని, కనీసం రాత్రి 30 నిమిషాలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో విద్యుత్ ఇస్తామని చెపుతున్న సిబ్బంది వారం రోజులుగా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. వేలకు వేలు అప్పు చేసి పంటలకు పెట్టుబడి పెడితే విద్యుత్ సరఫరా లేక అవి ఎండిపోతున్నాయని, దీంతో తమకు భారీ నష్టం వాటిల్లుతోందని వాపోయారు. పరిస్థితి ఇలాగే ఉంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని అన్నారు. విద్యుత్ సరఫరా వేళల గురించి సమాచారం చెప్పే విద్యుత్ సిబ్బంది కరువయ్యారని, దీంతో రాత్రింబవళ్లు పొలాల వద్దే జాగారం చేయాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఏఈ భీంసింగ్ సబ్‌స్టేషన్ వద్దకు రాగా ఆయనను రైతులు నిలదీశారు. తమకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కాగా సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని, మరమ్మతు చేయించే వరకు జాప్యం జరుగుతుందని, ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమీపంలో ఉన్న సబ్‌స్టేషన్ నుంచి వ్యవసాయానికి విద్యుత్ అందిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. -
కరెంటు కోతలపై రైతన్న కన్నెర్ర
ఆదిలాబాద్‌లో అర్ధరాత్రి సబ్‌స్టేషన్ ముట్టడి కడెం/కురవి: విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతుండడంతో దిక్కుతోచని రైతులు ఆందోళన బాట పడుతున్నారు. ట్రాన్స్ అధికారుల తీరును నిరిసిస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్లా కడెం సబ్‌స్టేషన్‌ను రైతులు అర్ధరాత్రి ముట్టడించారు. ఉదయం వరకు సమస్య పరిష్కారం కాకపోవడంతో మరోసారి ఆందోళనకు దిగారు. అలాగే, వరంగల్ జిల్లా కురవి మండలం నేరడ సబ్‌స్టేష న్ను ముట్టడించారు. ఆదిలాబాద్ జిల్లా కడెం మండల కేంద్రం లోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆదివారం అర్ధరాత్రి చిట్యాల, బెల్లా ల్, మొర్రిగూడెం, పెర్కపల్లి తదితర గ్రామాలకు చెందిన 200 మంది రైతులు ముట్టడించారు. సబ్‌స్టేషన్ పరిధిలో త్రిఫేజ్ విద్యుత్ సరఫరా వేళలు ఏడు రోజులుగా అమలు చేయడం లేద ని, దీంతో నీరందక పంటలు ఎండుతున్నాయని, లోవోల్టేజీతో మోటార్లు కాలిపోతున్నాయని సిబ్బందిని నిలదీశారు. రెండు గంటలకుపైగా సబ్‌స్టేషన్‌లో బైఠాయించారు. ఎస్సై సతీశ్ చేరుకొని రైతులతో మాట్లాడారు. విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. అయితే, ఉదయం విద్యుత్ సరఫరా చేయకపోవడంతో ఆగ్రహించిన రైతులు మరోసారి సబ్‌స్టేషన్‌కు వచ్చారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఏఈకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తహశీల్దార్ నర్సయ్య, ఏఈ శ్రీనివాస్ వచ్చి నచ్చజెప్పినా వినలేదు. రైతులకు నచ్చజెప్పేందుకు యత్నించిన టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చక్రపాణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు రైతులు పంటలను కాపాడాలని తహశీల్దార్ కాళ్లు మొక్కారు. చివరికి ఐదు గంటల త్రిఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తామని ఏఈ రాసిచ్చిన కాగితంపై తహశీల్దార్ సంతకం చేయడంతో ఆందోళన విరమించారు. వరంగల్ జిల్లా కురవి మండలంలోని రాయినిపట్నంకు చెందిన రైతులు నేరడ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. వందలాది మంది రైతులు సబ్‌స్టేషన్‌లోకి దూసుకెళ్లారు. వేళాపాళా లేకుండా కరెంటు సరఫరా చేస్తున్నారని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి పూట కరెంట్ వద్దని భీష్మించారు. విషయం తెలుసుకున్న ఎస్సై భీమేష్ వచ్చి ఫోన్లో ట్రాన్స్‌కో అధికారులతో మాట్లాడగా.. ఇక నుంచి కరెంటు సరఫరా వేళలు ముందుగానే రైతులకు తెలియజేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. -
ఆ స్థలాలను వదిలేది లేదు
దర్శి : తమ ప్రాణాలు పోయినా సరే స్థలాలను వదిలేది లేదని తహశీల్దార్ కార్యాలయంలో రాజంపల్లికి చెందిన దళితులు మంగళవారం తహశీల్దార్ సిద్ధయ్య వద్ద ఆవేదన వెళ్లగక్కారు. ‘గ్రామ సర్వే నెంబర్ 227లో 4.73 ఎకరాల భూమిలో 97 మందికి 3 సెంట్ల చొప్పున 1998 నవంబర్ 4న తమకు ఇళ్ల పట్టాలు ఇచ్చినా పొజిషన్ చూపలేదని, 2011లో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం స్థలాలను రివైజ్ చేసి తమకు మరోసారి రెండు సెంట్ల చొప్పున స్థలాలను కేటాయించారని, దీనిపై హైకోర్టు కూడా తమకు అనుకూలంగానే స్పందించిందని, గతంలో ఆ స్థలాలను ఆక్రమించిన రైతులు ఆగ్రహించి తమను మూడు నెలల పాటు గ్రామం నుంచి బహిష్కరించారని, ఆ రెండు సెంట్ల స్థలానికైనా పట్టాలిచ్చి పొజిషన్ చూపించాలని’ సోమవారం ఒంగోలులో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో కలెక్టర్‌కు అందజేసిన అర్జీలో తెలిపారు. ఆ విషయాన్ని పత్రికల్లో చూసిన ఆ గ్రామ టీడీపీ నాయకులు వెంటనే ‘ఈ స్థలం ప్రభుత్వానిది, ఆక్రమించిన వారు శిక్షార్హులు’ అని ఓ బోర్డును తలారీతో పాతించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంగళవారం ఉదయం దళితులు ఆ స్థలాల వద్ద ఆందోళనకు దిగారు. తమకు పంపిణీ చేసిన స్థలంలో పొజిషన్ చూపకపోగా 16 ఏళ్ల నుంచి పెట్టని బోర్డు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చిన తెల్లవారుజామున 8గంటల్లోపే పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఆ బోర్డును పీకేశారు. అనంతరం 97 మంది మండల కార్యాలయానికి వెళ్లి తహశీల్దార్‌ను ప్రశ్నించారు. ఈ సర్వే నెంబర్లోనే టీడీపీ నాయకుడు వరిగడ్డి వాములు వేసుకొని అరెకరా ఆక్రమించుకున్నా బోర్డు ందుకు పెట్టలేదన్నారు. సుమారు 570 ఎకరాలు అన్యాక్రాంతమైనా నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దళితులకు ఒక న్యాయం, టీడీపీ నాయకులకు మరో న్యాయమా అని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్ దళితులతో మాట్లాడుతూ ఆ స్థలాల్లో గుడిసెలు వేయవద్దని, రెండు రోజుల్లో తాము వచ్చి పరిశీలించి అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. తహశీల్దార్ వద్ద దళితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్న సమయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు అక్కడే కూర్చున్నా చాలాసేపు నోరు మెదపకపోవడం గమనార్హం. -
ఉత్తరముంటే.. ఉద్యోగం!
దండుకోవడంలో పోటీ! అంగట్లో సబ్స్టేషన్లలోని షిప్ట్ ఆపరేటర్ పోస్టులు అధికార పార్టీ నేతల సిఫారసు లేఖ ఉంటే ఉద్యోగం వచ్చినట్లే ఎమ్మెల్యే, ఎంపీతో పాటు మేయర్, మున్సిపల్ చైర్మన్లూ లేఖలిస్తున్న వైనం తలలు పట్టుకుంటున్న ఎస్పీడీసీఎల్ అధికారులు ఒక్కో లేఖ ఖరీదు రూ.2లక్షలుపైనే సాక్షి, చిత్తూరు: ‘దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం అంటే ఇదే!’ అధికారం పీఠం ఎక్కిన అనతికాలంలోనే ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు కొంతమంది ప్రజాప్రతినిధులు. జిల్లాలో విద్యుత్ సబ్స్టేషన్లలో షిప్ట్ ఆపరేటర్ పోస్టులను బేరానికి పెట్టారు. ఒక్కో పోస్టు ఖరీదు రూ.2లక్షలుగా ఖరారు చేసి బేరం కుదిరిన వారికి సిఫారసు లేఖ ఇస్తున్నారు. ఒకే పోస్టుకు ఇద్దరు, ముగ్గురు ప్రజాప్రతినిధులు లేఖలు ఇవ్వడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎవరికి పోస్టింగ్ ఇవ్వాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల జిల్లాలో చర్చనీయాంశమవుతున్న ఈ అవినీతి బాగోతం వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లాలో ఇటీవల 46 విద్యుత్ సబ్స్టేషన్లను ప్రభుత్వం నిర్మించింది. ఇందులో 43 సబ్స్టేషన్లు 2-3 నెలల కాలంలో ప్రారంభమయ్యాయి. మరో 3 సబ్స్టేషన్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి స్టేషన్లో 3 ఆపరేటర్లు, ఓ వాచ్‌మన్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాలి. ఈ క్రమంలో అనుప్పల్లి, దొడ్డిపల్లి, బోయకొండ, తిరుపతి ఆటోనగర్‌తోపాటు పలు సబ్స్టేషన్లలో ఆపరేటర్ పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తికాలేదు. ఇప్పటికే ప్రారంభించిన కొత్త సబ్స్టేషన్లలో కూడా ఖాళీ లు ఉన్నాయి. తమకు తెలియకుండా వీటిని భర్తీ చేయరాదని విద్యుత్ అధికారులపై అధికార పార్టీ ప్ర జాప్రతినిధులు హుకుం జారీ చే సినట్లు తెలిసింది. తమ నియోజకవర్గ పరిధిలోని పోస్టు ఎవరికి ఇవ్వాలో లిఖిత పూర్వక లేఖ ఇస్తామని, అందులో పేర్కొన్న వారికే ఇవ్వాలని చెప్పినట్లు తెలుస్తోంది. చిత్తూరు నేతల మధ్య రగడ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గాని కి సంబంధించి కొన్ని ఆపరేటర్ పోస్టులకు ఓ మహిళా ప్రజాప్రతినిధి సిఫారసు లేఖ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఇవే పోస్టులకు ఓ ఎంపీ కూడా లేఖ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది చాలదన్నట్లు మరో మహిళా ప్రజాప్రతినిధి మరో లేఖ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఎవరికి ఇవ్వాలో తెలియక అధికారులు తలలుపట్టుకుంటున్నట్లు ఎస్పీడీసీఎల్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఆయా ప్రజాప్రతినిధులకు వివరించినా ఎవరూ లేఖను వెనక్కు తీసుకునేందుకు సిద్ధపడడం లేదు. ‘నా పరిధి అంటే నా పరిధి’ అని వారిలో వారే పంతానికి పోతున్నారు. చేసేదేమీ లేక అధికారులు కూడా వీటి భర్తీకి తాత్కాలికంగా బ్రేక్ వేశారు. ఇదే రగడ తిరుపతి నియోజకవర్గంలోనూ చోటు చేసుకున్నట్లు తెలిసింది. లేఖలు వెనక్కు తీసుకోవాలంటే అభ్యర్థుల నుంచి తీసుకున్న డబ్బులు ఇచ్చేయాలి. దీనికి ప్రజాప్రతినిధులు ససేమిరా అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొంది. దండుకోవడంలో ఉన్న పోటీ అభివృద్ధిలో ఉంటే జిల్లా బాగుపడుతుందని ఐటీఐ విద్యార్థులు అంటున్నారు. -
‘పశ్చిమ’పై సిరా
ఈ మధ్యన తాడేపల్లిగూడెంలో అడ్డగోలు కరెంటు కోతల్ని తట్టుకోలేక ఓ మహిళ అర్ధరాత్రి వేళ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు ఫోన్ చేసింది. ఆయన స్పందించారు. వెంటనే మందీమార్బలం లేకుండా ఒక్కరే నేరుగా హౌసింగ్ బోర్డు ప్రాంతంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌కు వెళ్లి ధర్నా చేపట్టారు. అధికారులు దిగొచ్చారు. వార్డుల్లో అప్పటికప్పుడు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఈ విషయూన్ని పత్రికల్లో చదివిన జనం మనకోసం పనిచేసే మంత్రి ఉన్నారని మురిసిపోయారు. సరిగ్గా వారం క్రితం తాడేపల్లిగూడెంలోనే చోటు చేసుకున్న ఓ ఘటన అదే మంత్రి వ్యవహార శైలిని విమర్శల పాలు చేసింది. ఆ రోజు ఉదయం 11 గంటలైంది. అప్పటికే ఎండ మంటెక్కిపోతోంది. మంత్రి పొరుగూరికి వెళ్లడంతో ఆయన రాక కోసం ఇంటిముందు అధికారులు, రాజకీయ పార్టీల నేతలు, వివిధ వర్గాల ప్రజలు పడిగాపులు కాస్తూ చెట్లకింద కూర్చుని ఉన్నారు. ఇంతలో సైరన్ మోగించుకుంటూ మంత్రి కాన్వాయ్ వచ్చింది. కూర్చున్న వారంతా పరుగు పరుగున ఆయన వాహనం వద్దకు వెళ్లారు. మంత్రి కారు డోరు తీసేందుకు గార్డూ వచ్చాడు. కానీ.. ఆయన కారు దిగలేదు. సెల్‌ఫోన్ మాట్లాడుకుంటూ ఆ ఏసీ కారులోనే కూర్చుండిపోయారు. బయట జనం ఎండలో నిలుచుని మాడిపోతున్నారు. ఆయన మాత్రం కారు దిగలేదు. ఐదు నిమిషాలు.. పది నిమిషాలు.. పావుగంట దాటి ఇరవై నిమిషాలు అవుతుండగా ఎట్టకేలకు కారు దిగివచ్చిన ఆయన ‘బాగున్నారా...’ అంటూ పలకరింపులు మొదలుపెట్టారు. జనంతోపాటు అలా నిలబడిపోయిన ఓ అధికారిని చూసి మంత్రి ‘ఇంట్లోకి రండి మాట్లాడుకుందాం’ అనగానే.. ‘లేద్సార్.. కాళ్లు పీకుతున్నాయి. నీరసంగా ఉంది. లోపల చాలామంది ఉన్నారు. కాసేపు నా కారులో కూర్చుని వస్తాను. దయచేసి ఏమీ అనుకోవద్ద’ని అభ్యర్థించాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మానవతావాదిగా పేరున్న మాణిక్యాలరావులో అధికారం తెస్తున్న మార్పా ఇది అని అక్కడి జనం గుసగుసలాడుకున్నారు. కరెంటు రాకడ.. పోకడ వాన రాకడ.. ప్రాణం పోకడ.. ఎప్పుడు ఎలానో ఎవరికీ తెలియదంటారు. శాస్త్ర, సాంకేతిక రంగాలు వృద్ధి చెందిన తర్వాత అవి కూడా తెలిసిపోతున్నాయి. కానీ.. మన జిల్లాలో మాత్రం కరెంటు ఎప్పుడుంటుంది. ఎప్పుడు పోతుందనేది మాత్రం ఎవరూ చెప్పలేరు. స్వయంగా జిల్లా విద్యుత్ శాఖ అధికారి కూడా ‘మాకూ తెలియదు. ఇచ్చినప్పుడు ఇస్తాం. తీయాలనుకుంటే తీస్తాం..’ అని నిక్కచ్చిగా చెబుతున్నారంటే సర్కారు నిర్లక్ష్యానికి ఇంతకంటే పరాకాష్ట ఏముంటుందనేది సామాన్యుడి వాదన. కరెంటు కోతలు రాష్ర్టమంతటా అన్ని జిల్లాల్లోనూ ఉంటున్నాయి. ఏయే వేళల్లో సరఫరా నిలిపివేస్తారనేది ముందుగా ప్రకటిస్తుంటారు. ఆ వేళలకు అనుగుణంగా ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉంటారు. మన జిల్లాలో మాత్రం కోతల వేళలు ప్రకటించడం సాధ్యం కాదంటూ అధికారులు కరాఖండిగా చెప్పేస్తున్నారు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తామని అధికారంలోకి వచ్చిన పాలకులు కరెంటు కోతలను ఎటూ నివారించలేకపోతున్నారు. కనీసం కోతల సమయం ప్రకటిస్తే ఆ మేరకు సిద్ధంగా ఉంటామనేది ‘పశ్చిమ’ ప్రజల వాదన. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు రాజకీయాల్లో ఈ నానుడి మామూలే.. టైమ్ కలిసొస్తే రాత్రికి రాత్రే పదవులు వరిస్తుం టాయి. సామాన్యులు సైతం అసామాన్యులు అయిపోతుంటారు. ఇంతకూ విషయమేమం టే... ఏలూరుకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, బడా పారిశ్రామికవేత్త అయిన ప్రముఖుడిని కలిసేందుకు జిల్లాలోని మారుమూల ప్రాం తానికి చెందిన ఓ నేత ఎప్పుడొచ్చినా ఫ్లవర్ బొకే తీసుకొచ్చేవారు. బిజీగా ఉండే ఆ సీనియర్ నేతకు ఎప్పుడు కాస్త విరామం దొరుకుతుందో చూసుకుని ఆయనతో మాట్లాడుతుంటాడు. మీ ఆశీర్వాదం ఉంటే చాలన్నట్టు వ్యవహారం నడిచేది. ఇప్పుడు సీన్ మారిపోయింది. ఆ మారుమూల ప్రాంత నేతకు అందలం వచ్చింది. ‘పవర్’తో ఏలూరు వచ్చిన ఆ నేతను కలిసేందుకు సదరు సీనియర్ నేత ఫ్లవర్ బొకే పట్టుకుని అటెన్షన్‌తో వేచివుండటం చూసిన వారంతా ‘ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు’ అంటే ఇదేనేమో అనుకుంటూ ముక్కున వేలేసుకున్నారు. జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు