శివప్రసాదూ...ఇదేమి దుర్బుద్ధి? | Sivaprasadu ... funny, seductive? | Sakshi
Sakshi News home page

శివప్రసాదూ...ఇదేమి దుర్బుద్ధి?

Published Tue, Apr 29 2014 4:11 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

శివప్రసాదూ...ఇదేమి దుర్బుద్ధి? - Sakshi

శివప్రసాదూ...ఇదేమి దుర్బుద్ధి?

  •     ఎంపీ నిధుల్లో చిలక్కొట్టుడు
  •      వీధి దీపాల పంపిణీలో భారీగా అవినీతి
  •      రూ.వెయ్యి విలువచేసే వాటికి రూ.2500 బిల్లు
  •      ఎన్నికల కోడ్ ఉన్నా యథేచ్చగా లైట్ల పంపిణీ
  •      నోరు విప్పడానికి భయపడుతున్న యంత్రాంగం
  •      ‘సాక్షి’ ఆపరేషన్‌లో నిజాలు తేటతెల్లం
  •  చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: ప్రజల కనీస అవసరాలను తీర్చడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రత్యేక నిధులను ప్రభుత్వం కేటాయిస్తుంది. ఉత్తర భారతదేశంలో ఎంపీ నిధుల వినియోగానికి కమీషన్లు అడిగి, కొందరు ప్రజాప్రతినిధులు స్టింగ్ ఆపరేషన్లలో అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. అదే తరహాలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ సైతం ప్రజల మౌలిక వసతులకు కేటాయించిన నిధుల్లో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోమవారం ఓ అజ్ఞాత వ్యక్తి ‘సాక్షి’కి దీనిపై సమాచారం అందించారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది.

    సోమవారం మధ్యాహ్నం 11.30 గంటల సమయంలో వెదురుకుప్పం మండలానికి చెందిన వ్యక్తి, పంచాయతీ కార్యదర్శి ఇద్దరూ కలిసి చిత్తూరు నగరంలోని బజారువీధిలో ఉన్న ఒక ఎలక్ట్రికల్ దుకాణానికి వెళ్లారు. ఆ దుకాణ యజమాని, సర్పంచ్, ఓ వ్యక్తి నుంచి బిల్లుల్లో సంతకాలు పెట్టించుకున్నారు. అక్కడే ఉన్న వినాయకస్వామి ఆలయం ఎదురుగా ఉన్న వీధిలో గోదాములో అప్పటికే ఎంపీ పేరిట స్టిక్కర్లతో ముద్రించి ఉంచిన వీధిదీపాల సెట్లను బయటకు తీసి 14 సెట్లను ఓ ఆటోలో వేసి పంపించారు. ఆటో కొంగారెడ్డిపల్లె సమీపానికి రాగానే ‘సాక్షి’ విలేకరి ఆటోలోని వస్తువులను చూపించమని అడిగితే అలాగేనని ఆటోలో ఉన్న బాక్సులు తెరచి చూపించారు.

    చూస్తే అందులో 80 వాట్స్ పవర్ ఉన్న సీఎల్‌ఎఫ్ బల్బు, డూమ్ ఒకటి, ఓ పైపు, రెండు క్లాంపులు చొప్పున మొత్తం 14 సెట్ల వీధి దీపాలు ఉన్నాయి. వీటిపై డాక్టర్ శివప్రసాద్, ఎంపీ అని ఒకవైపు, రెండో వైపు ఎంపీ ల్యాడ్స్ అని పెద్ద అక్షరాలతో స్టిక్కర్లుఉన్నాయి. వీటి విలువ ఎంత అని సర్పంచ్‌ను అడిగితే *25 వేలని సమాధానమిచ్చారు. మరి బిల్లు ఎక్కడ అని అడిగితే తమ చేతికి ఎలాంటి బిల్లు ఇవ్వలేదని ఆ వ్యక్తి సమాధానమిచ్చి వెళ్లిపోయారు.
     
    ధరలో భారీ తేడా

    వాస్తవానికి ఎంపీ నిధుల నుంచి పంపిణీ చేసిన వీధి దీపాలకు మార్కెట్‌లో లభించే అదే నాణ్యతతో ఉన్న వీధి దీపాల ధరలకు పెద్ద ఎత్తున వ్యత్యాసముంది. 85 వాట్స్ సీఎల్‌ఎఫ్ వీధి దీపం ఒక్కటి రూ.500కి చిత్తూరులోని అన్ని దుకాణాల్లో లభ్యమవుతోంది. దీని డూమ్ ధర రూ.300, ఇనుప పైపు, క్లాంపులు రూ.100కు దొరుకుతున్నాయి. మొత్తం కలిపి ఒక్క సెట్ సీఎల్‌ఎఫ్ వీధి దీపం రూ.900కే లభ్యమవుతోంది.

    అదే వీటిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే రూ.800కు కూడా ఇస్తామని డీలర్లు చెబుతున్నారు. ఇవేమీ తెలియకుండా అసలు ఎంపీ నిధుల నుంచి ఒక్కో వీధి దీపాన్ని రూ.2500 వెచ్చించి కొనుగోలు చేయడం, కనీసం గ్రామ సర్పంచ్‌కు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని వెదురుకుప్పం మండలంలోని సర్పంచ్‌లు అందరూ ప్రశ్నిస్తున్నారు. వీధి దీపాలకు సైతం ఎంపీ శివప్రసాద్ పేర్లు వేయిం చుకుని ఆయన సొంత డబ్బులిచ్చినట్లు డబ్బా కొట్టుకోవడంపై కూడా సర్పంచ్‌లు మండిపడుతున్నారు.
     
    ఆరు నెలల ముందే వేయించాల్సింది

    ఎంపీ నిధుల కింద వీధి దీపాల కొనుగోలుకు ఆరు నెలల క్రితం లెటర్ ఇచ్చిన ఎంపీ శివప్రసాద్, అప్పుడేమీ పట్టించుకోలేదు. ఎన్నికలు సమీపించడంతో హుటాహుటిన నిధులు ఖర్చు పెట్టడానికి కంకణం కట్టుకున్నారు. అనుకున్నదే అదనుగా చిత్తూరు నగరంలోని స్నేహితుడైన ఎలక్ట్రికల్ దుకాణం యజమానికి వీధి దీపాల పంపిణీ వ్యవహారాన్ని పురమాయించారు. ఒట్టి కాగితాలు, బిల్లుల్లో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల నుంచి సంతకాలు పెట్టించుకుని వీధి దీపాలను పంపిణీ చేస్తున్నారు.
     
    కోడ్ ఉల్లంఘన

    వచ్చే నెల 7న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అవేమీ పట్టించుకోకుండా వీధి దీపాలకు సైతం తన పేరిట ఉన్న స్టిక్కర్లు అంటించి మరీ గ్రామాలకు వీటిని తరలిస్తున్నారు. ప్రస్తుతం వెదురుకుప్పం, రామచంద్రాపురం, పూతలపట్టు, ఎస్‌ఆర్ పురానికి చెందిన నాలుగు మండలాల్లో రూ.9లక్షలకు వీధి దీపాలను పంపిణీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
     
    మౌనంగా అధికారులు

    ఈ వ్యవహారంపై ‘న్యూస్‌లైన్’ జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకరరావును సంప్రదించగా, ఇందులో తమకు ఏమీ సంబంధం లేదని తెలిపారు. సీపీవో కార్యాలయంలోనే ఎంపీ, ఎమ్మెల్యే నిధుల పంపిణీ, ఖర్చుల వివరాలు ఉంటాయని పేర్కొన్నారు. సీపీవోను వివరణ కోరడానికి ప్రయత్నిస్తే ఆయన ఫోన్‌కు అందుబాటులోకి రాలేదు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement