వైఎస్‌ను ఎప్పటికీ అభిమానిస్తాం
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: ప్రజల సంక్షేమానికి విశేష కృషి చేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సేవలను మరిచిపోమని, ఆయన్ను ఎప్పటికీ అభిమానిస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని రాయపోల్ సమీపంలో 11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఎన్నటికీ విస్మరించరని కొనియాడారు. వైఎస్సార్ మృతి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందని, తెలంగాణ ప్రకటించిన కాంగ్రెస్‌లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటనే చేరాలని ఆయన పిలుపునిచ్చారు. బాబు సీఎంగా ఉండి తెలంగాణకు చెందిన విలువైన భూములను ఇతరులకు కట్టబెట్టి అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఇటీవల చేస్తున్న ప్రకటనలను గమనిస్తే ఆయన మానసిక పరిస్థితి బాగా లేనట్లు అర్థమవుతోందన్నారు.
ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతానికి ఎంతో అన్యాయం జరిగిందని, వచ్చే రాష్ట్రంలో అందరికీ తాగునీరు, సాగునీటితో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కేటట్లు కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల ‘సాక్షి’ జనసభలో ఇచ్చిన హామీ మేరకు రాయపోల్‌లో విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఎంపీతో కలిసి ప్రారంభించామని చెప్పారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును సీమాంధ్రులు అడ్డుకుంటున్నారని, ఎవరెన్ని కుట్రలు పన్నినా తెలంగాణను ఆపలేరన్నారు. రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్న పార్టీలను తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రాయపోల్ సర్పంచ్ పాశం అశోక్‌గౌడ్ మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంపీ చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్‌రెడ్డి రాంరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు పి.కృపేష్, బి.మహిపాల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిట్టు కృష్ణ, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు మంకాల దాసు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సంజీవ, నాయకులు యాదయ్య, శంకర్‌గౌడ్, నరహరి, రాఘవేందర్‌రావు, రాయపోల్ ఉప సర్పంచ్ జి. బల్వంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ కార్యకర్తల నిరసన
రాయపోల్‌లో ఎంపీ పాల్గొన్న సభ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు కొందరు నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల ఎమ్మెల్యే విద్యుత్ సబ్‌స్టేషన్‌కు ప్రారంభోత్సవం చేసిన తర్వాత తిరిగి ఎలా ప్రారంభిస్తారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందుకు రావటానికి ప్రయత్నించారు. ఈ దశలో పోలీసులు జోక్యం చేసుకుని వారిని పక్కకి పంపించారు.