లోవోల్టేజ్ సమస్యకు చరమగీతం
శరవేగంగా జరుగుతున్న విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు
కొల్లిపర : రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) పరిధిలోని పలు గ్రామాల్లో విద్యుత్ లోవోల్టేజ్ సమస్యకు మరో నాలుగు నెలల్లో చరమగీతం పాడనున్నారు. మండలంలోని పలు గ్రామాలలో లోవోల్టేజ్, అనధికార విద్యుత్ కోతల సమస్యలు ఉన్నా యి. విషయం తెలుసుకున్న అప్పటి శాసన సభాపతి నాదెండ్ల మనోహర్ చొరవ తీసుకుని రూ.8 కోట్లతో 132/32 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు.
ప్రభుత్వం నుంచి నిధులను విడుదల చేయించారు. 2014లో చక్రాయపాలెంలో 132.32కేవీ సబ్ స్టేషన్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణ పనులు 80శాతం వరకు పూర్తి అయ్యాయి. మిగిలిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భవన నిర్మాణం, ప్రహరి గోడ, విద్యుత్ పరికరాల ఏర్పాటుకు అవసరమైన పిల్లర్ల నిర్మాణం పూర్తిచేశారు. అలాగే విద్యుత్ పరికారాలు, మరికొంత మెటీరియల్ రావలసి ఉంది.
తీరనున్న విద్యుత్ సమస్య
ఈ సబ్ స్టేషన్ నుంచి నాలుగు 32 కె.వి సబ్‌స్టేషన్‌లకు విద్యుత్‌ను సరఫరా చేస్తారు. తెనాలి ఆటోనగర్, కొల్లిపర మండలంలోని మున్నంగి, కొల్లూరు మండలంలోని చిలుమూరు, కొల్లూరులో ఉన్న ఫీడర్ సబ్‌స్టేషన్‌లకు విద్యుత్ సరఫరా లైన్‌లను ఏర్పాటు చేశారు. తాడికొండ నుంచి తెనాలి, తెనాలి నుంచి చక్రయపాలెంలోని ఈ విద్యుత్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరా అయ్యేలా లైన్‌లను ఏర్పాటు చేశారు.
లోవోల్టేజ్ కారణంగా అనేక సందర్భాలలో పలు గ్రామాలలో గృహోపకరణాలు దెబ్బతిన్నాయి. ఈ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే పలు ఆ గ్రామాలలో వోల్టేజి సమస్య తీరుతుంది. విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా ఉంటుంది. మరో నాలుగు నెలల్లో సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి అవుతుందని ట్రాన్స్‌కో ఎడిఈ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. దీనివల్ల సీఆర్‌డీఏ పరిధిలో పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు తొలగిపోతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.