పరిగిరూరల్ : హైటెన్షన్ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు వల్ల పాడైన పంటకు పరిహారం ఇవ్వడం లేదంటూ మండల పరిధిలోని మాదారం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శంకర్‌పల్లి నుంచి పరిగి విద్యుత్ సబ్‌స్టేషన్ వరకు హైటెన్షన్ విద్యుత్(టవర్) స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటకు సంబంధిత రైతుల అనుమతులు తీసుకొని పనులు చేస్తున్నారు. రెండు నెలల క్రితం టవర్లు ఏర్పాటు చేసేందుకు దిమ్మెలు ఏర్పాటు చేశారు. నెలలు దాటుతున్నా టవర్లు బిగించడం లేదంటూ రైతులు పంటలను సాగు చేసుకున్నారు. మొక్కజొన్న, పత్తి పంటలు వేసిన పొలాల్లో పదిహేను రోజుల క్రితం టవర్లను ఏర్పాటు చేశారు.
టవర్లు ఏర్పాటు చేసేందుకు పొలాల్లోకి ట్రాక్టర్ రావడం, తాళ్లతో టవర్ పట్టీలను లాగడం వంటి పనులు పంటచేలలో చేశారు. ఈ పనులు చేస్తున్న సమయంలో ఒక్కో పొలంలో అర ఎకరా, పావు ఎకరా పంట పూర్తిగా నేల మట్టమైంది. దీనికి పరిహారం అందించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అయితే పరిహారం అందించడంలో కూడా మరో చిక్కు సమస్య రైతులను వేధిస్తోంది. చాలా మంది తమ పొలాలను ఇతరులకు కౌలుకు ఇచ్చారు. పట్టాదారుతో పనులు చేస్తున్న కాంట్రాక్టర్ విద్యుత్ స్తంభం(టవర్) ఏర్పాటుకు, పరిహారానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. భూముులను లీజుకు తీసుకుని వేలరూపాయలు వెచ్చించి పంట నష్టపోయిన తమకు పరిహారం ఇవ్వకపోవడమేమిటని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారులతో చర్చిస్తాం
టవర్లు వేసే సమయంలో పొలం యజమాలనులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రస్తుతం ఆ పొలంలో వేరొకరు పంటలను సాగు చేస్తున్నారు. పంట నష్టపోయిన కౌలురైతులకే పరిహారం దక్కాలి. ఈ విషయమై సంబంధిత ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం, కౌలు రైతులు, పొలం యజమానులు కూడా ఇందుకు సహకరించాలి.
ఏఈ రాజ్‌కుమార్
పత్తి మొక్కలు నేలపాలు
రంగాపూర్ గ్రామానికి చెందిన నర్మమ్మ పొలం కౌలుకు తీసుకొని పత్తిపంట సాగు చేశాను. విద్యుత్తు స్తంభం ఏర్పాటు పనుల్లో భాగంగా పత్తి పొలంలో ట్రాక్టర్ తిప్పి కాయలు పట్టిన మొక్కలను నేలపాలు చేశారు. మాకు పరిహారం అందించాలని సంబంధింత కాంట్రాక్టర్‌తో మాట్లాడగా పొలం సొంతదారుకే పరిహారం అంటున్నారు. పరిహారం మాకే అందించేలా అధికారులు చొరవచూపాలి.
కౌలు రైతు బాలయ్య(మాదారం)
నష్టం ఒకరిది... పరిహారం మరొకరికా..?
Published Tue, Oct 14 2014 11:43 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement