ముచ్చర్ల విద్యుత్ సబ్‌స్టేషన్‌పై రైతుల దాడి
- ఫర్నిచర్ ధ్వంసం
- కార్యాలయం ఎదుట రాస్తారోకో
కామేపల్లి :విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్నాయని, నిర్ణీత సమయమంటూ లేకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామేపల్లి మండలం ముచ్చర్ల సబ్‌స్టేషన్‌పై బుధవారం తెల్లవారుజామున మద్దులపల్లి గ్రామ రైతులు దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సబ్‌స్టేషన్ గేటు తొలగించి రోడ్డుపై పడేశారు. కిటికీలు పగలకొట్టి రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రతిరోజు రాత్రిపూట కనీసం నాలుగు గంటలు విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండగా, వారం రోజులుగా తీవ్రంగా కోత విధిస్తున్నారని, ఏ సమయంలో విద్యుత్ వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదని, కనీసం రాత్రి 30 నిమిషాలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాత్రి వేళల్లో విద్యుత్ ఇస్తామని చెపుతున్న సిబ్బంది వారం రోజులుగా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. వేలకు వేలు అప్పు చేసి పంటలకు పెట్టుబడి పెడితే విద్యుత్ సరఫరా లేక అవి ఎండిపోతున్నాయని, దీంతో తమకు భారీ నష్టం వాటిల్లుతోందని వాపోయారు. పరిస్థితి ఇలాగే ఉంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని అన్నారు. విద్యుత్ సరఫరా వేళల గురించి సమాచారం చెప్పే విద్యుత్ సిబ్బంది కరువయ్యారని, దీంతో రాత్రింబవళ్లు పొలాల వద్దే జాగారం చేయాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఏఈ భీంసింగ్ సబ్‌స్టేషన్ వద్దకు రాగా ఆయనను రైతులు నిలదీశారు. తమకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కాగా సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిందని, మరమ్మతు చేయించే వరకు జాప్యం జరుగుతుందని, ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమీపంలో ఉన్న సబ్‌స్టేషన్ నుంచి వ్యవసాయానికి విద్యుత్ అందిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.
అన్నదాత ఆగ్రహం
Published Thu, Oct 2 2014 2:52 AM | Last Updated on Mon, Oct 1 2018 2:27 PM
Advertisement