ఈ మధ్యన తాడేపల్లిగూడెంలో అడ్డగోలు కరెంటు కోతల్ని తట్టుకోలేక ఓ మహిళ అర్ధరాత్రి వేళ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు ఫోన్ చేసింది. ఆయన స్పందించారు. వెంటనే మందీమార్బలం లేకుండా ఒక్కరే నేరుగా హౌసింగ్ బోర్డు ప్రాంతంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌కు వెళ్లి ధర్నా చేపట్టారు. అధికారులు దిగొచ్చారు. వార్డుల్లో అప్పటికప్పుడు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఈ విషయూన్ని పత్రికల్లో చదివిన జనం మనకోసం పనిచేసే మంత్రి ఉన్నారని మురిసిపోయారు. సరిగ్గా వారం క్రితం తాడేపల్లిగూడెంలోనే చోటు చేసుకున్న ఓ ఘటన అదే మంత్రి వ్యవహార శైలిని విమర్శల పాలు చేసింది. ఆ రోజు ఉదయం 11 గంటలైంది. అప్పటికే ఎండ మంటెక్కిపోతోంది. మంత్రి పొరుగూరికి వెళ్లడంతో ఆయన రాక కోసం ఇంటిముందు అధికారులు, రాజకీయ పార్టీల నేతలు, వివిధ వర్గాల ప్రజలు పడిగాపులు కాస్తూ చెట్లకింద కూర్చుని ఉన్నారు.
ఇంతలో సైరన్ మోగించుకుంటూ మంత్రి కాన్వాయ్ వచ్చింది. కూర్చున్న వారంతా పరుగు పరుగున ఆయన వాహనం వద్దకు వెళ్లారు. మంత్రి కారు డోరు తీసేందుకు గార్డూ వచ్చాడు. కానీ.. ఆయన కారు దిగలేదు. సెల్‌ఫోన్ మాట్లాడుకుంటూ ఆ ఏసీ కారులోనే కూర్చుండిపోయారు. బయట జనం ఎండలో నిలుచుని మాడిపోతున్నారు. ఆయన మాత్రం కారు దిగలేదు. ఐదు నిమిషాలు.. పది నిమిషాలు.. పావుగంట దాటి ఇరవై నిమిషాలు అవుతుండగా ఎట్టకేలకు కారు దిగివచ్చిన ఆయన ‘బాగున్నారా...’ అంటూ పలకరింపులు మొదలుపెట్టారు. జనంతోపాటు అలా నిలబడిపోయిన ఓ అధికారిని చూసి మంత్రి ‘ఇంట్లోకి రండి మాట్లాడుకుందాం’ అనగానే.. ‘లేద్సార్.. కాళ్లు పీకుతున్నాయి. నీరసంగా ఉంది. లోపల చాలామంది ఉన్నారు. కాసేపు నా కారులో కూర్చుని వస్తాను. దయచేసి ఏమీ అనుకోవద్ద’ని అభ్యర్థించాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మానవతావాదిగా పేరున్న మాణిక్యాలరావులో అధికారం తెస్తున్న మార్పా ఇది అని అక్కడి జనం గుసగుసలాడుకున్నారు.
కరెంటు రాకడ.. పోకడ
వాన రాకడ.. ప్రాణం పోకడ.. ఎప్పుడు ఎలానో ఎవరికీ తెలియదంటారు. శాస్త్ర, సాంకేతిక రంగాలు వృద్ధి చెందిన తర్వాత అవి కూడా తెలిసిపోతున్నాయి. కానీ.. మన జిల్లాలో మాత్రం కరెంటు ఎప్పుడుంటుంది. ఎప్పుడు పోతుందనేది మాత్రం ఎవరూ చెప్పలేరు. స్వయంగా జిల్లా విద్యుత్ శాఖ అధికారి కూడా ‘మాకూ తెలియదు. ఇచ్చినప్పుడు ఇస్తాం. తీయాలనుకుంటే తీస్తాం..’ అని నిక్కచ్చిగా చెబుతున్నారంటే సర్కారు నిర్లక్ష్యానికి ఇంతకంటే పరాకాష్ట ఏముంటుందనేది సామాన్యుడి వాదన. కరెంటు కోతలు రాష్ర్టమంతటా అన్ని జిల్లాల్లోనూ ఉంటున్నాయి. ఏయే వేళల్లో సరఫరా నిలిపివేస్తారనేది ముందుగా ప్రకటిస్తుంటారు. ఆ వేళలకు అనుగుణంగా ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉంటారు. మన జిల్లాలో మాత్రం కోతల వేళలు ప్రకటించడం సాధ్యం కాదంటూ అధికారులు కరాఖండిగా చెప్పేస్తున్నారు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తామని అధికారంలోకి వచ్చిన పాలకులు కరెంటు కోతలను ఎటూ నివారించలేకపోతున్నారు. కనీసం కోతల సమయం ప్రకటిస్తే ఆ మేరకు సిద్ధంగా ఉంటామనేది ‘పశ్చిమ’ ప్రజల వాదన.
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు
రాజకీయాల్లో ఈ నానుడి మామూలే.. టైమ్ కలిసొస్తే రాత్రికి రాత్రే పదవులు వరిస్తుం టాయి. సామాన్యులు సైతం అసామాన్యులు అయిపోతుంటారు. ఇంతకూ విషయమేమం టే... ఏలూరుకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, బడా పారిశ్రామికవేత్త అయిన ప్రముఖుడిని కలిసేందుకు జిల్లాలోని మారుమూల ప్రాం తానికి చెందిన ఓ నేత ఎప్పుడొచ్చినా ఫ్లవర్ బొకే తీసుకొచ్చేవారు. బిజీగా ఉండే ఆ సీనియర్ నేతకు ఎప్పుడు కాస్త విరామం దొరుకుతుందో చూసుకుని ఆయనతో మాట్లాడుతుంటాడు. మీ ఆశీర్వాదం ఉంటే చాలన్నట్టు వ్యవహారం నడిచేది. ఇప్పుడు సీన్ మారిపోయింది. ఆ మారుమూల ప్రాంత నేతకు అందలం వచ్చింది. ‘పవర్’తో ఏలూరు వచ్చిన ఆ నేతను కలిసేందుకు సదరు సీనియర్ నేత ఫ్లవర్ బొకే పట్టుకుని అటెన్షన్‌తో వేచివుండటం చూసిన వారంతా ‘ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు’ అంటే ఇదేనేమో అనుకుంటూ ముక్కున వేలేసుకున్నారు.
జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు
‘పశ్చిమ’పై సిరా
Published Sun, Jul 6 2014 12:39 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement
Advertisement