కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: విద్యుత్ సబ్ స్టేషన్లలో ఆపరేటర్ పోస్టులు అంగటి సరుకుగా మారాయి. సంబంధింత కాంట్రాక్టర్లు పోస్టులకు రేటు ఫిక్స్ చేసి ఒప్పందం కుదిరిన వారి నుంచే దరఖాస్తులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా పోస్టుల భర్తీ ప్రకటన నిరుద్యోగుల్లో ఆశలు రేపుతుంటే కాంట్రాక్టర్లు, దళారులతోపాటు కొందరు అధికారులకు కాసుల వర్షం కురుస్తోంది. తీసుకునేది ఔట్ సోర్సింగ్ (కాంట్రాక్టు) ప్రాతిపదికలోనైనా నాలుగైదేళ్లు పని చేస్తే రెగ్యులర్ అవుతాయని చెబుతూ వసూళ్లకు దిగుతుతన్నట్లు తెలుస్తోంది. అధికారులకు కూడా వాటా ఇవ్వాలంటూ ఒక్కో పోస్టుకు రూ. 3లక్షల నుంచి రూ. 5లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
అయితే ఉద్యోగాలు గగనకుసుమంగా మారిన నేపథ్యంలో నిరుద్యోగులు ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుని సగం మొత్తం ముట్టజెప్పి దరఖాస్తులు ఇస్తున్నారు. సబ్‌స్టేషన్ నిర్వాహణ పనులు చేసే కాంట్రాక్టర్లే వారికి జీతాలిస్తుండడంతో పోస్టుల భర్తీ ప్రకటనలు కూడా వారే ఇచ్చుకున్నారు. కాంట్రాక్టర్ల పేరుమీదే ఉద్యోగ ప్రకటనలు రావడంతో అంత తమదేనన్న రీతిలో వారు వ్యవహరిస్తుండగా అధికారులు మౌనం వహిస్తుండడం గమనార్హం.
ఖాళీలు.. జీతాలు:
జిల్లా వ్యాప్తంగా 157 ఆపరేటర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. కర్నూలు డివిజన్‌లో 42, నంద్యాల 45, ఆదోని 39, డోన్ డివిజన్‌లో 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో పనిచేస్తున్న ఆపరేటర్లు 2007లో సీజేఎల్‌ఎంలుగా అర్హత సాధించడంతో ఈ మేరకు ఖాళీలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి వీటి భర్తీ కోసం రెండుసార్లు నిర్ణయం తీసుకున్నా కాంట్రాక్టర్లు, దళారుల వసూళ్ల బాగోతం కారణంగా వెనక్కు తగ్గారు. అయితే కొరత కారణంగా ఉన్న సిబ్బందిపై పని భారం పెరగడంతో సీపీడీసీఎల్ సీఎండీ రిజ్వీ వీటి భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ప్రకటనలు ఇచ్చిన కాంట్రాక్టర్లు ఈ నెల 15వతేదిని దరఖాస్తు గడువుగా నిర్ణయించారు. ఐటీఐ ఉన్న ఆపరేటర్లకు స్కిల్డ్ కింద రూ.9817 చెల్లిస్తారు. పీఎఫ్ రూ.780, ఈఎస్‌ఐ రూ.172, ట్యాక్సు రూ.196 పోగా రూ.8,669 చేతికి ఇస్తారు.
అప్లికేషన్ తీసుకోవాలంటే ముట్టజెప్పాల్సిందే..
ఆపరేటర్ల భర్తీ ప్రక్రియలో కొందరు కాంట్రాక్టర్లు, అధికార పార్టీ నాయకులు, అధికారులు, మధ్య దళారులు దందాలు ప్రారంభించారు. దరఖాస్తుల స్వీకరణ సమయంలోనే భేరం కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. దేవనకొండ, కోడుమూరు మండలాల్లో అధికార పార్టీ నాయకులు నలుగురు అభ్యర్థుల నుంచి సగం మొత్తాన్ని వసూలు చేసినట్లు తెలిసింది.
జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
అంగట్లో ఆపరేటర్ పోస్టులు
Published Fri, Feb 14 2014 3:45 AM | Last Updated on Wed, Sep 5 2018 3:50 PM
Advertisement
Advertisement