ఆదిలాబాద్‌లో అర్ధరాత్రి సబ్‌స్టేషన్ ముట్టడి
కడెం/కురవి: విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతుండడంతో దిక్కుతోచని రైతులు ఆందోళన బాట పడుతున్నారు. ట్రాన్స్ అధికారుల తీరును నిరిసిస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్లా కడెం సబ్‌స్టేషన్‌ను రైతులు అర్ధరాత్రి ముట్టడించారు. ఉదయం వరకు సమస్య పరిష్కారం కాకపోవడంతో మరోసారి ఆందోళనకు దిగారు. అలాగే, వరంగల్ జిల్లా కురవి మండలం నేరడ సబ్‌స్టేష న్‌ను ముట్టడించారు. ఆదిలాబాద్ జిల్లా కడెం మండల కేంద్రం లోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆదివారం అర్ధరాత్రి చిట్యాల, బెల్లా ల్, మొర్రిగూడెం, పెర్కపల్లి తదితర గ్రామాలకు చెందిన 200 మంది రైతులు ముట్టడించారు. సబ్‌స్టేషన్ పరిధిలో త్రిఫేజ్ విద్యుత్ సరఫరా వేళలు ఏడు రోజులుగా అమలు చేయడం లేద ని, దీంతో నీరందక పంటలు ఎండుతున్నాయని, లోవోల్టేజీతో మోటార్లు కాలిపోతున్నాయని సిబ్బందిని నిలదీశారు. రెండు గంటలకుపైగా సబ్‌స్టేషన్లో బైఠాయించారు. ఎస్సై సతీశ్ చేరుకొని రైతులతో మాట్లాడారు. విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. అయితే, ఉదయం విద్యుత్ సరఫరా చేయకపోవడంతో ఆగ్రహించిన రైతులు మరోసారి సబ్‌స్టేషన్‌కు వచ్చారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.
ఏఈకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తహశీల్దార్ నర్సయ్య, ఏఈ శ్రీనివాస్ వచ్చి నచ్చజెప్పినా వినలేదు. రైతులకు నచ్చజెప్పేందుకు యత్నించిన టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు చక్రపాణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు రైతులు పంటలను కాపాడాలని తహశీల్దార్ కాళ్లు మొక్కారు. చివరికి ఐదు గంటల త్రిఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తామని ఏఈ రాసిచ్చిన కాగితంపై తహశీల్దార్ సంతకం చేయడంతో ఆందోళన విరమించారు. వరంగల్ జిల్లా కురవి మండలంలోని రాయినిపట్నంకు చెందిన రైతులు నేరడ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. వందలాది మంది రైతులు సబ్‌స్టేషన్‌లోకి దూసుకెళ్లారు. వేళాపాళా లేకుండా కరెంటు సరఫరా చేస్తున్నారని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి పూట కరెంట్ వద్దని భీష్మించారు. విషయం తెలుసుకున్న ఎస్సై భీమేష్ వచ్చి ఫోన్‌లో ట్రాన్స్‌కో అధికారులతో మాట్లాడగా.. ఇక నుంచి కరెంటు సరఫరా వేళలు ముందుగానే రైతులకు తెలియజేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
కరెంటు కోతలపై రైతన్న కన్నెర్ర
Published Tue, Sep 30 2014 12:49 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement