కళకళలాడుతన్న పంటపొలాలు
- వ్యవసాయానికి కరెంటు కోతలు
- 9 గంటలకు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
- జిల్లాలో 2.80 లక్షల కనెక‌్షన్‌లపై ప్రభావం
- అయోమయంలో అన్నదాత
టాస్క్‌ఫోర్స్, సాక్షి: వ్యవసాయానికి ఈనెల 8వ తేదీ నుంచి 9 గంటల కరెంటు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో రైతన్నలు ఆందోళనకు లోనవుతున్నారు. అవసరం లేని కాలంలో 15 గంటల కరెంట్ ఇచ్చి.. అవసరమైన సమయంలో 9 గంటలకు తగ్గించడంతో అవస్థలు పడుతున్నారు. వరి పొట్టదశకు వచ్చిన వేళలో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడమేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 2.80 లక్షల వ్యవసాయ కనెక‌్షన్లు ఉన్నాయి. రెండేళ్లుగా ఆశించిన స్థాయిలో వర్షాలు లేక బోర్లు ఎండిపోయాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు అడపాదడపా కురిసిన వర్షాలకు బోర్లలో కొంతవరకు నీరు చేరింది. దీంతో చాలామంది రైతులు.. ముఖ్యంగా బోరు ఉన్నవారు వరితో పాటు ఆరుతడి పంటలు వేశారు.
ఇదిలా ఉండగా గతంలో ప్రభుత్వం జిల్లాలో రోజుకు 15 గంటల విద్యుత్ సరఫరా చేసింది. ఏ గ్రూప్ క్రింద 15 గంటలు, బీ గ్రూప్ క్రింద 12 గంటల చొప్పున విద్యుత్తు అందించారు. కానీ, ఈ నెల 8వ తేది నుంచి వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సమయాన్ని కుదిస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
దీని ప్రకారం ‘ఏ’ గ్రూప్‌నకు ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు, ‘బి’గ్రూప్ కింద ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, రాత్రి 2 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సరఫరా చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
జలవనరులతో కరెంట్‌కు డిమాండ్
ఇటీవల కురిసిన వర్షాలకు చాలా బోర్లు పనిచేస్తున్నాయి. అదేవిధంగా గత నెల 25వ తేదిన సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు మంత్రి హరీశ్‌రావు చొరవతో 0.35 టీఎంసీల నీళ్లు విడుదల అయ్యాయి. దీంతో మంజీరా నది పొడవునా సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టు వరకు 5 హెచ్‌పీ నుంచి 10 హెచ్‌పీ మోటార్లు విరామం లేకుండా నీటిని తోడేస్తున్నాయి.
అలాగే ఘనపురం ప్రాజెక్టు దిగువన కూడా మంజీరా నదిలో ఉన్న రింగు బావుల నీటిని సైతం రైతులు వినియోగించుకుంటున్నారు. దీంతో కరెంట్ వినియోగం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో అవరమైన సమయంలో కరెంట్ సరఫరా వేళలు తగ్గించొద్దని కనీసం 12 గంటల కరెంట్ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.