పోలవరం: విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతుండడంతో ఆగ్రహించిన రైతులు బుట్టాయగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద శనివారం ఆందోళన నిర్వహించారు. మూడు నెలలుగా విద్యుత్ సక్రమంగా అందివ్వకపోవడంతో బుట్టాయగూడెం మండలం అచ్చియ్యపాలెం, కండ్రికగూడెం, ఎన్‌ఆర్ పాలెం తదితర గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయి. అనేకమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో రైతులు శనివారం పెద్ద సంఖ్యలో స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ వద్దకు చేరి నిరసనకు దిగారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పొగాకును సాగు చేస్తున్నామని, విద్యుత్ మోటార్లు ఉన్నా కరెంట్ సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కూలీలను నియమించుకున్నా కరెంట్ లేకపోవడం వల్ల వారు ఖాళీగా ఉండాల్సి వస్తోందని, దీంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నట్టు చెప్పారు. ఎలక్ట్రికల్ ఏఈ వి.రవిశంకర్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్ చేసి రప్పించారు. ఏఈ వచ్చిన తర్వాత రైతులు, ఏఈ మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడం వల్ల సర్దుబాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. వినతిపత్రం ఇస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని ఏఈ హామీ ఇచ్చారు. దీంతో వినతిపత్రం ఇచ్చిన రైతులు మూడు రోజుల్లోగా సమస్య పరిష్కారంకాకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ పొడియం శ్రీనివాస్, రైతులు సయ్యద్ బాజీ, ఎన్‌ఎస్‌వి వెంకట్రావు, రెడ్డి వెంకట్రావు, కొండపల్లి కృష్ణ, అప్సాని రాజా, పిన్నమనేని సత్యనారాయణ, గద్దే శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment