మేకలవారిపల్లె (తర్లుపాడు), నూస్‌లైన్: అప్రకటిత విద్యుత్ కోతలపై అన్నదాతలు ఆగ్రహించారు. తర్లుపాడు మండలంలోని మేకలవారిపల్లె విద్యుత్ సబ్‌స్టేషన్‌ను శుక్రవారం ఉదయం ముట్టడించారు. వారంరోజులుగా రోజుకు రెండుమూడు గంటలు కూడా వ్యవసాయ విద్యుత్ సరఫరా కావడంలేదని, పంటలకు నీరందక ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పనిచేసే సిబ్బంది అక్రమాలకు పాల్పడుతూ కొన్ని ఫీడర్లకు 7 గంటలు, మరికొన్ని ఫీడర్లకు మూడు నుంచి నాలుగు గంటల పాటు, అదీ విడతల వారీగా విద్యుత్ సరఫరా చేస్తున్నారని రైతులు ఆగ్రహించారు.
మండలంలోని ఓబాయిపల్లె, మేకలవారిపల్లె, కొండా రెడ్డిపల్లె, కలుజువ్వలపాడు, మంగళకుంట, తదితర గ్రామాలకు చెందిన సుమారు 100 మందికిపైగా రైతులు ముందుగా సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. అక్కడ అధికారులు అందుబాటులో లేకపోవడంతో సబ్‌స్టేషన్ ఎదురుగా ఒంగోలు - మార్కాపురం రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. దీంతో రెండువైపులా అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో స్థానిక సిబ్బంది విద్యుత్‌శాఖ ఏఈకి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఏఈ రామప్రసాదరెడ్డిపై రైతులు వాదనకు దిగారు. స్థానిక సబ్‌స్టేషన్ సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే తమ ఫీడర్‌కు తక్కువ సమయం విద్యుత్ సరఫరా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
అక్రమ కనెక్షన్లు ఎక్కువగా ఉన్నందున తరచూ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని, దీనివల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని ఏఈ సర్దిచెప్పారు. అక్రమ కనెక్షన్లను ఎందుకు తొలగించడంలేదంటూ రైతులు ప్రశ్నించారు. రైతుల ఆగ్రహంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం వల్ల విద్యుత్ సిబ్బంది ఫోన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదుచేశారు. సిబ్బందితో కలిసి రంగంలోకి దిగిన తాడివారిపల్లె ఎస్సై గాయం శివన్నారాయణరెడ్డి అక్కడకు చేరుకుని రాస్తారోకో విరమించాలని రైతులకు సూచించారు. సమస్య పరిష్కారానికి విద్యుత్ అధికారులతో చర్చించాలని చెప్పారు. దీంతో రైతులు రాస్తారోకో విరమించడంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం అక్కడకు చేరుకున్న విద్యుత్‌శాఖ మార్కాపురం డీఈ.. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక లోపం కారణంగానే అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నామని, రెండుమూడు రోజుల్లో సాంకేతిక లోపాలను సరిచేసి సక్రమంగా విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అప్రకటిత కోతలపై ఆగ్రహం
Published Sat, Jan 11 2014 3:32 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement