కరెంట్‌పై రచ్చ లేకుండానే అసెంబ్లీ: హరీశ్
సిద్దిపేట: విద్యుత్ కోతలపై రచ్చ లేకుండానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినట్టు శాసనసభ వ్యవహారాలు, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సమైక్య రాష్ట్రంలో మూడు దశాబ్దాల క్రితం చోటుచేసుకున్న పరిణామం నేటి తెలంగాణ తొలి రాష్ట్ర శాసనసభలో మరోసారి ఆవిష్కృతమైందన్నారు. శనివారం ఆయన మెదక్ జిల్లా సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో యాంత్రీకరణ పథకం కింద రైతులకు సబ్సిడీపై పరికరాలు, యంత్రాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత 30 ఏళ్లలో జరిగిన ప్రతి అసెంబ్లీ సమావేశంలో కరెంటు కోతలు, రైతు సమస్యలపై గొడవలు జరిగాయన్నారు. కానీ ఈసారి తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ఎక్కడా కరెంటు సమస్య, విద్యుత్ కోతలపై గొడవ జరగకపోవడం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. వేసవిలో రైతులకు పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్‌ను అందిస్తామన్నారు.