రాజేంద్రసింగ్‌కు పురస్కారాన్ని అందజేస్తున్న మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో పల్లా, వి. ప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: ‘నీళ్లు, వ్యవసాయంపై గత ఏడేళ్లలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు రాష్ట్రానికి లక్ష్మిని తెచ్చిపెడుతున్నాయి. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బీఐ) తాజా వార్షిక నివేదిక ప్రకారం 2014–15లో రూ. 5.50 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) విలువ 2021–22లో రెట్టింపై రూ. 11.54 లక్షల కోట్లకు పెరిగింది. వ్యవసాయం, అను బంధ రంగాల్లో సాధించిన వృద్ధి జీఎస్‌డీపీ పెరుగుదలకు దోహదపడింది.
ఈ రంగాల ఉత్పత్తి విలువ రూ. 90,828 కోట్ల నుంచి రూ. 2,16,285 కోట్లకు పెరగడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం సైతంరూ. 2,78,933కు పెరిగింది. జీఎస్‌డీపీ వృద్ధిలో ఏటా ఒక రాష్ట్రాన్ని అధిగమిస్తూ రాష్ట్రం పురోగమిస్తోంది. తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది’అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు.
ఆదివారం హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో నదులపై జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిన వెంటనే నదుల పునరుజ్జీవం, చెరువుల పునరుద్ధరణను సీఎం కేసీఆర్ ప్రాధాన్య అంశంగా చేపట్టారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన 46 వేల చెరువులను మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించడంతో 25 లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా, మరో 25 లక్షల ఎకరాలకు పరోక్షంగా సాగునీరు లభిస్తోందని హరీశ్‌రావు చెప్పారు.
గతంలో భారీ వర్షాలకు చెరువులు తెగిప్రాణ, ఆస్తి నష్టం జరిగేదని, మిషన్ కాకతీయ కింద చెరువు కట్టలు, తూ ములు, అలుగులను పటిష్టం చేయడంతో అలాంటి ఘటనలు జరగడం లేదన్నారు. వా గులు, వంకల్లోని నీళ్లు వృథా కాకుండా రూ. 6 వేల కోట్లతో రాష్ట్రంలో 4 వేల చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నామన్నారు. ప్రతి వర్షపు చుక్కను చెరువులు ఒడిసి పట్టుకుంటున్నాయని, చెక్‌డ్యాముల్లో ఏడాదంతా నీళ్లు నిల్వ ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు.
గోదావరిపై 141 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 5 రిజర్వాయర్లను నిర్మించడంతో 300 కి.మీల జీవనదిగా మారిందని వివరించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లను వెనక్కి తీసుకొచ్చి నదికి కొత్త నడకను సీఎం కేసీఆర్ నేర్పారని ప్రశంసించారు. వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేం ద్రసింగ్ ఆలోచనల్నే సీఎం కేసీఆర్ అమలు చేశారని వివరించారు. ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమతులకు ఏళ్లు పడుతున్నాయని, ఈ విధానంలో మార్పులు రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
రెండేళ్లలో రైతు ఆత్మహత్యలు కనుమరుగు: పల్లా రాజేశ్వర్‌రెడ్డి
రైతుబంధు, సాగునీరు, కరెంట్ సదుపాయంతో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని, రెండేళ్లలో పూర్తిగా నిర్మూలిస్తామని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జల సంరక్షణకు కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు సదస్సు చివరలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురస్కారాలు అందజేశారు.
మూడేళ్లలో మూసీలో తాగునీళ్లు...
మూసీ నది ప్రక్షాళన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, ఎస్టీపీల నిర్మాణం, మురుగు కాల్వ మళ్లింపు పనులు జరుగుతున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గోదావరి నీళ్లను సైతం మూసీకి తరలిస్తున్నామన్నారు. రెండు, మూడేళ్లలో మూసీలో స్వచ్ఛమైన తాగునీళ్లను చూస్తామన్నారు. మూసీని ప్రక్షాళన చేయాలని రాజేంద్రసింగ్ విజ్ఞప్తి చేయగా హరీశ్‌రావు ఈ మేరకు హామీ ఇచ్చారు. స్వచ్ఛమైన మూసీ నది ఒడ్డున మూడేళ్ల తర్వాత రాజేంద్రసింగ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో జలవిశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని రాజేంద్రసింగ్ ఈ అంళాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
దేశంలోని నదులన్నీ ఐసీయూలో..: రాజేంద్రసింగ్
గంగ, యమున, మూసీ సహా దేశంలోని నదులన్నీ ఐసీయూలో ఉన్నాయని, వాటి పరిరక్షణకు అధిక చొరవ తీసుకోవాల్సిన అవసరముందని రాజేంద్రసింగ్ స్పష్టం చేశారు. దేశంలో ఒక్క నది కూడా ఆరోగ్యంగా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కళ్లలో నీళ్లున్నాయని, నీళ్లపై లక్ష్మిని ఖర్చు పెడుతున్నారని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment