![Minister Harish Rao Addresses Farmers Forum inaugural meeting At Medak - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/4/Minister-Harish-Rao.jpg.webp?itok=ipmjy3NS)
సాక్షి, మెదక్: సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి కావడం వల్ల బడ్జెట్లో మూడో వంతు రైతుల కోసమే ఖర్చు చేస్తున్నామని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. గురువారం జరిగిన రైతు వేదిక ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2500 రైతు వేదికలు నిర్మించామని, గత ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యం చేసినా, తమ ప్రభుత్వం రైతులకు అన్ని విధాల చేయూతనిస్తూ, వ్యవసాయాన్ని పండగలా మార్చిందన్నారు. 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నకిలీ విత్తనాలు రాజ్యమేలాయని, గిట్టుబాటు ధరలు లేక రైతులు నానా ఇబ్బందులు పడ్డారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రైతు బీమా పధకం ద్వారా వారం రోజుల్లో కుటుంబీకుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నామన్నారు. గత పాలకులు ఘనపూర్ ఆనకట్ట నిర్మాణానికి రూపాయి ఖర్చుచేయలేదని, నీళ్ల మంత్రిగా తానే ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశానన్న విషయాన్ని గర్తు చేశారు. మరో 25 కోట్లతో ఘనపురం అనకట్టను అధునీకరిస్తామని ఆయన హామీనిచ్చారు. రేపో మాపో సింగూరుకు కాళేశ్వరం కాలువ కలుస్తుందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మెదక్ ప్రాంత రైతులకు రెండు పంటలకు నీళ్లు అందిస్తామని హామీనిచ్చారు. గత ప్రభుత్వాల పాలనలో కొంటూర్ చెరువు గురించి ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి ఎన్ని దరఖాస్తులు చేసినా నయా పైసా కేటాయించలేదని, తమ ప్రభుత్వం వచ్చాక చెరువుకు నిధుల వరద పారిందన్నారు.
దసరాలోపు కాళేశ్వరం నీళ్లతో ఈ ప్రాంత రైతుల కాళ్ళు తడుపుతామని మంత్రి హామీ ఇచ్చారు. యాసంగిలో 50 లక్షల ఎకరాల వరి పంట వేశారంటే అది తమ ప్రభుత్వ కృషి వల్లేనని మంత్రి పేర్కొన్నారు. మంజీర మీద 14 చెక్ డ్యామ్‌లు కట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. రైతు బంధు కింద జిల్లాకు రూ 200 కోట్లు ఇచ్చామని మంత్రి వెల్లడించారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి పనులను కేవలం 7 ఏళ్లలో చేసి చూపించామన్నారు. మెదక్ పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, మెదక్ నుంచి వరంగల్ వరకు హైవేను నిర్మిస్తామని, ఎన్ని నిధులైనా వెచ్చించి మెదక్ పట్టణ రూపురేఖలు మార్చేస్తామని మంత్రి హామీలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment